ప్లాస్టిక్‌ వ్యర్థాలపై సమరం..


Sat,June 15, 2019 12:38 AM

-రికార్డుస్థాయిలో వ్యర్థాల సేకరణ
-లక్ష్యాన్ని అధిగమించిన బల్దియా
-225 టన్నులకుపైగా కవర్లు ఏరివేత
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ప్లాస్టిక్‌ వ్యర్థాలపై జీహెచ్‌ఎంసీ చేపట్టిన సమరాన్ని మరింత ఉధృతం చేసింది. భవిష్యత్తులో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్‌ కవర్లు లేకుండా చేయడమే లక్ష్యంగా ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రోజూ ఆయా చెత్త ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల నుంచి పెద్ద ఎత్తున ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగిస్తున్నారు. జూన్‌ ఐదునాటికి 200 టన్నుల ప్లాస్టిక్‌ను సేకరించాలన్న లక్ష్యాన్ని అధిగమించి ఇప్పటికీ 225 టన్నుల ప్లాస్టిక్‌ను సమీకరించారు.
సమీప భవిష్యత్తులో 50 మైక్రాన్లకన్న తక్కువ మందంగల ప్లాస్టిక్‌పై ఉన్న నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసేదిశగా జీహెచ్‌ఎంసీ కార్యాచరణ అమలుచేస్తున్న విష యం విదితమే. ఈ క్రమంలోనే ప్లాస్టిక్‌ కవర్ల తయారీ, సరఫరా, విక్రయం, వినియోగం తదితర కార్యక్రమాలపై ఇదివరకే నిషేధం విధిస్తూ స్థాయీసంఘంలో తీర్మానం చేశారు. అంతేకాకుండా దీనిపై ఆయా వర్గాలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నిషేధాన్ని ఉల్లంఘించేవారికి భారీగా జరిమానాలు విధించాలని నిర్ణయించారు. దీంతోపాటు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్లాస్టిక్‌ వ్యర్థాలను పూర్తిగా నిర్మూలించాలని నిశ్చయించిన అధికారులు కవర్లను ఏరివేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. నగరంలో రోజూ సుమారు 5000 మెట్రిక్‌ టన్ను ల వ్యర్థాలు వెలువడుతున్నట్లు అంచనా కాగా, అందులో ప్లాస్టిక్‌ వ్యర్థాలు దాదాపు 450 నుంచి 500 మెట్రిక్‌ టన్నులు ఉంటున్నాయి.

ఈ నేపథ్యంలో గత నెలరోజులుగా వివిధ చెత్త ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లతోపాటు పలు వ్యర్థాల డంపింగ్‌ ప్రదేశాలనుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలను స్వచ్ఛంద సంస్థలు, కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో సేకరిస్తున్నారు. ముఖ్యంగా నాగోల్‌, ఇమ్లిబన్‌, జియాగూడ, కాటేదాన్‌, దేవేందర్‌నగర్‌, ట్యాంక్‌బండ్‌, అంబర్‌పేట్‌ ఎస్టీపీ, యూసుఫ్‌గూడ, దీప్తీశ్రీనగర్‌, ఆర్సీపురం రైల్వేట్రాక్‌, ఖైత్లాపూర్‌, హెచ్‌ఎంటీ పైప్‌లైన్‌ రోడ్‌, మచ్చ బొల్లారం, సర్దార్‌పటేల్‌ నగర్‌, సంజీవయ్య పార్కు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించారు. అలాగే, కూకట్‌పల్లి సర్కిల్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు శేరిలింగంపల్లి పరిధిలో రాజీవ్‌ స్వగృహ కాంప్లెక్స్‌లో ప్లాస్టిక్‌ ఏరివేతను చేపట్టగా, ముషీరాబాద్‌ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు సమీపంలోని ఎన్టీఆర్‌ గ్రౌండ్స్‌, ఇతర ఖాళీ స్థలాల్లో ప్లాస్టిక్‌ కవర్లను సేకరించారు. ఎల్బీనగర్‌ సర్కిల్‌లోని వనస్థలిపురం, సికింద్రాబాద్‌ జోన్‌ పరిధిలోని సీతాఫల్‌మండీ, చందానగర్‌లోని కొత్తగుంట, చాంద్రాయణగుట్ట సర్కిల్‌లోని రక్షపురం, ఉప్పల్‌ సర్కిల్‌లోని చిలుకానగర్‌, బీరప్పగడ్డ, గాజులరామారం సర్కిల్‌లోని అంజయ్యనగర్‌ తదితర ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాల డ్రైవ్‌ను నిర్వహించారు.

చెత్త కుండీల తయారీకి వినియోగం
సేకరించిన ఈ ప్లాస్టిక్‌ వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేసి వ్యర్థాలు వేసేందుకు ఫుట్‌పాత్‌లపై ఏర్పాటుచేసే చెత్తకుండీల తయారీకి వినియోగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా ప్లాస్టిక్‌ తయారీ కంపెనీలతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. వ్యర్థాలతో ప్లాస్టిక్‌ కుండీలు తయారుచేయించి వాటినే నగరంలో ఏర్పాటుచేయడం ద్వారా ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలవాలని అధికారులు భావిస్తున్నారు. దేశంలోని 18రాష్ర్టాలు, కేంద్రాపాలిత ప్రాంతాల్లో ప్లాస్టిక్‌పై పూర్తి నిషేధం ఉన్నప్పటికీ దాని అమలు పకడ్బందీగా సాగడంలేదని అధికారులు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మన నగరంలో దశలవారీగా నిషేధాన్ని అమలుచేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదలు నిషేధం ఆవశ్యకత, ప్లాస్టిక్‌ వల్ల కలిగే సమస్యలపై ప్రజల్లో చైతన్యం తేచ్చేందుకు వివిధ కార్యక్రమాలను ఏర్పాటుచేస్తున్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...