మాన్‌సూన్‌ యాక్షన్‌ప్లాన్‌ రెడీ


Sat,June 15, 2019 12:37 AM

-45 ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీంల ఏర్పాటు
-రక్షిత నీటి సరఫరా, మ్యాన్‌హోల్స్‌ నిర్వహణపై ప్రత్యేక దృష్టి
-సీజీఎంలకు ప్రత్యేక బాధ్యతలు : ఎండీ దానకిశోర్‌
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రాబోయే వర్షాకాలంలో తలెత్తే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జలమండలి ప్రత్యేక మాన్‌సూన్‌ యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధ్దం చేసింది. రక్షిత జలాల సరఫరాతో పాటు మ్యాన్‌హోల్స్‌ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. వర్షాకాలంలో సరఫరా చేసే నీటిలో ఏ మాత్రం తేడా వచ్చినా ప్రజార్యోగంపై తీవ్ర ప్రభావం ఉంటుందని, అందుకే నీటి సరఫరా విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎండీ దానకిశోర్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. వీటితో పాటు చిన్నపాటి వర్షానికే సామర్థ్యం తట్టుకోలేక పొంగిపోర్లే మ్యాన్‌హోల్స్‌, భారీ వర్షం పడుతున్న సమయంలో మ్యాన్‌హోల్స్‌ నిర్వహణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సంస్థ పరిధిలో 45 ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం (ఈటీఆర్‌టీ) బృందాలను నియమించారు. వర్షాలు కురుస్తున్న సమయంలో ట్రాఫిక్‌, జీహెచ్‌ఎంసీ శాఖలతో సమన్వయం చేసుకుంటూ మ్యాన్‌హోల్స్‌ నిర్వహణ పనులు చేపట్టాలని ఎండీ ఆదేశాలు జారీ చేశారు. మాన్‌సూన్‌ యాక్షన్‌ ప్లాన్‌ కోసం దాదాపుగా రూ.రెండున్నర కోట్లకు పైగా ప్రత్యేక నిధులను కేటాయించారు. సీజీఎంల పర్యవేక్షణ ప్రత్యేక బృందాలు పనిచేయనున్నాయి.

ప్రతి బస్తీకి 1000 క్లోరిన్‌ బిళ్లలు
వర్షాకాల నేపథ్యంలో నీటి కాలుష్యం ప్రబలే ప్రమాదం ఉండడం.. శిథిలమైన పైప్‌లైన్‌ వ్యవస్థ.. పారిశుధ్య లోపం.. మరోవైపు ఇళ్ల మధ్యనే పెరిగిపోతున్న తోళ్ల పరిశ్రమలు, రసాయన వ్యర్థాలు వెదజల్లే అనేక వ్యాపారాలు తదితర నీటి కాలుష్యానికి కారణమైన వాటిపై దృష్టి సారించారు. నిబంధనల ప్రకారం మిలియన్‌ లీటర్ల శుద్ధికి కిలోక్లోరిన్‌ కలపాల్సి ఉంటుంది. అప్పుడే రిజర్వాయర్‌ వద్ద 2 పీపీఎం (పార్ట్‌ఫర్‌ మిలియన్‌) ఉంటుంది. వినియోగదారుడికి చేరే సమయంలో క్లోరిన్‌ శాతం 0.5పీపీఎం ఉంటే చాలు. అంతకంటే తక్కువ ఉంటే ఆ నీరు సురక్షితం కానట్టే. రిజర్వాయర్లలో నీటి నిల్వ సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా క్రిమికీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. నీటిలో క్లోరిన్‌ రెండు, మూడు రోజులు మాత్రమే ఉంటుంది. తిరిగి మళ్లీ కలిపితేనే ఆ నీటి నాణ్యత మెరుగుపడుతుంది. అందుకే క్లోరినేషన్‌కు నిర్ణీత ప్రామాణిక విధి విధానాలు ప్రకటించి నిర్వహణలో పకడ్బందీ చర్యలు చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే వర్షాకాలంలో వచ్చే నీటి సంబంధ వ్యాధులను నివారించడానికి స్వయం సహాయక బృందాలతో ఇంటింటికీ వెళ్లి నీటి పరీక్షలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. నీటి కాలుష్య ప్రాంతాలను గుర్తించి నీటి శాంపిళ్లను సేకరించి, తద్వారా సరఫరా అయ్యే నీటిలో క్లోరిన్‌ శాతం తక్కువగా ఉంటే సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు. ఇదే క్రమంలో వచ్చే వారం నుంచి ప్రతి బస్తీలో వెయ్యి క్లోరిన్‌ బిళ్లలు ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధ్దంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఓ అండ్‌ ఏం ఆధ్వర్యంలో రోజుకు 2500 ప్రాం తాల్లో నీటి శాంపిల్స్‌ సేకరణ జరుగుతుందని, దవాఖానాలు, బస్తీల నీటి సరఫరాపై ప్రధానంగా దృష్టి సారించ డం జరిగిందని వివరించారు. సరఫరా అయ్యే నీటిలో క్లోరిన్‌శాతం తక్కువగా ఉన్నా వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించి, వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...