పది లక్షలపైనే..


Tue,April 16, 2019 03:15 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : లోకసభ ఎన్నికల సంగ్రామం ముగిసింది. 11న జరిగిన పోలింగ్ ప్రక్రియలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఓటింగ్ శాతం అంతంత మాత్రమే. హైదరాబాద్‌లో 44.75, సికింద్రాబాద్‌లో 46.26, మల్కాజిగిరిలో 49.40, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 53.22 శాతం పోలింగ్ నమోదైంది. ఇది గత అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ పోలింగ్ శాతం. ఇందుకు ఓటర్లలో ఉత్సాహం కరువైందని, విద్యావంతులు, మేధావులు ఎక్కువగా ఉండే హైదరాబాద్‌లో ఓటింగ్‌కు అనాసక్తి చూపారని, భానుడి భగభగల నడుమ పోలింగ్ బూత్‌లకు రాలేదన్న సరళిపై భిన్న వాదనలు వినిపించాయి. అయితే వాస్తవంగా నాలుగు పార్లమెంట్ల పరిధి నుంచి సగటు ఓటరు ఊరెళ్లడమే పోలింగ్ శాతం తగ్గడానికి ప్రధాన కారణమని రవాణా సంస్థల గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.

తెలుగు రాష్ర్టాల్లో ఒక్కసారే ఎన్నికలు రావడం, అందులో పోలింగ్ రోజు ఒక్కటే కావడం, వివిధ జిల్లాల నుంచి నగరంలో స్థిరపడిన వారికి ఒక్క చోటనే తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉండడంతో చాలా మంది ఓటర్లు హైదరాబాద్ నుంచి వెళ్లారు. పోలింగ్ రోజున సెలవు ఉండడంతో ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు ఒక రోజు ముందుగానే ఓటరు నగరాన్ని విడిచి వెళ్లారు. ముఖ్యంగా పక్క రాష్ట్రంలో ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఉండడంతో అక్కడే ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు ఆసక్తి చూపారు. గమనార్హం. ఈనెల 8 నుంచి 12వ తేదీ వరకు నగరం నుంచి వివిధ ప్రాంతాలకు గణనీయంగా ప్రయాణికులను తరలించినట్లు రవాణా సంస్థలు రైల్వే, ఆర్టీసీ సంస్థల గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రికార్డు స్థాయి ప్రయాణికులను రిజిస్టర్ చేసింది. ఆర్టీసీ పరంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఓట్లు వేయడానికి నగరం నుంచి దాదాపు 10 నుంచి 12 లక్షల మంది ఓటర్లు తమ స్వస్థలాలకు వెళ్లారు. ఇక వ్యక్తిగత వాహనాలు, ప్రైవేట్ వాహనాలు/మినీ బస్సుల్లో ఓటర్లు భారీగానే వెళ్లినట్లు హెచ్‌ఎండీఏ ఔటర్ రింగు రోడ్డు టోల్ గేట్, జాతీయ రహదారుల వద్ద ఉన్న టోల్ గేట్ల వద్ద నుంచి వెళ్లిన వాహనాలే ఇందుకు నిదర్శనం.

5.59 లక్షల మంది రైల్వేలో ప్రయాణం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో జరిగే ఎన్నికల నేపథ్యంలో రద్దీకీ అనుగుణంగా ప్రత్యేక రైళ్లు అదనపు బోగీలను ఏర్పాటు చేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రికార్డుస్థాయి ప్రయాణికులను రిజిస్టర్ చేసింది. ఈ నెల10వ తేదీ ఒక్కరోజే 1,24,000 మంది ప్రయాణికులు ప్రయాణించి రికార్డును నమోదు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఒక్క రోజే 96,000 మంది అన్‌రిజర్వ్‌డ్‌గా 28 వేల మంది రిజర్వ్‌డ్ మంది ప్రయాణించారని వెల్లడించారు. నగరంలోని సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ , లింగంపల్లి స్టేషన్ల ద్వారా అత్యధిక మంది ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు బయలుదేరారు. మొత్తం 8,9,10 తేదీల్లో కలిస్తే 2,41,046 అన్‌రిజర్వుడ్ ప్రయాణికులు, 97,512 రిజర్వుడ్ ప్రయాణికులు కలిసి 3,38,558 మంది సికింద్రాబాద్ ఒక్క స్టేషన్ నుంచి గమ్యస్థానాలకు చేరుకున్నారు. హైదరాబాద్(నాంపల్లి) స్టేషన్ నుంచి 52,785 అన్‌రిజర్వ్‌డ్, 17,446 మంది రిజర్వ్‌డ్ కలిపి 70,231 మంది, లింగంపల్లి స్టేషన్ నుంచి 79,596 అన్‌రిజర్వ్‌డ్, రిజర్వ్‌డ్ 5,786 రిజర్వుడ్ కలిపి 85,382 మంది ప్రయాణికులు, కాచిగూడ స్టేషన్ నుంచి 59,560 అన్‌రిజర్వుడ్,4817 రిజర్వ్‌డ్ కలిపి 64,377 మంది ప్రయాణికులు ప్రయాణించారు. అన్ని స్టేషన్లు కలిపి 4,32,987 అన్‌రిజర్వ్‌డ్, రిజర్వ్‌డ్ 1,25,561 మంది కలిపి మొత్తం 5,58,548 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...