సాహితీ నిధి తిరుమల శ్రీనివాసాచార్య


Fri,June 14, 2019 12:50 AM

త్యాగరాయగానసభ: రసమయి సంస్థ అధ్యక్షులు డా.ఎంకే రాము ఆధ్వర్యంలో రుబాయి కవి సమ్రాట్ డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య రచించిన మూడు కావ్యాలు ఆవిష్కరణ సభ గానసభ ప్రధానవేదికపై ఘనంగా నిర్వహించారు. కావ్యాలు-1. దేవులపల్లి రామానుజరావు (జీవితచరిత్ర, రుబాయి కవితాప్రక్రియ), 2. కావ్యసుధ (52కావ్యఅంకిత పద్యాల సంపుటి), 3.కావ్యప్రభ (ఖండ కావ్యసంపుటి), తొలికావ్యం పునర్ముద్రణ-ఉదయరాగం మొత్తం 4 పుస్తకాలు ఆవిష్కరణ జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన తమిళ నాడు పూర్వ గవర్నర్ డాక్టర్ కే రోశయ్య మాట్లాడుతూ డా.తిరుమల శ్రీనివాసాచార్య సాహితీ సుధానిధి అని కొనియాడారు. 83 యేళ్ళ వయస్సులో సైతం గ్రంథ రచన కొన సాగిస్తూ మొత్తం 54గ్రంథాలు వెలువరించడం అభినందనీయమన్నారు. తెలంగాణ ప్రభు త్వ సలహాదారు డా.కేవీ రమణాచారి మాట్లాడుతూ తనకు తన చిన్నాన్న డా. తిరు మల శ్రీనివాసాచార్య ఆదర్శమని పేర్కొన్నారు. శ్రీనివాసాచార్య గొప్ప సహృదయుడని అన్నారు . తనకు ఆత్మీయులైన సాహితీమిత్రులందరికి తాను రాసిన కావ్యాలను అంకితమిచ్చే సంప్రదాయం గొప్పదని ప్రశంసించారు. కార్యక్రమంలో ఆచార్య ఎల్లూరి శివారెడ్డి (తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ వీసీ), దేవులపల్లి ప్రభాకర్‌రావు (తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షులు), డా.ఓలేటి పార్వతీశం(దూరదర్శన్), టి.రామమోహన్‌రావు(సాహితీవేత్త), ఆచార్య మసన చెన్నప్ప(ఓయూ తెలుగు శాఖ పూర్వా ధ్యక్షులు), శ్రీరంగాచార్యులు (అవధాని, సాహితీవేత్త), సుధామ(సాహితీవేత్త), టి.మురళీధర్ గౌడ్ (సాహితీవేత్త) అతిథులుగా పాల్గొన్నారు.గ్రంథాలను దేవులపల్లి ప్రభాకరరావు, ఓలేటి పార్వతీశం, టి.రామమోహన్‌రావులకు అంకితమిచ్చి ఘనంగా సత్కరించారు. డా.తిరుమల శ్రీనివాసాచార్యులను రసమయి సంస్థ ఘనంగా సత్కరించింది.
ఎంకే ఆశాలత కార్యక్రమానికి వ్యాఖ్యానం అందించారు. వలపు లోగిలిలో పువ్వులు విరసే వన్నెకాడ, నా హృదయం పురులు విప్పి లేచింది, నీ కన్నుల్లో ఏమి ఉందో చెప్ప లేను, మనసు వికసిస్తే మనిషి మహర్షి అవుతాడు మనసు ప్రవహిస్తే మనిషి మార్గదర్శి అవుతాడు..తదితర లలిత గీతాలకు డా.తిరుమల శ్రీనివాసాచార్య సాహిత్యాన్ని అందించగా సంగీత దర్శకుడు కే.రామాచారి సృష్టించిన సంగీత బాణీల్లో యువ గాయనీ గాయకులు శ్రియామాధురి, శ్వేత, భరత్‌రాజ్, సాకేత్ మధురంగా ఆలపించారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...