31తేదీ నుంచి.. రోడ్డు తవ్వకాలపై నిషేధం..


Sun,May 26, 2019 12:34 AM

- ఇప్పటికే తవ్విన రోడ్లను జూన్ 5లోగా పునరుద్ధరణ
- వర్షాకాల విపత్తులను సమష్టిగా ఎదుర్కొందాం..
- వివిధ శాఖల సమన్వయ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రోడ్డు తవ్వకాలపై ఈనెల 31వ తేదీ నుంచి నిషేధం విధించాలని, అలాగే ఇప్పటికే తవ్విన రోడ్లను వచ్చే జూన్ ఐదో తేదీలోగా పూర్తిచేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిశోర్ ఆదేశించారు. అలాగే, వర్షాలు మొదలుకాకముందే రోడ్లపై గుంతల పూడ్చివేత, ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు పూర్తిచేయాలని నిశ్చయించారు. ఈ మేరకు శనివారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన నగర సమన్వయ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సమన్వయ సమావేశ ముఖ్య నిర్ణయాలు
- జూన్ రెండోవారం నుంచి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున నగరవాసులకు ఇబ్బంది కలుగకుండా చూసేందుకు మే 31వ తేదీనుంచి నగరంలో అన్ని రకాల రోడ్డు తవ్వకాలపై నిషేధం విధింపు.
-గతంలో తీసుకున్న అనుమతులతో ప్రస్తుతం జరుగుతున్న తవ్వకాలను మే 31వ తేదీలోగా పూర్తిచేసి జూన్ ఐదవ తేదీలోగా రోడ్లను పునరుద్ధరించాలి. మ్యాన్‌హోళ్ల పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి.
-వర్షాకాల విపత్తులను ఎదుర్కొనేందుకు నగరంలోని అన్ని ప్రభుత్వ శాఖలు ఒక్కో నోడల్ అధికారిని నియమించాలి. అలాగే ప్రతి విభాగం ఆధ్వర్యంలో విపత్తుల నివారణ బృందాలను ఏర్పాటుచేసి వాటి వివరాలను జీహెచ్‌ఎంసీ విజిలెన్స్-ఎన్‌ఫోర్స్‌మెంట్-డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగానికి అందించాలి.

-భారీ వర్షాలవల్ల చెట్లుకూలి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడితే వెంటనే ప్రత్యామ్నాయ రోడ్డును గుర్తించి ట్రాఫిక్ సమస్యను అరికట్టాలి. భారీ వర్షాలు కురిసి ముంపు సమస్య ఏర్పడితే వెంటనే బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే వీలుగా స్థానిక కమ్యునిటీహాళ్లు, స్కూల్లు, ఖాళీ స్థలాలను గుర్తించాలి.
-వర్షాలకుముందే రోడ్లపై గుంతలు లేకుండా మరమ్మతులు పూర్తిచేయాలి. మెట్రో కారిడార్లవెంట నిర్మిస్తున్న ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపు. మెట్రో కారిడార్ల వెంబడి ఉన్న దాదాపు 60కిపైగా హోర్డింగుల తొలగింపు. మెట్రో కారిడార్ల వెంబడి నిర్మాణ వ్యర్థాలు లేకుండా చేయాలి.
-మలక్‌పేట్ రైల్వేస్టేషన్ వద్ద మరో రైల్వే అండర్‌బ్రిడ్జీ నిర్మాణానికి రైల్వేశాఖతో కలిసి తగిన చర్యలు తీసుకోవాలి. భూసేకరణ జరిపేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.
-సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ మార్గం, బయోడైవర్శిటీ జంక్షన్, ఖాజాగూడ ఫ్రీలెఫ్ట్ తదితర మార్గాల్లో రోడ్ల పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టాలి. ఎల్బీనగర్ నుంచి బైరామల్‌గూడ మార్గంలో ఎస్‌ఆర్‌డీపీ పనుల వల్ల కలుగుతున్న ట్రాఫిక్ సమస్యను అరికట్టేందుకు బైరామల్‌గూడ వద్ద భూసేకరణ పనులు వెంటనే చేపట్టాలి. అలాగే, ఎల్బీనగర్‌లో ఇటీవల ప్రారంభమైన రెండు ైఫ్లెఓవర్ల వెంట రోడ్లను మరమ్మతు చేయాలి.
-నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నళ్ల పునరుద్ధరణకు చర్యలు. సికింద్రాబాద్ మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్(ఎంఈఎస్) ప్రాంతంలో సరిపడా నీటి సరఫరాను అందించాలన్న సైనికాధికారులు విజ్ఞప్తి పరిశీలన చేయాలి.
-జోనల్, సర్కిల్ స్థాయిలో వివిధ శాఖల మధ్య సమన్వయ సమావేశాలు ఏర్పాటుచేసుకోవాలని నిర్ణయం. సూరల్ అగ్నిప్రమాద నేపథ్యంలో నగరంలోని అన్ని కోచింగ్ సెంటర్లు, విద్యాసంస్థల్లో అగ్నిప్రమాద నివారణ చర్యల తనిఖీ చేయాలి.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...