జల్సాల కోసం.. దోపిడీలు, దొంగతనాలు


Thu,June 20, 2019 12:26 AM

- ఇద్దరు నిందితులు అరెస్ట్, ముగ్గురు బాలలు జువైనల్‌హోంకు
- మరో ఇద్దరు పరారీలో...
- రూ.2.10లక్షల సొత్తు స్వాధీనం
ఉప్పల్, (నమస్తే తెలంగాణ) : జల్సాలు, గంజాయికి అలవాటుపడిన యువకులు దోపిడీలు, చోరీల బాటపట్టారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఇద్దరిని రిమాండ్‌కు తరలించగా, ముగ్గురు బాలలను జువైనల్‌హోంకు తరలించారు. వారి నుంచి రూ.2.10 లక్షల విలువైన ఆభరణాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నాచారంలోని సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ డీసీపీ క్రైమ్స్ రాంచంద్రారెడ్డి వివరాలను వెల్లడించారు. జవహర్‌నగర్, బాలాజీనగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ నవీన్‌కుమార్(29), కూలీ పనిచేసే దాసర్ల యాదగిరి(20), విద్యార్థి(17), క్యాంటీన్ వర్కర్(17), బ్యాండ్ ప్లేయిర్ బాలుడు(17), ఉమామహేశ్వర్‌రావు, బాలరాజులు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు గంజాయి, జల్సాలకు అలవాటుపడి .. డబ్బుల కోసం దొంగతనాలబాట పట్టారు. దారిదోపిడీలు, తాళం ఉన్న ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ఒంటరిగా ఉన్న వ్యక్తుల ఇండ్లను గుర్తించి చోరీలకు పాల్పడుతుంటారు.

కాగా.. కీసర మండలం, రాంపల్లి ఆర్‌ఎల్‌నగర్‌కు చెందిన నాగరాజ కన్నన్ ఈ నెల 11న ఈసీఐల్ వెళ్లి .. తిరిగి ఇంటికి వెళ్లడానికి ఆటో కోసం వేచిచూస్తున్నాడు. గమనించిన ఈ ముఠా సభ్యులు నాగరాజకన్నన్‌ను ఆటోలో ఎక్కించుకున్నారు. రాంపల్లి ప్రాంతం వైపు వెళ్లకుండా, పోలీసుల తనిఖీలు ఉన్నాయని చెప్పి బండ్లగూడ వైపుగా తీసుకువెళ్లారు. తిమ్మాయిపల్లి ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి..ఆటోడ్రైవర్ నవీన్‌కుమార్, మరో నలుగురు అతన్ని బెదిరించి బంగారు ఉంగరం, రూ.21,110 నగదు, మోటోజీ ఫోన్, రెండు డిబెట్ కార్డులు లాక్కొని వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు... సీసీ కెమెరాలు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులను బుధవారం నాగారం చౌరస్తాలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 23 గ్రాముల బంగారం, 13 తులాల వెండి ఆభరణాలు, 20 స్మార్ట్‌ఫోన్లు, రూ.11 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నవీన్‌కుమార్ పాత నేరస్తుడిగా గుర్తించారు. గతంలో ఇతనిపై పీడీ యాక్ట్ కూడా ప్రయోగించారు. ఇతనిపై 15 కేసులు ఉన్నట్లు తేలింది. నిందితుల్లో ఇద్దరిని రిమాండ్‌కు తరలించగా, మరో ముగ్గురిని జువైనల్ హోంకు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంతో వ్యవహరించిన పోలీసులను డీసీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సీసీఎస్ సీఐలు లింగయ్య, జగన్నాథరెడ్డి, రుద్రభాస్కర్, శివశంకర్‌రావు, ఎస్సై క్రిష్ణ, సిబ్బంది బ్రహ్మం, బాల్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...