ఇంటింటా పవిత్ర గీత..


Thu,April 25, 2019 04:10 AM

నమస్తే తెలంగాణ, సిటీబ్యూరో : ఒక వ్యక్తి చనిపోయినప్పుడో.. శవయాత్ర, దహన సంస్కారాలు చేసేటప్పుడో వేసేది కాదు భగవద్గీత అని కళ్లెం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నో శవయాత్రలు, దహన వాటికలు, శ్మశాన వాటికల వద్దకు వెళ్లి తన ఆవేదనను వినిపించారు. తన ఆలోచనను పది మందితో పంచుకున్నారు. తుదకు తన వాదనకు పలువురు మద్దతు పలికి ఇక ముందు గీతా పారాయణాన్ని ఇలా ఉపయోగించమని అనిపించారు.

అధికారిగా ఉంటూనే... ప్రచారం
కళ్లెం శ్రీనివాస్‌రెడ్డి విద్యుత్ సౌధలో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఎర్రగడ్డలోని నటరాజ్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి ఆఫీసర్ కంటే ముందు యూనియన్ నాయకుడిగా పని చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మందితో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నారు. వివిధ రకాల మతస్తులతో స్నేహం ఉంది. అయితే, ఎవరైనా చనిపోయినప్పుడు భగవద్గీతను ప్రసారం చేయడంతో చాలా ఇబ్బందికరమైన అనుభూతిని ఎదుర్కొనే వారు. ఇలా వీధుల వెంట ఆ గీతా పారాయణాన్ని అయిష్టంగా వింటూనే రెండు నుంచి మూడేండ్ల వరకు గడిపాడు. ఒక రోజు ఒక ముస్లిం మిత్రుడు సలీంతో ఆఫీసు నుంచి బయటకు వస్తుండగా గీత శ్లోకం వారికి వినిపించింది. దానితో మనసు చివుక్కుమని అరే.. శ్రీనివాస్ భాయ్ ఎవరో చనిపోయారు..! అని మిత్రుడు సలీం అన్నాడు. అవును.. అన్నట్టు తలూపుతూ శ్రీనివాస్‌రెడ్డి కదులుతుండగా.. అరె భగవద్గీత గొప్ప గ్రంథం కదా.. మరెందుకు ఇలా..? అనే లోపే.. శ్రీనివాస్‌రెడ్డి ఆ దగ్గరలోని శవయాత్ర వారి వద్దకు వెళ్లి భగవద్గీతను ఇలా వాడొద్దు. ఇది చాలా గొప్పది. గీతా పారాయణం ఇలా చేయడం సమంజసం కాదు. అని వారితో వాగ్వాదం చేశాడు. తుదకు చనిపోయినప్పుడు ఏమి వాడాలన్న ఒక ప్రశ్న వారిలోంచి రావడంతో నేనే ఒక సీడీని తయారు చేయించి ఇస్తాను.. అంత వరకు దయచేసి గీతను వాడొద్దు అని చెప్పి వారితో ఒప్పించాడు. ఇలా నగరంలోని ప్రతి శ్మశాన వాటికను సందర్శించి ప్రతి ఒక్కరికి గీత గొప్పతనాన్ని, మహత్తు గురించి వివరించి ఎంతోమందిలో ఆ దిశగా చైతన్యం తీసుకొచ్చారు. శ్రీనివాస్ రెడ్డి ఇంటింటా పవిత్ర భగవద్గీత అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని నగరమంతటా పర్యటించారు. ఇలా ఈఎస్‌ఐ, ఎర్రగడ్డ, పంజాగుట్ట, బన్సీలాల్‌పేట, మూసాపేట, నాచారం, బోయిన్‌పల్లి, అంబర్‌పేట, గోల్నాక మొదలైన శ్మశాన వాటికలను సందర్శించి అంతిమ యాత్ర వాహనాలు నడిపే డ్రైవర్లు, యాజమాన్యాలకు ఉపదేశించారు. మరెంతో మందిలో ఈ దిశగా చలనం తీసుకొచ్చారు. అయితే, అంబర్‌పేట శ్మశాన వాటిక వద్ద శ్రీనివాస్, ఏకాంబర్‌లు, బన్సీలాల్‌పేట శ్మశాన వాటిక వద్ద బండి శాంతా కుమార్ శ్రీనివాస్ రెడ్డికి సహకారం అందించి అండగా నిలిచారు.

తెలంగాణలో విస్తృత పర్యటన
రాష్ట్రంలోని రామగుండం, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, ఏటూరునాగారం, జనగాం, భువనగిరి, సిద్దిపేట మొదలైన పట్టణాల్లో పర్యటించి ఇంటింటా పవిత్ర భగవద్గీత అనే నినాదంతో తెలంగాణ వ్యాప్తంగా హిందువులందరిలో చైతన్యం తీసుకొస్తున్నారు. శ్మశానాల వద్ద, ఇంకా పలుచోట్ల భగవద్గీత ప్రాధాన్యతను వివరిస్తూ ఫ్లెక్సీలను కట్టించారు. ఒక లక్ష మంది పిల్లలు శ్లోకాలను నేర్చుకునే విధంగా అన్ని రకాలుగా చిన్న చిన్న పుస్తకాలు ముద్రించి, శ్లోకాల పఠనంపై పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఇందులో భాగంగా శ్రీనివాస్ రెడ్డితో పది మంది సభ్యులు కురుక్షేత్రకు సైతం వెళ్లి అక్కడ కూడా గీతా పారాయణంలోని 18 చాప్టర్లను పఠించారు. భగవద్గీతపై రీసెర్చ్ చేసిన రాజస్థాన్ వాసి, బ్రహ్మకుమారి ఉషాదీదీని సైతం శ్రీనివాస్‌రెడ్డి కలిసి ముచ్చటించారు. ప్రస్తుతం, ఫేస్‌బుక్, వాట్సాప్‌ల ద్వారా రోజూ 9వేల మందితో శ్రీనివాస్‌రెడ్డి మమేకమవుతున్నారు. ప్రత్యేకంగా సెలవు దినాలలో వివిధ ప్రాంతాలకు వెళ్తూ, ఇంటింటా పవిత్ర భగవద్గీతపై ప్రచారం చేస్తున్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...