మహా నగరం.. సంగీత సాగరం


Fri,June 21, 2019 01:11 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: స్వర లేదా వాయిద్య శబ్దాల రూపం, సామరస్యం, అందమైన భావోద్వేగాల వ్యక్తీకరణ వెరసీ సంగీతమవుతోంది. రాత పూర్వకమైన లేదా ముద్రితమైన సంకేతాలు స్వర లేదా వాయిద్య ధ్వనులను సూచిస్తున్నాయి. సంగీతం ఒక సాగరం లాంటిది. హిందుస్థానీ, కర్ణాటక సంగీతాలు దేశంలోనే అత్యుత్తమమైనవి. ఉత్తర భారత దేశమంతా హిందుస్థాని సంగీతాన్ని ప్రామాణికంగా తీసుకుంటుండగా, దక్షణ భారత దేశమంతా కర్టాటక సంగీతాన్ని నేర్చుకుంటూ, దానినే ప్రామాణికంగా తీసుకుంటోంది. ప్రధానంగా దక్షణ భారతంలోని తెలుగు రాష్ర్టాలకు సంబంధించినంత వరకు అన్నమయ్య, భద్రాచల రామదాసు, క్షేత్రయ్య, త్యాగరాజు, సారంగపాణి వంటి స్వరకర్తలు సంగీత రంగంలో మార్గదర్శకులు. వాయిద్య సంగీతం విభాగంలో ద్వారం వెంకటస్వామి నాయుడు (వయోలిన్), ఎమాని శంకర శాస్త్రి (వీణ), షేక్ చిన మౌలానా (నాద స్వరం), చిట్టిబాబు (వీణ) వంటి దిగ్గజాలు ప్రసిద్ధి చెందారు. స్వర సంగీతం సమకాలీన ప్రతిభావంతులలో వోలేటి వెంకటేశ్వర్లు, మంగళం పల్లి బాల మురళీకృష్ణ, నేదునూరి కృష్ణమూర్తి, ద్వారమ్ భవనారాయణ రావు, శ్రీరంగం గోపాలరత్నం, యెల్లా వెంకటేశ్వర్ రావు, సతీష్ కుమార్ (మృదంగం), రామ, యు.శ్రీనివాస్ (మాండలిన్), డి.శ్రీనివాస్ (వీణ), మారెళ్ల కేశవరావు, ఇవటూరి విజయేశ్వరరావు (వయోలిన్)లు ఆయా రంగాలలో సుప్రసిద్ధులు.

తెలంగాణలో కర్టాటక సంగీతం
తెలంగాణలో కర్టాటక సంగీతం నుంచి జానపద సంగీతం వరకు విభిన్నమైన వైవిధ్యాలున్నాయి. భక్త రామదాసు లేదా భద్రాచల రామదాసుగా ప్రసి ద్ధి చెందిన కంచెర్ల గోపన్న 17వ శతాబ్దపు భారతీయ రామ భక్తుడు, కర్ణాటక సంగీత స్వరకర్త. రామదాసు తెలుగు భాషలో ప్రసిద్ధ వాగ్గేయకారుడు. సాహిత్యాన్ని కంపోజ్ చేయడమే కాకుండా వాటిని సంగీతానికి అమర్చిన వ్యక్తి.

ప్రపంచ సంగీతోత్సవం
1981లో ఫ్రాన్స్‌లో షురూ అయిన సంగీతోత్సవం ఇప్పటి వరకు జరుపుకుంటున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మౌరిస్ ఫ్లెరిట్ గుర్తుగా సంగీతంలో సాధనా, పరిణామాలు మరింతగా కొనసాగాలని ఫ్రాన్స్‌లో ప్రారంభమైన సంగీత ఉత్సవం నేటికీ కొనసాగుతోంది. అప్పటి నుంచి ఈ పండుగ అంతర్జాతీయ దృగ్విషయంగా మారింది. చైనాతో సహా 120 దేశాలలో, 700 లకు పైగా నగరాలలో జూన్ 21 న జరుపుకుంటున్నారు. భారతదేశం, జర్మనీ, ఇటలీ, గ్రీస్, రష్యా, ఆస్ట్రేలియా, పెరూ, బ్రెజిల్, ఈక్వెడార్, మెక్సికో, కెనడా, యునైటెడ్ స్టేట్స్, యూకే, జపాన్ ఈ సంగీతోత్సవాన్ని అనుసరిస్తున్నాయి.

నగరం సంగీత కళా క్షేత్రం
లలిత కళల వర్సిటీలు, మ్యూజిక్, డాన్స్ కళాశాలలు, సంగీత, నృత్య అకాడమీలతో హైదరాబాద్ మహా నగరం దినదిన ప్రవర్థ మానంగా విరాజిల్లుతోంది. ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రైవేట్ అకాడమీలు, ఇతరత్రా విద్యా సంస్థలు ఎన్నో నగర జనానికి అందుబాటులో ఉండి సంగీతంలో తర్ఫీదును ఇస్తున్నాయి. వివిధ రకాల కళలు, కళాకారులు, సంగీత కళా వేదికలు, సంగీత కచేరీలతో నగరం నిత్యం నూతనంగా అలంకరించబడుతోంది. నిత్యం బిజీగా ఉంటూ నగర జనానికి ఏదో ఒక సాంస్కృతిక కళా క్షేత్రం ద్వారా ఉపశమనాన్ని అందిస్తోంది. చిన్నారులు, యువత, వయోజనులకు సంగీతంలో శిక్షణను ఇచ్చేందుకు పలు సంగీత క్షేత్రాలు నగరాన్ని చుట్టు ముట్టి ఉన్నాయి. నరగంలో ఎటువైపు చూసినా నేర్చుకునేందుకు సంగీత శిక్షకులు, నేర్చుకున్న దానిని ప్రదర్శించేందుకు పలు అకాడమీలు, సాంస్కృతిక కళా క్షేత్రాలు అం దుబాటులో ఉన్నాయి. దేశంలో పేరు గడించిన పలువురు గాయకులు, సంగీత సామ్రాట్లు, విదేశీ నిఫుణులు ఎందరెందరో నగరంలో పలుమార్లు పలు వేదికలపై వారి నైపుణ్యతను చాటుతున్నారు. ఇటీవల జాతీయ స్థాయి గాయకులు గాన గంధర్వుడు కేజే ఏసుదాసు, కేఎస్ చిత్ర, ఎస్పీ బాలు మొదలైన వారివి ఎన్నో గాత్ర కచేరీలు కొనాసాగాయి. నేడు సాయంత్రం గాయకులు శంకర్ మహదేవన్ సంగీత కచేరి మాదాపూర్‌లోని శిల్పా కళా వేదికపై కొనసాగనుంది. అయితే, శనివారం సాయంత్రం ప్రముఖ గాయని ఆల్కా యాగ్నిక్ గాత్ర కచేరి సైతం శిల్ప కళా వేదికపై జరుగనుంది. గతంలో ప్రపంచ స్థాయి గాయకులు వేంగా బోయ్స్ సైతం హైదరాబాద్ నగరానికి విచ్చేసి వారి సంగీత కచేరిని ఏర్పాటు చేశారు. నగరంలోనూ ప్రపంచ స్థాయి సంగీతం ఉందనడానికి ఇదో ఉదాహరణ.

మన కళాశాలలు.. సంగీత వేదికలు
హైదరాబాద్ మహా నగరంలో ప్రత్యేకంగా లలిత కళలకు సంబంధించి పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఆంధ్ర మహాసభ, త్యాగరాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల, అన్నమయ్య ప్రభు త్వ కళాశాల, త్యాగరాయ గానసభ సంగీత, నృత్య కళాశాల, ఇంకా ఇతరత్రా అకాడమీలు, కళా క్షేత్రాలు ఎన్నో చిన్నారులు, యువత కోసం ప్రధానంగా శిక్షణ, ప్రయోగాత్మకంగా పరిశోధనల కోసం అందుబాటులో ఉన్నాయి.

122
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...