భూ సేకరణ ముమ్మరం


Sat,April 20, 2019 12:59 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు శాశ్వత దాహార్తిని తీర్చే ప్రాజెక్టుగా ప్రభుత్వం రూ. 4396.16కోట్లతో నిర్మించ తలపెట్టిన కేశవాపూర్ రిజర్వాయర్ పనులను పట్టాలెక్కించేందుకు జలమండలి యం త్రాంగం చకచక అడుగులు వేస్తున్నది. నగరానికి డెడికేటెడ్ రిజర్వాయర్లు ఉండాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు కేశవాపురం దగ్గర పది టీఎంసీల సామర్థ్యంతో భారీ రిజర్వాయర్‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే భారీ రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ, నిర్మాణ పనులకు సమయం పట్టే అవకాశాలున్న తరుణంలో నీటి శుద్ది కేంద్రం, ఇన్‌టేక్, భారీ పైపులైన్ విస్తరణ పనులను పట్టాలెక్కించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు తొలుత బొమ్మరాస్‌పేట డబ్ల్యూటీపీ (నీటి శుద్ది కేంద్రం) నిర్మాణానికి దాదాపు 95 ఎకరాలు అవసరమని గుర్తించారు. ఇందులో దేవాదాయ శాఖకు సంబంధించిన 65 ఎకరాలకు సంబంధించి జలమండలి అధికారులు స్వయంగా ఇటీవల రూ. 24కోట్లు కేటాయించి సంబంధిత మొత్తం భూములను స్వాధీనం చేసుకుని పనులకు మార్గం సుగమమం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, పురపాలక ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్‌ల సూచనల మేరకు జలమండలి ఎండీ దానకిశోర్, ఉన్నతాధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లతో పాటు దేవాదాయ శాఖతో ఎప్పటికప్పుడు భూ సేకరణపై చర్చిస్తూ వచ్చారు.

'దేవాదాయ శాఖ నుంచి దాదాపు 182.35 ఎకరాల మేర సేకరించాల్సి ఉన్నప్పటికీ తక్ష ణం 90 ఎకరాల మేర సేకరించి నీటి శుద్ది కేంద్రం (డబ్ల్యూటీపీ) పనులను చేపట్టే దిశగా జలమండలి అధికారులు అడుగులు వేస్తున్నారు. దేవాదాయ శాఖ నుంచి అనుమతులు రాగానే తొలుత వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, రిజర్వాయర్ ఇన్‌టేక్ పనులను చేపట్టనున్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి నారాయణపూర్ మీదుగా దాదాపు 8 గ్రామాలు దాటి బొమ్మరాసిపేట వరకు ఇన్‌టేక్ పనులను చేపడతారు. పంచాయతీ శాఖ రోడ్‌కు ఇరువైపులా దాదాపు 18 కిలోమీటర్ల మేర జరిగే ఈ పనులకు 16 కిలోమీటర్లు మేర ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులకు అనుకూలంగా ఉంది. రెండున్నర కిలోమీటర్ల మేర పోలాలు ఎక్కువగా ఉందని గుర్తించారు. కాలువ (గ్రావిటీ) ఆధారంగానే నీటిని సరఫరా చేసేందుకు వీలుగా 3,600 ఎంఎం డయా వ్యాసార్థం గల భారీ మైల్డ్ స్టీల్ పైపులైన్‌లను రోడ్డుకు ఇరువైపులా రెండు వరుసల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ పైపులైన్ విస్తరణ పనులకు భూ సేకరణ సమస్యను అధిగమించడం సాధ్యమేనని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఒకవైపు పనులు చేపట్టేందుకు సదరు ఎజెన్సీ సిద్దంగా ఉండడం, భూ సేకరణ సైతం కొలిక్కి వస్తుండడంతో సాధ్యమైనంత త్వరలో ఈ భారీ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టనున్నామని అధికారులు తెలిపారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...