సైబర్‌ చీటర్స్‌.. స్కూళ్లకు టోపీ


Thu,May 16, 2019 12:25 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : అసిఫ్‌నగర్‌లో నివాసముండే రెడియన్స్‌ స్కూల్‌, టోలిచౌక్‌లోని ఐడియల్‌ స్కూల్‌ కరస్పాండెంట్లు సోహెల్‌, నవీద్‌లు సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసానికి గురయ్యారు. ఎంహెచ్‌ఆర్‌డీ పేరుతో స్కూల్స్‌, కాలేజీ నిర్వాహకులు, అందులో పనిచేసే వారికి సైబర్‌నేరగాళ్లు వాట్సాఫ్‌ మేసేజ్‌లు, ఈ మెయిల్స్‌ పంపించారు. ఎంహెచ్‌ఆర్‌డీ పేరుతో పంపించిన ఈమెయిల్స్‌తో పాటు ‘సెంటర్‌ ఫర్‌ కరెక్టివ్‌ రిఫామ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌'(సీసీఆర్‌ఈ) స్కీమ్‌లో పాఠశాలకు చేకూరే ప్రయోజనాలు, దాని ద్వారా పాఠశాల యజమాన్యానికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, సమాజానికి ఏవిధంగా లాభాలుంటాయనే విషయాన్ని తెలిపే ఓ విజన్‌ డాక్యుమెంట్‌ను ఆయా పాఠశాలల యాజమాన్యాలకు పంపించారు.

ముందుగా దేశంలోని 3000 స్కూళ్లలో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా చేపడుతున్నట్లు ఇది మూడేండ్ల నుంచి ఐదేండ్ల కాల వ్యవధికి సంబంధించిన ప్రాజెక్ట్‌ అంటూ నమ్మించారు. అయితే ఇందులో భాగస్వామ్యం కావాలంటే సెక్యూరిటీ డిపాజిట్‌ చేయాలని ఏప్రిల్‌ 4వ తేదీన ఢిల్లీలో ఈ ప్రొగ్రామ్‌ ప్రారంభం కానుందని, ఇందులో సభ్యులుగా చేరిన వారు హాజరయ్యేందుకు అర్హులంటూ నమ్మించారు. దీంతో రెండు స్కూళ్ల కరస్పాండెంట్లు రూ. 3.42 లక్షల చొప్పున మొత్తం రూ.6.84 లక్షలు సైబర్‌నేరగాళ్లు సూచించిన బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేశారు. అయితే తాము డిపాజిట్‌ చేసిన డబ్బుకు గ్యారంటీ ఏమి ఇస్తారంటూ ప్రశ్నించడంతోనే సైబర్‌నేరగాళ్లు వీళ్లతో మాట్లాడడం మానేశారు. దీనిపై అనుమానం వచ్చిన బాధితులు సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఢిల్లీలో గాలింపు.. మూసివేసిన కార్యాలయం
సీసీఆర్‌ఈ పేరుతో ఢిల్లీలో కార్యాలయాన్ని ప్రారంభించి, దేశ వ్యాప్తంగా ఈ ముఠా మోసాలకు పాల్పడుతున్నట్లు సైబర్‌క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగా ఢిల్లీకి వెళ్లిన బృందం, సంస్థ కార్యాలయం వద్దకు వెళ్లడంతో ఆ కార్యాలయం మూసివేసి ఉంది. ఇది కేవలం నగరానికి చెందిన ఇద్దరు పాఠశాల యాజమాన్యులను మోసం చేసిన ముఠా కాదని, దేశ వ్యాప్తంగా చాలామందిని మోసం చేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలాఉండగా మోసం చేసిన ఢిల్లీ గ్యాంగ్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాలో రూ.50 లక్షల వరకు డిపాజిట్లు ఉన్నట్లు సైబర్‌ పోలీసులు గుర్తించి, ఆయా ఖాతాలను సీజ్‌ చేశారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...