ఉద్యోగాలిప్పిస్తామంటే నమ్మొద్దు..


Sat,June 15, 2019 12:37 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు సర్టిఫికేట్స్‌ వెరిఫికేషన్‌ ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగుతుందని రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్లు మహేష్‌భగవత్‌, సజ్జనార్‌ తెలిపారు. వివిధ ఫైనల్‌ రాత పరీక్షల్లో రాచకొండ కమిషనరేట్‌లో 480, సైబరాబాద్‌ కమిషనరేట్‌లో 4536 మంది అభ్యర్థులు అర్హత సాధించారని, వారికి సంబంధించిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ జరుగుతుందని, ఈ సమయంలోనే మోసగాళ్లు, వారి దళారులు రంగంలోకి దిగి తాము ఉద్యోగాలిప్పిస్తామంటూ మాయ మాటలు చెప్పి మోసాలకు గురిచేసే అవకాశాలుంటాయని, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని కమిషనర్లు సూచించారు. రిక్రూట్‌ మెంట్‌ చివరి అంకానికి చేరడంతో అమాయకులను ఎంచుకొని వల వేస్తారన్నారు. ఉద్యోగం ఇప్పిస్తాం జాయింట్‌ అకౌంట్‌లో డబ్బు డిపాజిట్‌ చేయాలంటూ కొందరు చెబుతుంటారు, కొందరు డిపార్టుమెంట్‌లో పరిచయాలున్నాయని, సెక్రటరేట్‌లో ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులతో పరిచయాలున్నాయంటూ హంగూ అర్భాటం ప్రదర్శిస్తూ, అభ్యర్థుల ముందు ఫోన్లు చేసి బుట్టలో వేస్తారు, ఫోర్జరీ డాక్యుమెంట్లను చూపిస్తూ, గతంలో ఉద్యోగాలిప్పించామని, ఈ సారి కూడా ఉద్యోగం వచ్చే విధంగా చేస్తున్నామంటూ నమ్మించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈలాంటి వారిని నమ్మి మోసపోవద్దని సీపీలు తెలిపారు. నిబంధనలకు విరుద్ధ్దంగా ఎవరికి కూడా ఉద్యోగం రాదని, అన్ని అంశాలలో నైపుణ్యం ఉన్న వారికే ఉద్యోగం వస్తుందన్నారు. ఇలాంటి చీటర్లకు సంబంధించిన సమాచారం అందిస్తే లక్ష రూపాయల రివార్డును అందిస్తామని వారు ప్రకటించారు. రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నేతృత్వంలో వివిధ అంశాలపై నిర్వహించిన పరీక్షలలో ప్రతిభ చూపించి, అర్హత సాధించి మెరిట్‌ పొందిన వారికే ఉద్యోగాలు వస్తాయన్నారు. మోసగాళ్లు, దళారులకు సంబంధించిన సమాచారాన్ని డయల్‌ 100, (సైబరాబాద్‌ - 949061 7444, రాచకొండ 9490617111)కు సమాచారమివ్వాలని సూచించారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...