సాహితీ సేవలో 76 ఏండ్లుగా..


Fri,May 24, 2019 04:54 AM

తెలుగుయూనివర్సిటీ, మే 23 : నిజాం పాలనలో కనుమరుగవుతున్న తెలుగు భాషను నిలిపేందుకు ఏర్పాటైన నాటి ఆంధ్రసారస్వత పరిషత్తు నేటి తెలంగాణ సారస్వత పరిషత్తుకు 76వ స్థాపనోత్సవాలకు సిద్ధమైంది. ఏడున్నర దశాబ్దాలకు పైగా తెలంగాణను కేంద్రంగా చేసుకొని తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి అవిరళ సేవలందిస్తున్న తెలంగాణ సారస్వత పరిషత్తు 76ఏండ్ల ఉత్సవాలను నాలుగు రోజుల పాటు నిర్వహించనుంది. మే25 నుంచి 28వరకు నాలుగు రోజుల పాటు ఉత్సవాలను పురస్కరించుకొని తన కృషిని, ఉనికిని ప్రపంచానికి చాటనుంది. తెలుగులో మాట్లాడటం, చదవడం నేరంగా భావించే నిజాం పాలనలో తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం పరిరక్షణ కోసం కృషి చేసిన సంస్థ సారస్వత పరిషత్తు. 1943 మే 26న కవిపండితులు, భాషోద్యమకారులు ప్రత్యేక సంస్థ అవసరమని భావించి పరిషత్తును ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు తెలుగు భాషా సముద్ధరణకు, భాషా సాహిత్య కళా సంస్కృతుల వికాసాభ్యుదయానికి కృషి చేస్తూ భావితరాలకు స్ఫూర్తిగా నిలిచింది.

తెలంగాణలోని సంస్థలు ప్రత్యేక ఉనికిని చాటుకుంటున్న తరుణంలో పరిషత్తు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా తెలంగాణ సంస్థగా ఏర్పాటైంది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటైన తర్వాత తెలంగాణ ప్రజల సంఘటిత స్వరంతో గళం కలుపుతూ పరిషత్తు సర్వసభ్య మండలి ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరును తెలంగాణ సారస్వత పరిషత్తుగా మార్పు చేసి సమున్నత వారసత్వాన్ని కొనసాగిస్తున్నది. తెలుగు ప్రజలను మాతృభాష పట్ల చైతన్యం చేసేలా సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి కృషి చేసింది. తెలుగు భాషా పునరుజ్జీవనం కోసం సాగిస్తున్న కృషిలో భాగంగా ప్రజల్లో అక్షరాస్యత పెంపు, పరీక్షల నిర్వహణ, ప్రామాణిక గ్రంథాల ప్రచురణ, సభలు, సమావేశాలు, సమ్మేళనాలు చేపట్టి సాహిత్యాభిరుచిని, ఆసక్తిని పెంచింది. తెలుగు భాషా వికాస కృషిలో భాగంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ యువ సాహిత్యకారులను తయారు చేస్తూ ప్రోత్సహిస్తున్నది.

మే 25నుంచి 28వరకు ..
తెలంగాణ సారస్వత పరిషత్తు ఈ నెల 25నుంచి 28 వరకు 4రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం ఉత్సవాలను నిర్వహించనున్నారు. 25న సాయంత్రం 1942లో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ నుంచి ఎంఏ తెలుగులో మొట్టమెదటి పట్టభద్రుడై అనంతర కాలంలో అనేక కావ్యాలు, ప్రబంధ వాజ్మయంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన పల్లా దుర్గయ్య 105వ జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సభలో కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ అధ్యక్షుడు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కులపతి జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా, సాహితీవేత్తలు ముదిగంటి సుజాతారెడ్డి, అనుమాండ్ల భూమయ్య పాల్గొననున్నారు.
26న తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సంగీత నాటక అకాడమీ అధ్యక్షుడు బి. శివకుమార్, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణాచారి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొనున్నారు. 27న పరిణతవాణి ఎనిమిదో సంపుటి, ఆంధ్రవాజ్మయ చరిత్రం, కుతుబ్‌షాహీల తెలుగు సాహిత్య సేవ, తెలంగాణ మాండలికాలు-కావ్య ప్రయోగాలు, డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి కథలు, సుమతి, వేమన శతకాలు, పరిషత్తు ప్రాథమిక, ప్రవేశ, విశారద పూర్వోత్తర భాగాల పాఠ్యగ్రంథాలను ఆవిష్కరించనున్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకరరావు, శాంతా బయోటెక్నిక్స్ అధినేత డాక్టర్ కె.ఐ.వరప్రసాద్‌రెడ్డి సాహిత్య అకాడమీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి సాహితీవేత్త మాసన చెన్నప్ప పాల్గొననున్నారు. 28న తెలంగాణ వైతాళికులు సురవరం ప్రతాపరెడ్డి 123వ జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నారు. సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి, ప్రముఖ పరిశోధకురాలు డాక్టర్ రావి ప్రేమలతకు సురవరం ప్రతాపరెడ్డి సాహితీ వైజయంతి పురస్కారం ప్రదానం చేయనున్నారు. సురవరం పుష్పలత తదితర సాహితీవేత్తలు పాల్గొనున్న ఈ సభలకు పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షత వహిస్తారని పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య తెలిపారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...