గోల్కొండ నోట్‌ పుస్తకాలతో విద్యార్థులకు ప్రయోజనం


Wed,June 19, 2019 12:59 AM

అబిడ్స్‌, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌(టీఎస్‌టీపీసీ) ద్వారా నాణ్యమైన గోల్కొండ నోట్‌ బుక్స్‌ను తక్కువ ధరలకు విద్యార్థులకు అందించడం వలన విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని హోంమంత్రి మహమూద్‌అలీ పేర్కొన్నారు. టీఎస్‌టీపీసీ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌ సంస్థ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ గోల్కొండ నోట్‌ బుక్స్‌ విక్రయ కేంద్రాన్ని ఆయన రాష్ట్ర ఎక్పైజ్‌, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌, టీఎస్‌టీపీసీ చైర్మన్‌ దేవరి మల్లప్పలతో కలిసి ప్రారంభించారు. అనంతరం టీఎస్‌టీపీసీ ముద్రించిన డైరీని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్‌ తీసుకున్న చొరవతో తెలంగాణ ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలకు సరఫరా చేస్తున్న గోల్కొండ నోట్‌ పుస్తకాలను ప్రైవేట్‌ విద్యా సంస్థలకు కూడా సరఫరా చేసేందుకు సంస్థ తీసుకున్న చర్యలు అభినందనీయమన్నారు. పుస్తకాల ముద్రణాలయం ఏర్పాటు చేసి ఖర్చు తగ్గించేలా సంస్థ చైర్మన్‌ దేవరి మల్లప్ప చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు టీఎస్‌టీపీసీ చైర్మన్‌ దేవరి మల్లప్ప ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. కార్పొరేషన్‌ ద్వారా నాణ్యమైన నోట్‌ పుస్తకాలను ప్రింట్‌ చేయించి ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్‌ల విద్యార్థులకు అందిస్తున్నారన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నంది లేపాక్షి నోట్‌ బుక్స్‌ పేరిట ప్రింట్‌ చేసి ప్రభుత్వ విభాగాలకు సరఫరా చేసే వారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నంది లేపాక్షి నోట్‌ బుక్స్‌ పేరును గోల్కొండ నోట్‌ బుక్స్‌గా సీఎం కేసీఆర్‌ మార్చడం జరిగిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జైళ్లశాఖ సొంతంగా పెట్రోల్‌ బంకులు, క్యాంటీన్‌లు ఏర్పాటు చేసి సొంతంగా నిధులు సమకూర్చుకుంటుందని, ఇదే తరహాలో టీఎస్‌టీపీసీ కూడా నోట్‌ పుస్తకాల విక్రయం ద్వారా నిధులు సమకూర్చుకునే ప్రయత్నం చేయడం అభినందనీయమన్నారు. టీఎస్‌టీపీసీ చైర్మన్‌ దేవరి మల్లప్ప మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థలకు ఇప్పటి వరకు గోల్కొండ నోట్‌ బుక్స్‌ను పంపిణీ చేయడం జరిగిందని, ప్రైవేట్‌ విద్యా సంస్థలకు కూడా గోల్కొండ నోట్‌ పుస్తకాలను పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. జంట నగరాల ప్రజలకు తక్కువ ధరకు గోల్కొండ నోట్‌ బుక్స్‌ను అందజేయాలనే సంకల్పంతో సంస్థ ఆవరణలో నోట్‌ పుస్తకాల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ విక్రయ కేంద్రంలో నోట్‌ పుస్తకాలు కొనుగోలు చేసే వారికి 15 శాతం తక్కువ ధరతో విక్రయిస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ టీఎస్‌టీపీసీ ముద్రించిన డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలోటీఎస్‌టీపీసీ ఎండీ, సీజీఎం రాజారాం, జీఎం కె. వేణుమాదవ్‌, మార్కెటింగ్‌ ఆఫీసర్‌ రాచూరి సుధీర్‌బాబు, ఉమాప్రసాద్‌, మల్లికార్జున్‌ పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...