వైభవోపేతంగా మహంకాళి బోనాలు


Fri,June 21, 2019 01:14 AM

సిటీబ్యూరో/బేగంపేట, నమస్తే తెలంగాణ : ఉజ్జయిని మహంకాళి ఆషాడ బోనాల జాతరను వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. జూలై 21, 22 తేదీల్లో రెండు రోజులపాటు జాతర జరుగుతుందని, అన్ని రకాల ఏర్పాట్లు చేసి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామన్నారు. గురువారం దేవాలయ ఆవరణలో బోనాల పండుగ ఏర్పాట్లపై పలు శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయ ఆవరణ, పరిసరాల్లో పర్యటించిన ఆయన, చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. తదనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నదని, ఆషాడ బోనాల పండుగ దేశంలోనే కాకుండా, విదేశాల్లో సైతం ప్రఖ్యాతిగాంచిందన్నారు. బోనాల జాతరలో పాల్గొనేందుకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. చిన్న చిన్న ఆలయాలు, దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. బోనాల జాతర కోసం జీహెచ్‌ఎంసీ నుంచి రూ.27 కోట్లను ఖర్చు చేయనున్నామని, ఈ నిధులతో రోడ్లు, ఫుట్‌పాత్‌లు, విద్యుత్ దీపాల ఏర్పాట్లను చేయనున్నామన్నారు. ఆలయ పరిసరాల్లో ఫ్లడ్‌లైట్లు, పటిష్టమైన బారీకేడింగ్ చేయించనున్నామన్నారు.

మహిళలకు మూడు క్యూలైన్లు..
బోనాలు ఎత్తుకొని వచ్చే మహిళల కోసం ప్రత్యేకించి మూడు క్యూలైన్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. రాంగోపాల్‌పేట పాత పోలీస్‌స్టేషన్ నుంచి ఒక క్యూలైన్, బాటా చౌరస్తా నుంచి రెండో క్యూలైన్, జనరల్ బజార్ చౌరస్తా నుంచి మూడో క్యూలైన్‌ను ఏర్పాటు చేయనున్నామన్నారు. బోనాలు ఎత్తుకొచ్చే వారికి ఇబ్బందులు కలుగకుండా, భక్తుల కోసం మంచినీటి వసతి కల్పించడం, ముఖ్యంగా పోలీసుశాఖ వారు ట్రాఫిక్ రద్ధీని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆలయం పక్కన ఉన్న స్తంభాల వల్ల భక్తులకు ఇబ్బంది ఏర్పడుతుందని, వాటిని తొలిగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్, సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, జోనల్ కమిషనర్ రఘుప్రసాద్, కార్పొరేటర్ అత్తెల్లి అరుణ శ్రీనివాస్‌గౌడ్, ఆలయ ఈవో అన్నపూర్ణ, ఆర్డీవో రాజాగౌడ్, సికింద్రాబాద్ తహసీల్దార్ విజయభాస్కర్, మహంకాళి ఏసీపీ వినోద్, ఇంజినీరింగ్ ఈఈ వెంకటదాసు, జలమండలి అధికారి కృష్ణ, డీఎంఅండ్‌హెచ్‌వో డా.వెంకటి తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...