ఉత్కంఠ పోరులో...రేవంత్‌రెడ్డి విజయం


Fri,May 24, 2019 04:53 AM

దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి విజయం సాధించారు. ఆది నుంచి నువ్వానేనా అన్నట్లుగా ఉత్కంఠభరితంగా సాగిన పోరులో 10,919 ఓట్ల ఆధిక్యత సాధించి టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై గెలిచారు. మొత్తం 31,49,710 ఓట్లుండగా, ఇందులో 15,60,108 (49.40శాతం)మంది (పురుషులు - 8,22,098, స్త్రీలు - 7,37,975, ఇతరులు-35) మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డికి 6,03,748 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్ అభ్యర్థి 5,92,829 ఓట్లు పోలయ్యాయి. అలాగే 3,04,282 ఓట్లతో బీజేపీ అభ్యర్థి ఎన్.రాంచందర్ రావు మూడవ స్థానంలో నిలిచారు.

జనసేనకు 28,364 ఓట్లు రాగా, గతంలో ఎన్నుడూ లేనివిధంగా నోటాకు 17,842 ఓట్లు పోలవడం విశేషం. వాస్తవానికి మొదటి 12వ రౌండ్ వరకు టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి మెజార్టీ కనబర్చినప్పటికీ, 20వ రౌండ్ నుంచి క్రమంగా పుంజుకున్నారు. దీంతో చివరి నిమిషంలో రేవంత్ రెడ్డి ప్రతిరౌండ్‌లోనూ లీడ్ సాధిస్తూ చివరకు మల్కాజిగిరి ఎంపీగా విజయం నమోదు చేసుకున్నారు. ఎంపీగా గెలిచిన రేవంత్‌రెడ్డికి మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం రిటర్నింగ్ ఆఫీసర్ డా.ఎంవీ రెడ్డి గెలుపు ధ్రువీకరణ పత్రం అందించారు.
గురువారం ఉదయం 6గంటల వరకే పోలింగ్ అధికారులు, పలు పార్టీలకు చెందిన రాజకీయ పార్టీల నేతలు, ఏజెంట్‌లు వచ్చారు. ఉదయం 7గంటలకు ముందుగా ఎన్నికల అధికారులు పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కించారు. అనంతరం 8.30గంటలకు మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రారంభమైంది.

మొదటి రౌండ్ నుంచి 10వ రౌండ్ వరకూ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డిపై ఆధిక్యత చాటారు. ఇక 11వ రౌండ్ నుంచి రేవంత్‌రెడ్డికి వందల సంఖ్యలో మెజార్టీ పెరుగుతూ వచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎం.వీ.రెడ్డి, ఎన్నికల పరిశీలకులు నిత్యం పర్యవేక్షించారు. మేడ్చల్ 21, మల్కాజిగిరి 28, కుత్బుల్లాపూర్ 34, కూకట్‌పల్లి 28, ఉప్పల్ 27, ఎల్బీనగర్ 20, కంటోన్మెంట్ నియోజకవర్గాలలో 17 రౌండ్‌ల్లో ఈ ఫలితాలను లెక్కించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ఎప్పటికప్పుడు హోలీమేరి కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌లో ప్రకటించారు. అలాగే ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన ఫలితాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రీన్‌లో చూయించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి మూడు ఈవీఎంలు మొరాయించాయి. దీంతో అధికారులు ఒక్కసారిగా ఆప్రమత్తమై వాటిని సెట్ చేసి వాటిలో ఉన్న వీవీ ప్యాట్‌లను లెక్కించారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...