రోజూ 500 మెట్రిక్‌ టన్నుల రీసైక్లింగ్‌


Wed,June 19, 2019 01:00 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నిర్మాణ వ్యర్థాల(డెబ్రిస్‌)ను పునర్వినియోగానికి అనువుగా మార్చేందుకు వీలుగా దాన్ని రీసైక్లింగ్‌ చేసే ప్లాంటు (కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డెమోలిషన్‌ ప్లాంటు) సిద్ధమైంది. వచ్చే వారం పదిరోజుల్లో ప్రయోగాత్మకంగా పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రోజుకు 500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల ఈ ప్లాంటు అందుబాటులోకొస్తే నగరంలో డెబ్రిస్‌ సమస్య చాలావరకు పరిష్కారమవుతుంది.

నగరాల్లో నిర్మాణ వ్యర్థాలు ప్రధాన సమస్యగా మారాయి. హైదరాబాద్‌ నగరంలో రోజుకు 600 మెట్రిక్‌ టన్నుల డెబ్రిస్‌ వెలువడుతున్నట్లు అంచనా. ఇంతకాలం డెబ్రిస్‌ వేసేందుకు నిర్థారిత ప్రాంతమంటూ లేకపోవడంతో రాత్రికి రాత్రి ఇష్టమొచ్చిన చోటకు తరలిస్తున్నారు. కొందరైతే చెరవుల్లో, రోడ్ల వెంబడి పోస్తున్నారు. దీంతో తరచూ జీహెచ్‌ఎంసీ ప్రత్యేక డ్రైవ్‌ ఏర్పాటు చేస్తూ డెబ్రిస్‌ను తొలగిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ చట్టం-2016లో భాగంగా నగరంలోని జీడిమెట్లలో ప్రైవేటు భాగస్వామ్యంతో రూ. 12కోట్లతో రాంకీ ఎన్విరో సంస్థ ఆధ్వర్యంలో రోజుకు 500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్ధ్యంగల మొదటి సీ అండ్‌ డీ ప్లాంటును ఏర్పాటు చేశారు. ప్లాంటు ప్రారంభించేందుకు సిద్ధం కావడంతో మంగళవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌ పరిశీలించారు. వచ్చే వారం పదిరోజుల్లో ప్రయోగాత్మకంగా రీసైక్లింగ్‌ పనులు మొదలుపెట్టనున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. డెబ్రిస్‌ రీసైక్లింగ్‌ ద్వారా ఇటుకలు, టైల్స్‌, ఇసుక తదితరవాటితోపాటు ఇతర నిర్మాణ అవసరాలకు కావాల్సిన వస్తువులను తయారు చేసే వీలుంది.

టన్నుకు రూ. 342 ఫీజు..
ఈ వ్యర్థాలను తరలించేందుకు ఇక నుంచి జీహెచ్‌ఎంసీని సంప్రదించాల్సివుంటుంది. టన్నుకు రూ. 342చొప్పున నిర్ణీత ఫీజు చెల్లిస్తే తరలిస్తారు. ప్రైవేటు వాహనాల్లో డెబ్రిస్‌ తరలింపును ఇదివరకే నిషేధించారు. ఈ ఫీజు ద్వారా వచ్చిన మొత్తాన్ని జీహెచ్‌ఎంసీ నేరుగా రాంకీ సంస్థకు చెల్లిస్తుంది. రోడ్లపై వేసిన డెబ్రిస్‌ను జీహెచ్‌ఎంసీయే తరలించి దానిపై కూడా రాంకీ సంస్థకు ఫీజు చెల్లిస్తుంది. వ్యర్థాల ద్వారా తయారయ్యే సామగ్రిని రాంకీ సంస్థ విక్రయిస్తుంది. ప్లాంటు ఏర్పాటుకు సైతం జీహెచ్‌ఎంసీయే స్థలాన్ని సమకూర్చడం విశేషం. ఇటువంటి ప్లాంట్లు ఏర్పాటు చేసిన నగరాల్లో దేశంలో మనది నాలుగో నగరం కానున్నది. ఇప్పటివరకు ఢిల్లీ, నాగపూర్‌, అహ్మదాబాద్‌ తదితర నగరాల్లో సీ అండ్‌ డీ ప్లాంట్లు కొనసాగుతున్నాయి.

మరో నాలుగు ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు : దానకిశోర్‌
ఫతుల్లగూడలో స్థలం సిద్ధంగా ఉండడంతో మరో ప్లాంటు నిర్మాణానికి రాంకీ సంస్థతో ఒప్పందం చేసుకుంటున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌ తెలిపారు. ఇదికాకుండా మరో మూడు ప్లాంటు ఏర్పాటుకు స్థలాలు కేటాయించాలని రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాయగా వారు అందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఇకమీదట వ్యర్థాలను ప్లాంటుకు తరలించకుండా ఎక్కడ వేసినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ హెచ్చరించారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...