గాంధీలో.. దళారుల దందా!


Sat,May 25, 2019 01:04 AM

మెట్టుగూడ : సికింద్రాబాద్ గాంధీ దవాఖానాలో ప్రైవేటు ల్యాబొరేటరీల దందా యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. నిరుపేద రోగులకు మాయమాటలు చెప్పి రక్త నమూనాలు సేకరించి రెండు చేతులా సంపాదిస్తున్నాయి. ఇదే పని కోసం కొంత మంది దళారీలను ల్యాబ్ యజమానులు ప్రత్యేకంగా నియమించుకున్నారు. గైనకాలజీ విభాగం లేబర్ వార్డులో నిరుపేద మహిళా రోగి నుంచి రక్త నమూనాలు సేకరించిన ఓ దళారీని గాంధీ దవాఖాన సెక్యూరిటీ సిబ్బంది శుక్రవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గాంధీ దవాఖాన పాలనా యంత్రాంగం ఫిర్యాదు మేరకు దళారీతోపాటు అతనికి సహకరించిన సెక్యూరిటీ గార్డును చిలకలగూడ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్‌కుమార్, ఆర్‌ఎంఓ-1 జయకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... పద్మారావునగర్ నేహా ల్యాబ్‌కు చెందిన రవికుమార్ దళారీ. గాంధీ దవాఖానలో సంచరిస్తూ రోగులు, రోగి సహాయకులను పరిచయం చేసుకుంటాడు. దవాఖానకు చెందిన ల్యాబ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని, నివేదికలు కూడా సరిగా ఉండవని నమ్మబలుకుతాడు. పక్కనే ఉన్న ప్రైవేటు ల్యాబ్‌లో అన్ని రకాల వైద్యపరీక్షలు తక్కువ డబ్బులకే చేయిస్తానని నమ్మిస్తాడు.

రోగుల నుంచి రక్త నమూనాలు సేకరించి తన ల్యాబ్‌లో వైద్య పరీక్షలు చేయించి నివేదికలను అందించి డబ్బులు వసూలు చేసి తన కమిషన్ తీసుకుని మిగిలింది ల్యాబ్‌కు చెల్లిస్తాడు. ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగుల నుంచి రక్త నమూనాలు సేకరించడం నేరమని తెలిసినప్పటికీ కమీషన్లకు ఆశపడి ఇలాంటి దళారీలు పదుల సంఖ్యలో గాంధీ దవాఖానలో ప్రతి నిత్యం సంచరిస్తుంటారు. లేబర్ వార్డులో ఉన్న దుర్గాశ్రీ అనే మహిళా రోగితో థైరాయిడ్ టెస్ట్ కోసం బేరం కుదుర్చుకున్న రవికుమార్ శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఎన్‌ఐసీయూ ప్రవేశ ద్వారం ద్వారా లోపలికి వచ్చి అక్కడి నుండి లేబర్ వార్డులోకి వెళ్లి రోగి నుంచి రక్తనమూనాలు సేకరించాడు. అదే సమయంలో లేబర్ వార్డు వద్ద ఎజిల్ సెక్యూరిటీ సంస్థ ఇన్‌చార్జి ప్రదీప్‌కుమార్ తనిఖీలు నిర్వహిస్తున్నాడు. అనుమానాస్పదంగా తిరుగుతున్న రవికుమార్‌ను తనిఖీ చేయగా అతని ప్యాంటు జేబులో నుంచి రక్త నమూనాలు బయటపడ్డాయి. విచారణ చేపట్టగా ఈ దందాలో ఎన్‌ఐసీయూ వార్డు వద్ద విధుల నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డు శ్యామ్యూల్ పాత్ర కూడా ఉన్నట్లు తేలింది. దళారీ రవికుమార్‌తోపాటు సెక్యూరిటీ గార్డు శ్యామ్యూల్‌పై చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ రాజునాయక్ తెలిపారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...