బీసీ ఓటర్ల గణన..


Fri,June 21, 2019 01:13 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న బీసీ ఓటర్ల గణన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే జరగనున్నది. అయితే గ్రేటర్ పరిధిలో మాత్రం ప్రస్తుత పాలకమండలికి ఇంకా ఏడాదిన్నర గడువు ఉండడంతో ముందస్తు ఎన్నికలకు ఆస్కారం లేదు.

రాజ్యాంగం స్థానిక సంస్థలకు ఐదేండ్ల కాలవ్యవధిని నిర్దేశించింది. జీహెచ్‌ఎంసీ యాక్టు ప్రకారం కూడా స్థానిక సంస్థల పాలన గడువు ఐదేండ్లు. అలాగే స్థానిక సంస్థలకు ఎన్నికైన పాలకమండలిని రద్దుచేసి ముందస్తు ఎన్నికలు నిర్వహించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయితే కొత్తగా ఎన్నికయ్యే పాలకమండలి పదవీకాలం మాత్రం ఐదేండ్లు ఉండదు. గత పాలకమండలి మిగిలివున్న సమయం వరకు మాత్రమే కొత్త పాలకమండలి పరిపాలన చేసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్ల ముందే పాలకమండలిని రద్దుచేసి ఎన్నికలు నిర్వహిస్తే, కొత్తగా ఎన్నికయ్యే పాలకమండలి మిగిలిన ఆ రెండేళ్లు మాత్రమే పరిపాలన సాగించే వీలుంటుంది. అనంతరం మళ్లీ ఎన్నికలు నిర్వహించక తప్పదు. ఈ మేరకు రాజ్యంగంతోపాటు బల్దియా యాక్టు కూడా స్పష్టంచేస్తున్నాయి.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జనవరి 2016లో జరగగా, అదే ఏడాది ఫిబ్రవరి 11న కొత్త పాలకమండలి బాధ్యతలు స్వీకరించింది. ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ఫిబ్రవరి 2021 వరకు ఉంది. దీని ప్రకారం ఈ పాలకమండలి పదవీకాలం ఇంకా ఏడాదిన్నర ఉంది. ఒకవేళ ప్రభుత్వం మిగిలిన మున్సిపాలిటీలతోపాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కూడా నిర్వహించాలనుకుంటే ప్రస్తుత పాలకమండలిని రద్దు చేయాల్సి ఉంటుంది. అయితే, రాజ్యాంగం ప్రకారం, బల్దియా యాక్టు ప్రకారం కొత్తగా ఎన్నికయ్యే పాలకమండలి ఫిబ్రవరి 2021వరకు మాత్రమే పాలన సాగించే వీలుంటుంది. అనంతరం మళ్లీ ఎన్నికలు నిర్వహించక తప్పదు. అందుకే జీహెచ్‌ఎంసీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించే ఆస్కారం లేదని స్పష్టంగా చెప్పవచ్చు.

వచ్చే ఎన్నికల కోసమే గణన
ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతోపాటు జీహెచ్‌ఎంసీలోనూ బీసీ ఓటర్ల గణన చేపడుతున్నప్పటికీ ఇక్కడ ముందస్తు ఎన్నికలకు ఆస్కారం లేదని స్పష్టమవుతుంది. గడువు ప్రకారం 2021లో నిర్వహించే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు బీసీ రిజర్వేషన్లు ఖరారుచేసేందుకు ప్రస్తుతం చేపడుతున్న బీసీ ఓటర్లనే పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పుడు బీసీ ఓటర్ల వివరాలు సిద్ధం చేసుకుంటే ఎన్నికలకు ముందు ప్రత్యేకంగా బీసీ ఓటర్ల గణన నిర్వహించాల్సిన పని ఉండదు. అందుకే ఇతర మున్సిపాలిటీలతోపాటు ఇక్కడ కూడా బీసీ గణన నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

బీసీ ఓటర్ల గణన షెడ్యూల్
- ఓటర్ల గుర్తింపు అధికారుల నియామకం, వారికి
శిక్షణ- 21-06-19(1రోజు)
- బీసీ ఓటర్ల గుర్తింపునకు డోర్ టూ డోర్ సర్వే- 22-
06-19 నుంచి 04-07-19(12రోజులు)
-బీసీ ఓటర్ల మార్కింగ్‌తో కూడిన కాపీల తయారీ-
05-07-19(1రోజు)
-ముసాయిదా ప్రచురణ-06-07-19(1రోజు)
-వాదనలు, అభ్యంతరాల స్వీకరణ- 07-07-19
నుంచి 11-07-19(5రోజులు)
-వాదనలు, అభ్యంతరాల అనంతరం ముసాయిదాలో మార్కింగ్- 12-07-19 నుంచి
14-07-19(3రోజులు)
-వాదనలు, అభ్యంతరాల
క్షేత్రస్థాయి పరిశీలన- 15-07-19 నుంచి 16-07-19(2రోజులు)
-క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఓటర్ల జాబితాలో
బీసీ ఓటర్ల మార్కింగ్- 17-07-19(1రోజు)
-వార్డులవారీగా బీసీ ఓటర్ల తుది జాబితా ప్రచురణ- 18-07-19)(1రోజు)
-ఓటర్ల తుదిజాబితాను మున్సిపల్ శాఖ డైరెక్టర్‌కు అందజేత- 19-07-19(1రోజు)

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...