బోనాలను వైభవంగా నిర్వహిస్తాం


Thu,June 20, 2019 12:40 AM

- జూలై 4న గోల్కొండ కోటలో తొలిబోనం
- సమన్వయంతో పనిచేయాలి
- పలు శాఖల అధికారుల సమీక్షా సమావేశంలో మంత్రి తలసాని
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గోల్కొండ జగదాంబికా మహంకాళి ఆషాడబోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జూలై 4 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు బోనాల జాతరను ఘనంగా నిర్వహించనున్నామని ఆయన ప్రకటించారు. ముందుగా గోల్కొండ కోట నగీనాబాగ్ సమీపంలో ఉన్న పుట్ట వద్ద మంత్రి కార్వాన్ టీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి ఠాకూర్ జీవన్‌సింగ్, సంఘ సేవకులు రాజు వస్తాద్‌లతో కలిసి పూజలు చేశారు. బుధవారం వివిధ శాఖల అధికారులు, దేవస్థాన సభ్యులతో కలిసి జాతరకు చేయాల్సిన ఏర్పాట్లపై గోల్కొండ కోటలో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన మన పండుగల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటే విధంగా ఆషాడ బోనాల జాతరను అత్యంత వైభవంగా జరిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హిందూ, ముస్లింల సఖ్యతతో వ్యవహరించి గోల్కొండ బోనాల జాతరను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని, ఇదే స్ఫూర్తిగా ఈ ఏడాది సైతం కొనసాగించాలన్నారు.

జూలై 4వ తేదీన లంగర్‌హౌస్ నుంచి ఘటాల ఊరేగింపు ప్రారంభమవుతుందని, బోనాల సందర్భంగా ప్రతి వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారు. భక్తుల సౌకర్యార్థం రోడ్ల మరమ్మతులు, తాగునీరు, డ్రైనేజీ, వీధిదీపాలు, ఫ్లడ్‌లైట్లు, బారీకేడింగ్, సీసీ కెమెరాల నిఘా ఏర్పాట్ల పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఆది, మంగళవారాల్లో అత్యధికంగా భక్తులు వస్తుంటారని, కనుక తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. త్రీడీ మ్యాపింగ్ స్క్రీన్ల ద్వారా వీక్షణ, బోనాల సందర్భంగా వంటలు చేసుకునేందుకు ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వైద్యశిబిరాలు, అంబులెన్స్, ఆధ్యాత్మిక భక్తి వాతావరణం ప్రతిబింబించేలా కళాబృందాల ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీ సౌకర్యాల కోసం చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ రీజనల్ మేనేజర్ ఖుస్రోషాఖాన్‌కు చెప్పగా నగరంలో 25 ప్రాంతాల నుంచి సుమారు 150 బస్సులను బోనాల సందర్భంగా గోల్కొండ కోటకు నడుపనున్నట్లు ఆయన చెప్పారు. అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారి పాపయ్యను ఆదేశించారు.

దీంతో ఆయన ఎప్పుడూ ఓ ఫైరింజిన్, ఓ బుల్లెట్‌ను పెట్టడం జరుగుతుందని, ఈసారి అదనంగా మరో బుల్లెట్ పెడుతామని చెప్పారు. విద్యుత్ సమస్యలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటామని విద్యుత్‌శాఖ సీజీఎం సాయిబాబా, ఎస్‌ఈ నర్సింహా స్వామిలు తెలిపారు. అదే విధంగా లంగర్‌హౌస్ నుంచి గోల్కొండ వరకు, గోల్కొండ కోటలో 300 విద్యుత్ దీపాలను అలంకరించనున్నామని చెప్పారు. గోల్కొండ చుట్టుపక్కల రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీ మరమ్మతుల గురించి వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని జోనల్ కమిషనర్ ముషారఫ్ ఫారూఖీకి సూచించగా, ఆయన మూడు కోట్ల రూపాయలతో వెంటనే రోడ్ల పనులను చేపట్టనున్నామని అన్నారు. బోనాలను ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీస్‌శాఖ ఎంతో ఉత్తమంగా పని చేస్తుందని, డివిజన్‌లో 9 మంది ఇన్‌స్పెక్టర్లు, అదనపు బలగాలతో భారీ బందోబస్తును ఏర్పాట్లు చేస్తామని ఏసీపీ నర్సింహారెడ్డి తెలిపారు. పారిశుధ్య పనుల కోసం అదనపు సిబ్బందిని వినియోగించాలని, జనరేటర్లు, అదనపు బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. ఈ సమావేశంలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మెహియుద్దీన్, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ ముషారఫ్‌అలీ ఫారూఖీ, ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి, జలమండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణ, డీసీపీ బాబురావు, కార్పొరేటర్లు మిత్రకృష్ణ, బంగారు ప్రకాశ్ పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...