నగర తీర్పు విలక్షణం


Fri,May 24, 2019 04:56 AM

-నాలుగు చోట్ల నాలుగు పార్టీల గెలుపు
-చేవెళ్లలో మళ్లీ గులాబీ గుబాళింపు
-హైదరాబాద్‌లో తిరుగులేని ఎంఐఎం
-బీజేపీ ఖాతాలోకే సికింద్రాబాద్
-మల్కాజిగిరిలో స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ విజయం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ;నగర వాసులు లోక్‌సభ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పునిచ్చారు. అన్ని ప్రధాన పార్టీలనూ ఆదరించారు. నాలుగు స్థానాల్లో నాలుగు పార్టీలకు అవకాశం కల్పించారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపొందిన చేవెళ్లలో గులాబీ రెండోసారి విజయకేతనం ఎగరేసింది. కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో జరిగిన హోరాహోరీ పోరులో టీఆర్‌ఎస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి గెలుపొందారు. హైదరాబాద్‌లో ఎంఐఎంకు తిరుగులేదని నిరూపించుకున్నది. ఇక్కడ మజ్లిస్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ నాలుగోసారి విక్టరీ కొట్టారు. సికింద్రాబాద్‌లో మళ్లీ కమలమే వికసించింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్‌పై బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి విజయం సాధించారు. మల్కాజిగిరిలో కాంగ్రెస్ పార్టీ స్వల్ప మెజార్టీతో విజయం సాధించింది. రౌండ్ రౌండ్‌కు ఉత్కంఠ రేపిన ఈ స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డిపై హస్తం పార్టీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ఆధిక్యం సాధించారు. కాగా, కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిలు తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయి..ఇప్పుడు తిరిగి విజేతలవడం గమనార్హం.
:
పార్లమెంట్ ఎన్నికల్లోనూ అధికార పార్టీ టీఆర్‌ఎస్ విజయకేతనం ఎగురవేసింది. చేవెళ్ల గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడింది. ప్రతి రౌండ్‌లోనూ గులాబీకి పూర్తి ఆధిక్యత లభించింది. చేవెళ్ల టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి 14,391 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై గెలుపొందారు. రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అధిక మెజార్టీ వచ్చింది. రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పార్టీకి మంచి మెజార్టీ రాగా, వికారాబాద్, చేవెళ్ల, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పార్టీకి నష్టం జరిగింది. గ్రామీణ నియోజకవర్గాల్లో తాండూర్ నియోజకవర్గం మినహా వికారాబాద్, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ లభించింది. అదే విధంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో 12,99,715 ఓట్లు లెక్కించగా టీఆర్‌ఎస్ పార్టీకి 5,28,010 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 5,13,619 ఓట్లు, బీజేపీకి 2,01,856 ఓట్లు వచ్చాయి. అదే విధంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి మొత్తం 1241 ఓట్లు కాగా కాంగ్రెస్‌కు 651, టీఆర్‌ఎస్‌కు 270, బీజేపీకి 296, నోటాకు 9 మంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేశారు. 43 రౌండ్లు కొనసాగింది. టీఆర్‌ఎస్‌కు 14,391 ఆధిక్యం వచ్చింది.

2008లో నియోజకవర్గం ఏర్పాటు..
చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం 2008లో ఏర్పాటుకాగా 2009లో తొలిసారి ఎన్నికలు జరుగగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన జైపాల్ రెడ్డి టీడీపీ అభ్యర్థి జితేందర్ రెడ్డిపై 18,532 ఓట్ల మెజార్టీతో గెలుపొంది చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ తొలి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 4,20,807 ఓట్లురాగా(38.78 శాతం), టీడీపీ అభ్యర్థికి 4,02,275 ఓట్లు(37.08 శాతం), బీజేపీ అభ్యర్థికి 1,02,701 ఓట్లు(10.39 శాతం) పోలయ్యాయి. తదనంతరం 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తరఫున కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్ల ఎంపీగా ఎన్నికయ్యారు. తాజాగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీగా డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి ఎన్నికయ్యారు.

తొలిసారి ఎంపీగా...
డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. డాక్టర్ రంజిత్ రెడ్డి స్వస్థలం వరంగల్ జిల్లా. రాజేంద్రనగర్‌లోని ఏజీ రంగా వ్యవసాయ యూనివర్సిటీలో వెటర్నరీ సైన్స్‌లో యూజీ, పీజీ పూర్తి చేశారు. తదనంతరం రంజిత్ రెడ్డి చేవెళ్ల మండలం అంతారంలోని పౌల్ట్రీ ఫార్మ్‌లో టెక్నాలజీ సలహాదారుగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆరేండ్ల పాటు టెక్నాలజీ సలహాదారుగా పనిచేసిన ఆయన.. పౌల్ట్రీ పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాన్ని సంపాదించిన ఆయన డాక్టర్ తిరుపతిరెడ్డితో కలిసి ఎస్‌ఆర్ హచ్చెరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పౌల్ట్రీ పరిశ్రమను ప్రారంభించారు. తదనంతరం పౌల్ట్రీ పరిశ్రమ విజయవంతం కావడంతో చేవెళ్ల పరిసర ప్రాంతాల్లో ఎన్నో పౌల్ట్రీ పరిశ్రమలను రంజిత్ రెడ్డి నెలకొల్పారు. ఎస్‌ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న రంజిత్ రెడ్డి.. తెలంగాణతోపాటు దేశంలోనే పౌల్ట్రీ పారిశ్రామిక రంగంలో ప్రధాన శక్తిగా తయారయ్యారు. అంతేకాకుండా తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్న ఆయన పౌల్ట్రీ పరిశ్రమల్లో సంక్షోభం నెలకొన్న సమయంలో ప్రభుత్వానికి సమస్యలను వివరించి పరిష్కారం చూపడంలో కీలకంగా వ్యవహరించారు.

అంతేకాకుండా తన గ్రూప్ కంపెనీల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పించారు. అదేవిధంగా ఎవరికైతే ప్రాథమిక విద్యను పొందే అవకాశంలేని వారికి వృత్తి నైపుణ్య శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. అంతేకాకుండా రంజిత్ రెడ్డి పౌల్ట్రీ పరిశ్రమలతోపాటు గ్రామీణ ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందించేందుకుగాను ఇంజినీరింగ్, వైద్య కాలేజీలను కూడా ప్రారంభించారు. 2004లో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం పొందిన రంజిత్ రెడ్డి అప్పటినుంచి వ్యాపారంతోపాటు పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తున్నారు. అంతేకాకుండా చేవెళ్ల ప్రాంతంలో ఎస్‌ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరిట ఎన్నో పౌల్ట్రీ పరిశ్రమలను నెలకొల్పడంతోపాటు చాలా గ్రామాలను దత్తత తీసుకొని వేలాది కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు జీవనోపాధి కల్పిస్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రాంత ప్రజలకు సుపరితులైన డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డిని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఎంపీగా గెలిపించి ఆశీర్వదించారు.

మలక్‌పేట్:
కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభంజనం, రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థుల గెలుపును హర్షిస్తూ దిల్‌సుఖ్‌నగర్‌లో ఆపార్టీ నాయకులు విజయోత్సవ సంబురాలు జరపుకున్నారు. రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ సామ తిరుమల్‌రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు సామ మల్లారెడ్డిల ఆధ్వర్యంలో దిల్‌సుఖ్‌నగర్‌లోని గడ్డిఅన్నారం క్రాస్‌రోడ్ వద్ద బాణాసంచ కాల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం అక్కడి నుంచి గడ్డి అన్నారం బస్తీ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సామ తిరుమల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అందించిన సుపరిపాలనకు దేశ ప్రజలు మరోసారి పట్టం కట్టారన్నారు. పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి, రైతు సంక్షేమానికి చేపట్టిన సంక్షేమ ఫలాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయని, వారికి ఎంతో మేలు చేకూర్చాయని తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకుడు సామ మల్లారెడ్డితోపాటు సంపత్ తదితరులు పాల్గొన్నారు.

మణికొండ:
చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయంలో ప్రధాన భూమిక పోషించిన రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ఆయన గురువారం పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి నార్సింగిలోని పార్టీ కార్యాలయంలో వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో చేవెళ్ల ఎంపీగా రంజిత్‌రెడ్డిని గెలుపించుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాట ఇచ్చి వచ్చానని, ఇచ్చిన మాట ప్రకారం తన నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో అఖండమైన మెజార్టీని సాధించి ఎంపీగా రంజిత్‌రెడ్డిని గెలుపించామన్నారు. రంజిత్‌రెడ్డికి అఖండమైన మెజార్టీని అందించడంతో నియోజకవర్గ ప్రజలు ప్రధాన భూమిక పోషించారని వారికి రుణపడి ఉంటానన్నారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న తనను మూడోసారి ప్రజలు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారని, తనలాగే నిరంతరం ప్రజా సేవకుడిగా పనిచేసే రంజిత్‌రెడ్డిని పార్లమెంట్‌కు పంపించడం సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఇద్దరం కలిసికట్టుగా శక్తివంచన లేకుండా కృషిచేస్తామన్నారు. ప్రజల కోసం పనిచేసే వారినే ఎన్నుకున్న రాజేంద్రనగర్ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ది కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారంగా శ్రమించి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తామన్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...