కాలనీలన్నీ పచ్చదనంతో కళకళలాడాలి


Thu,May 16, 2019 12:30 AM

హైదర్‌నగర్‌: కాలనీలు బాగుపడి పచ్చదనంతో కళకళలాడాలంటే బల్దియా తోడ్పాటు సహా కాలనీ సంక్షేమ సంఘాలు కీలక పాత్ర పోషించాలని బల్దియా కమిషనర్‌ దానకిశోర్‌ కోరారు. జలవాయు విహార్‌ వంటి కాలనీలు నగరమంతటికీ ఆదర్శమని, మిగిలిన ప్రాంతాల్లోనూ ఇంతటి చక్కటి కాలనీలను రూపొందించుకునేందుకు ప్రజల సహకారంతో బల్దియా తగిన కృషి చేస్తుందన్నారు. ‘సాఫ్‌ హైదరాబాద్‌- స్వచ్ఛ హైదరాబాద్‌' కార్యక్రమంలో భాగంగా బుధవారం కూకట్‌పల్లి సర్కిల్‌ హైదర్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని జల వాయు విహార్‌ కాలనీలో కమిషనర్‌ దాన కిశోర్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీలోని పార్కులను, కంపోస్ట్‌ తయారీ కేంద్రాన్ని, పచ్చదనాన్ని, అంతర్గత రహదారులను, కమ్యూనిటీ హాల్‌ను పరిశీలించారు. అనంతరం దానకిశోర్‌ మాట్లాడుతూ నగరంలో 3500లకు పైగా కాలనీలుండగా, వాటినీ జల వాయు విహార్‌ వంటి కాలనీలుగా తీర్చిదిద్దేందుకు జూలై మాసం లక్ష్యంగా పని చేస్తున్నట్లు, అయితే ఒక్కసారిగా ఈ అద్భుతం జరుగదని, స్థానికంగా ఉన్న ప్రజలంతా చిత్తశుద్ధితో భాగస్వాములు కావడం ద్వారా సాధ్యమవుతుందన్నారు. నగరవ్యాప్తంగా కోటి మొక్కలను నాటుతున్నట్లు, ఎవరికి మొక్కలు కావాలన్నా బల్దియా ఆధ్వర్యంలో ఉచితంగా అందిస్తామన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని జీహెచ్‌ఎంసీ, జలమండలిల సంయుక్తాధ్వర్యంలో 18న ఇంకుడు గుంతలను పునర్నిర్మాణ పనులను చేపడుతున్నట్లు, 6 వేల మంది వరకూ వలంటీర్లు ఇందులో భాగస్వాములవుతారని వెల్లడించారు. కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ శంకరయ్య, డీసీలు అశోక్‌ సామ్రాట్‌, మమత, కాలనీ ప్రతినిధి ప్రసాద్‌, నగేశ్‌, త్రినాథ్‌, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...