ఆభరణాల వ్యాపారిని దోచేందుకు కుట్ర


Thu,June 20, 2019 12:29 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: అర్ధరాత్రి దుకాణం మూసేసి ఇంటికి వెళ్లే బంగారం వ్యాపారుల కండ్లలో కారం చల్లి, కత్తులతో బెదిరించి భారీ దోపిడీ చేయాలనుకుంటున్న ఐదుగురు పాత నేరస్తుల కుట్రను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ చైతన్యకుమార్ కథనం ప్రకారం.. యాకుత్‌పురాకు చెందిన మీర్ అక్బర్ అలీ, మాదన్నపేట్‌కు చెంది న సయ్యద్ ఇర్ఫాన్ హుస్సేన్ అలియాస్ గోర ఇర్ఫాన్‌లు రెయిన్ బజార్ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటీర్లుగా నమోదయ్యారు. అలాగే మహ్మద్ ముజాఫర్ అలియాస్ ముజ్జు భవనానీనగర్ పీఎస్ పరిధిలో అనుమానితుడిగా, మహమ్మద్ రఫీ పలు దొంగతనం కేసులు ఎదుర్కొంటున్నాడు. మహ్మద్ అబ్దుల్ హసన్ అలియాస్ కాల జామున్‌తో కలిసి వారంతా ముఠాగా ఏర్పాడ్డారు. చెడు అలవాట్లకు బానిసయ్యారు. నేరాలు చేస్తూ డబ్బు సంపాదిస్తుంటారు.

ఇందులో భాగంగా గత ఏప్రిల్‌లో శాలిబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఓ ఆభరణాల వ్యాపారిని దోపిడీ చేసిన ఘటనను స్ఫూర్తిగా తీసుకున్నారు. అదేమాదిరిగా అర్ధరాత్రి ఎవరైనా అభరణాల వ్యాపారిని దోపిడీ చేయాలని స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా మహారాష్ట్ర నాందేడ్‌కు వెళ్లి ఐదు డ్యాగర్లు(కత్తులు), ముష్టి ఘాతుకానికి ఉపయోగించే మరో ఆయుధాన్ని కొనుగోలు చేశారు. చార్మినార్ ప్రాంతంలో చాలామంది ఆభరణాల వ్యాపారులున్నారు. వారు అర్ధరాత్రి సమయంలో తమ దుకాణాలను మూసివేసి ఇండ్లకు వెళ్తుంటారు. దీంతో మూడు రోజులుగా ఓల్డ్‌సిటీ ప్రాంతంలో రెక్కీ నిర్వహించారు. యాఖుత్‌పురా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ గ్యాంగ్ ఆభరణాల వ్యాపారుల కోసం కాపుకాసింది. సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ మధుమోహన్‌రెడ్డి బృందం ఈ ముఠాను అదుపులోకి తీసుకొని విచారించింది. డ్యాగర్లు, ఇతర ఆయుధాలతో పాటు రెండు ప్యాకెట్ల మిర్చి పౌడర్‌కూడా వీరి వద్ద లభ్యమయ్యింది. ఆభరణాల వ్యాపారి కండ్లలో కారం చల్లి దోపిడీ చేయాలని ఈ ముఠా స్కెచ్ చేసి అమలు చేసే పనిలో ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఈ ముఠాను తదుపరి విచారణ నిమిత్తం రెయిన్ బజార్ పోలీసులకు అప్పగించారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...