ఎక్కడ.. ఎంత పరిమాణం..


Thu,June 20, 2019 12:28 AM

సిటీబ్యూరో: గ్రేటర్‌లో ఏ ప్రాంతంలో అత్యధిక వాయుకాలుష్యం నమోదవుతున్నది.. ఎక్కడ కాలుష్యమేఘాలు కమ్ముకున్నాయో.. కావాలంటే ఇక నుంచి నిమిషాల వ్యవధిలోనే తెలుసుకోవచ్చు. నగరంలో ఏ ఏ వాయువులు.. ఎంత పరిమాణంలో ఉన్నాయో.. ఎంత ప్రమాదకరమో ఇట్టే తెలుసుకోవచ్చు. ఫలానా ప్రాంతంలో అత్యధిక కాలుష్యం వెలువడుతున్నట్లుగా వెల్లడించే టీవీలు ఇప్పుడు నగరమంతా ఏర్పాటు కాబోతున్నాయి. నగరంలో వెలువడుతున్న కాలుష్య వివరాలను ఎప్పకప్పుడు నగరవాసులకు అందించేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకోసం పొల్యూషన్ డిస్‌ప్లేలను టీవీలను ఏర్పాటు చేస్తున్నది. పొల్యూషన్ వివరాలను పౌరుల చెంతకే చేర్చడంలో భాగంగా వీటిని బిగిస్తున్నారు. ఇటీవలే అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సనత్‌నగర్‌లోని పీసీబీ ప్రధాన కార్యాలయంలో అతిపెద్ద డిస్లేప్ టీవీని అమర్చగా, మరో మూడు ప్రాంతాల్లో డిస్‌ప్లే లను అమర్చబోతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఎంజీబీఎస్ (ఇమ్లిబన్), సచివాలయంలలో వీటిని ఏర్పాటు చేయబోతున్నారు. ఇది వరకు శంషాబాద్ విమానాశ్రయం.. సనత్‌నగర్‌లోని పీసీబీ కార్యాలయం, యశోద వైద్యశాలల్లో చిన్నసైజు టీవీలను ఏర్పాటు చేయగా, తాజాగా పెద్ద సైజు డిస్‌ప్లే టీవీలను ఏర్పాటు చేయబోతున్నారు. ఒక్కో డిస్‌ప్లేను సుమారుగా రూ.. 5 లక్షల వ్యయంతో నెలకొల్పనున్నట్లు పీసీబీ అధికారులు వెల్లడించారు.

గతంలో అయితే..
కాలుష్య గణాంకాలంటే అదో పెద్ద ప్రహసనం. ఇది వరకు ఎక్కడైనా నమోదైన తెలుసుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది. పీసీబీ అధికారులు అత్యంత గోప్యంగా ఉంచడంతో ఈ వివరాలేవీ అందుబాటులో ఉండేవి కావు. కాలుష్య వివరాలను పబ్లిక్ డొమెన్‌లో ఉంచాలని సీపీబీసీ ఆదేశించడంతో వివరాలను ప్రజలకు తెలిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్‌లో ఆరు నేషనల్ ఎయిర్ మానిటరింగ్ ప్రోగ్రాం స్టేషన్ల ద్వారా 24 గంటల పాటు, మరో 12 స్టేట్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్ల ద్వారా ఎనిమిది గంటల పాటు, మరో ఆరు సెంట్రల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్ల ద్వారా కాలుష్యాన్ని లెక్కిస్తున్నారు. అయితే ఈ 24 స్టేషన్లలో ఎక్కడ ఎంత కాలుష్యం నమోదవుతున్నదో తెలుసుకోవాంటే ఇది వరకు అత్యంత క్లిష్టంగా ఉండేది. ప్రత్యేకించి సామాన్య పౌరులకు ఈ వివరాలేవి అందుబాటులో ఉండేవి కావు. తాజాగా నెలకొల్పబోయే పొల్యూషన్ డిస్‌ప్లే టీవీల ద్వారా క్షణాల వ్యవధిలో ఎక్కడ ఎంత కాలుష్యం నమోదైంది? పరిమితులు ఎంత, పరిమితులకు లోబడే నమోదవుతున్నదా..? లేక, పరిమితి మించి పోయిందా అన్నది నేరుగా తెలుసుకునే వీలు కలుగుతున్నది. పైగా వీటిని బహిరంగ ప్రదేశాల్లో, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంతో అందరికి ఈ వివరాలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...