రూ.3 కోట్లు కొల్లగొట్టారు


Thu,April 25, 2019 04:12 AM

- ఐసీఐసీఐనే లక్ష్యంగా 3500 మంది ఖాతాల నుంచి మాయం
- జాంతారా సైబర్ చీటర్స్ నయా మోసం
- 900 మొబైల్ నంబర్ల నుంచి 3 లక్షల ఫోన్ కాల్స్

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: జార్ఖండ్ రాష్ట్రం జాంతారా సైబర్ క్రిమినల్స్ సరికొత్త నేర ప్రక్రియ కార్పొరేట్ బ్యాంకింగ్ రంగాన్ని వణికించేస్తోంది. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నమోదైన ఫిర్యాదులపై సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తులో సరికొత్త చీటింగ్ సంచలనం సృష్టించింది. బ్యాంక్‌లతో పాటు ఖాతాదారులు అప్రమత్తంగా సైబర్ నేరగాళ్ల హైటెక్ ప్రక్రియల నుంచి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఏ కొద్దిగా నిర్లక్ష్యంగా ఉన్నా ఖాతా ఖాళీ ఖాయమని సూచిస్తున్నారు. హైదరాబాద్ ఐసీఐసీఐ రీజినల్ మేనేజర్(ఫైనాన్సియల్ క్రైం ప్రివెన్షన్ గ్రూపు) సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఒక నెలలో ఓ బ్యాంకు కాల్ సెంటర్‌కు 3 లక్షల ఫోన్‌లు చేసి 3500 మంది ఖాతాదారుల ఖాతాల నుంచి 3 కోట్ల రుపాయాలను విత్ డ్రా చేసిన 10 మంది సభ్యుల ముఠాను బుధవారం పోలీసులు అరెస్టుచేశారు. గచ్చిబౌలీలోని సైబరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ సజ్జనార్ వెల్లడించిన వివరాల ప్రకారం..మార్చి నెలలో ఐసీఐసీఐ బ్యాంక్ టోల్ ఫ్రీ నెం.18601207777-ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్(ఐవీఆర్)కు 3 లక్షల ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ కాల్స్ అన్ని నమోదు కాని 900 ఫోన్ నెంబర్ల నుంచి వచ్చాయని తెలిపారు. వీరందరూ బ్యాలెన్స్ ఎైంక్వెరీ ఆప్షన్ అడిగి పిన్ నెంబర్ల టైప్ చేస్తూ దాదాపు 3500 ఖాతాదారుల ఖాతా నుంచి 3 కోట్ల రుపాయాలను క్లోనింగ్ చేసిన వెయ్యి కార్డులతో నగదును విత్‌డ్రా చేశారు.అయితే ఖాతాదారుడు తన ప్రమేయం లేకుండానే ఇతర ప్రాంతాల్లో తన ఖాతా నుంచి నగదు డ్రా అయ్యిందని చెప్పడంతో ఆరా తీసుకుని ఖాతాదారులకు చెల్లించేస్తుంది. ఈ విధంగా ఐసీఐసీఐ బ్యాంక్ నష్టపోయింది.

అంతా రెడ్ బస్సు యాప్‌లోనే..
ఈ ప్రాంతానికి చెందిన సైబర్ మాయగాళ్లు ముందుగా ఓ బ్యాంక్‌ను టార్గెట్ చేసుకుని ఆ బ్యాంక్‌కు సంబంధించిన డెబిట్ కార్డుల మీద ఉండే ఆరు నెంబర్ల సీరిస్‌ను సేకరిస్తారు. దేశవ్యాప్తంగా ఈ సీరిస్ నెంబర్లు ఒక్కటే ఉంటాయి. దీంతో వారి మొబైల్ ఫోన్‌లో రెడ్ బస్సు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటారు. అందులో రీచార్జీ ఆప్షన్‌ను క్లిక్ చేస్తారు. అందులో ఫోన్ నెంబరును రీచార్జీ కోసం పలు వివరాలు టైప్ చేయగానే పేమంట్ కట్టేందుకు కావాల్సిన డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు నమోదు చేయాలని ఆప్షన్‌ను అడుగుతుంది. అందులో డెబిట్ కార్డును ఎంచుకుని వారి వద్ద ఉన్న మొదటి ఆరు నెంబర్లను టైప్ చేసి ఆ తర్వాత నెంబర్లను ఊహించుకుని లక్కీ ట్రైగా మిగతా 10 నెంబర్లను ఎంట్రీ చేశారు. ఒక వేళ వారు ఎంట్రీ చేసిన నెంబరు సరిపోతే ఆ తర్వాత ఆప్షన్‌కు వెళ్ళాలని యాప్‌లో స్క్రోల్ మార్క్ సూచిస్తుంది. వెంటనే ఆ నెంబరును నోట్ చేసుకుంటారు. వెంటనే ఐసీఐసీఐ బ్యాంక్ టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేస్తారు. అది ఐవీఆర్(ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) పద్ధతిలో ఉండడంతో ఫోన్ చేసిన వ్యక్తికి కావాల్సిన సౌకర్యం కోసం నెంబర్లను టైప్ చేయమంటారు. అప్పుడు చీటర్లు బ్యాలెన్స్ ఎైంక్వెరీ కోసం ఐవీఆర్ సూచించే నెంబరును టైప్ చేస్తారు. అందులో అడిగినట్లు 16 అంకెల నెంబరును టైప్ చేస్తారు. ఆ తర్వాత పిన్ నెంబరు అడుగగానే మరోసారి లక్కీ ట్రైలో ఊహించి నాలుగు అంకెల పిన్ నెంబరును టైప్ చేస్తారు. అది కరెక్ట్ అయితే ఐవీఆర్ బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పుతుంది. దీని ఆధారంగా ఆ పిన్ నెంబరును నోట్ చేసుకుంటారు. ఇలా ఊహలతో 16 అంకెల డెబిట్ కార్డు నెంబరు, పిన్ నెంబర్లను భద్రపర్చుకుని వాటిని వివిధ మ్యాగ్నిటిక్ స్ట్రిప్ కార్డులోకి ఈ సమాచారాన్ని ఎక్కిస్తారు. ఆ తర్వాత ఆ కార్డు ద్వారా ఏటీఎంలలో విత్ డ్రా చేస్తారు. దీంతో బ్యాంక్ ఖాతాదారులకు తెలియకుండానే వారి ఖాతా నుంచి ఇతర ప్రాంతంలో నగదు డ్రా అవుతుంది. ఈ ప్రక్రియతోనే జాంతారా, దేవ్‌ఘడ్ ప్రాంతానికి చెందిన 700 మంది యువకులు ఐసీఐసీఐ బ్యాంక్‌ను టార్గెట్ చేశారు.

28 రోజుల పాలు మాటు వేశారు
ఈ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ పర్యవేక్షణలో సైబర్ క్రైం పోలీసులతో పాటు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలు దర్యాప్తు చేపట్టాయి. సాంకేతిక పరంగా లభించిన ఆధారాలతో జార్ఖండ్‌లోని జాంతారా, దేవఘర్ ప్రాంతాల్లో 28 రోజుల పాటు తిష్టవేశారు. లభించిన ఆధారాలతో ఈ మోసానికి పాల్పడ్డ ప్రధాన నిందితుడు దుర్యోధన్ మండల్, సంజయ్‌కుమార్ మండల్, విరేంద్రకుమార్ మండల్, ధనంజయ్ మండల్, నిరంజన్ మండల్, ప్రకాశ్‌కుమార్, గణేశ్‌కుమార్, కమలేశ్ మండల్, రాజేంద్ర కుమార్, పింకు కుమార్ మండల్‌లను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి దాదాపు వెయ్యికి పైగా క్లోనింగ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో 2011 నుంచి ఈ ప్రాంతంలోని చాలా మంది యువత బ్యాంక్ అధికారలమంటూ ఫోన్‌లు చేసి డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు, ఓటీపీలు, పిన్ నెంబర్లను సేకరించి బురిడి కొట్టించే ప్రక్రియను ప్రారంభించారు. ఇలా రోజుల వారిగా మారుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ చీటర్లు కూడా వారి ప్రకియకు పదును పెడుతూ లక్షలాది మంది ఖాతాదారులను బురిడి కొట్టించారని తెలిసింది. ఈ మోసంలో కూడా దాదాపు 700 మంది జాంతారా, దేవ్‌ఘడ్ ప్రాంతానికి చెందిన యువకులు ఐవీఆర్‌కు ఫోన్ చేసి ఖాతాదారుల డెబిట్ కార్డు , పిన్ వివరాలను సేకరించినట్లు తేలింది.

రెడ్ బస్సు యాప్ ఎందుకంటే..
ఈ నేర ప్రక్రియను ప్రధాన సూత్రధారి దుర్యోధన్ మండల్ మొదట రెడ్ బస్సు యాప్‌లో ప్రయత్నించాడు. అది సక్సెస్ అవడంతో అతను ఆ గ్రామంలో ఉన్న మిగతా వారందరికీ చెప్పడంతో అందరూ ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఓ బ్యాంక్‌కు చెందిన మొదట 6 నెంబర్లకు అనుగుణంగా మిగతా 10 అంకెలను ఊహిస్తు టైప్ చేస్తూ ప్రయత్నిస్తారు. డెబిట్ కార్డు నెంబరును పొంది దాని ఆధారంగా టోల్‌ఫ్రీ ఐవీఆర్ ద్వారా పిన్ నెంబరును కూడా సంపాదించారు. ఇలా 700 మంది అనుమానితులు ప్రతి రోజు వివిధ బ్యాంక్‌ల డెబిట్ కార్డుల మొదటి 6 నెంబర్లకు మిగతా 10 నెంబర్లను జోడించుకుంటూ ఒక్కకరు 25 చొప్పున మార్చి నెలలో మొత్తం 3 లక్షల కాల్స్‌ను ఐవీఆర్‌కు చేయడం గమనార్హం. వీటిలో 3500 మందికి సంబంధించిన డెబిట్ కార్డు, పిన్ నెంబర్లు తెలిసిపోయాయి. వీటిని 1044 కార్డులకు క్లోనింగ్ చేసుకుని 12 రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజాస్తాన్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, కేరళలలో రూ. 3 కోట్లు విత్ డ్రాచేశారని పోలీసులు తేల్చారు.

బ్యాంక్‌ర్లకు సూచనలు..
- కస్టమర్ కేర్ సర్వీసుకు ఖాతాదారు రిజిస్టర్ మొబైల్ ఉంటేనే కనెక్ట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలి.
- ఖాతాదారుడి నిర్ధారణ కోసం కస్టమర్ కేర్ సర్వీసులో పలు అంశాలను ప్రశ్నించుకుని నివృత్తి చేసుకనేలా ఏర్పాట్లు చేయాలి.
- రిజిస్టర్ మొబైల్ ఉన్న ఖాతాదారుడికి మొబైల్ అప్లికేషన్స్ సేవలు ఇవ్వాలి.
- బ్యాంకులు పటిష్టమైన సాఫ్ట్‌వేర్‌ను అందు బాటులో పెట్టుకోవాలి.
ప్రజలు కూడా ఎవరీకి తమ ఖాతా, డ్రెబిట్, క్రెడిట్, పి న్, సివీవీ, ఓటీపీ నెంబర్లను షేర్ చేయొద్దని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ ముఠాను పట్టుకున్న సైబరాబాద్ క్రైం డీసీపీ రోహిణి ప్రియదర్శిని, సైబర్ క్రైం, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలను సీపీ సజ్జనార్ అభినందించారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...