తనువుచాలించారు...


Tue,April 16, 2019 03:14 AM

- వేర్వేరు ప్రాంతాల్లో ఆరుగురు ఆత్మహత్య

కిడ్నీ వ్యాధితో మహిళ....
బండ్లగూడ : కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ అత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం... బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రనగర్‌లో నివాసం ఉండే కృష్ణయ్య, లక్ష్మి దంపతుల కూతురు పుష్పలత కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నది. పలు దవాఖానలు తిరిగినా వ్యాధి తక్కువ కాకపోవడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఉద్యోగం రాక మహిళ....
బడంగ్‌పేట, (నమస్తే తెలంగాణ) : ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా రాకపోవడంతో మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నది. మీర్‌పేట సీఐ యాదయ్య కథనం ప్రకారం ... ఒడిశాకు చెందిన ప్రభావతి(41) ఉద్యోగం కోసం ఫిబ్రవరి 23న నగరంలోని మీర్‌పేట మున్సిపాలిటీ, అనురాగ్ కాలనీలో నివాసం ఉండే సోదరుడు నిరంజన్ దాస్ ఇంటికి వచ్చింది. ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించి నా రాకపోవడంతో మనస్తాపానికి గురైంది. దీంతో సోమవారం సోదరుడి ఇంట్లో తాను ఎవరికి భారం కాకూడదని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

దంపతుల మధ్య ఘర్షణ.. మనస్తాపంతో మహిళ...
దోమలగూడ : భర్తతో ఘర్షణ పడి మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ముషీనాబాద్ ఎస్సై రామారావు తెలిపిన వివరాల ప్రకారం... ముషీరాబాద్ బాపూజీనగర్‌లో సృజన్ కుమార్, శైలజా (31) దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి కుమారుడు, కూతురు సంతానం. అయితే ఆదివారం అర్ధరాత్రి దంపతుల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకున్నది. దీంతో మనస్తాపానికి గురైన శైలజా ఇంట్లోని రూంలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం భర్త సృజన్ తలుపు కొట్టగా తీయలేదు. అనుమానంతో తెరిచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు. సోమవారం మధ్యాహ్నం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

భర్త వేధింపులు తట్టుకోలేక....
ఖైరతాబాద్ : జీవితకాలం తోడుంటానని బాసలు చేసిన భర్త తరచూ భార్యను అనుమానంతో వేధించాడు. చివరికి మనస్తాపానికి గురై బలవన్మరణం చెందింది. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....నల్గొండ జిల్లాకు చెందిన సత్యనారాయణకు పదిహేను సంవత్సరాల క్రితం సంధ్యా (35)తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు మగసంతానం. సోమాజిగూడ బస్తీలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. భర్త సత్యనారాయణ ఏ పనిచేయకుండా తిరుగుతుండగా, భార్య సంధ్యా ఇండ్లలో పాచిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. నిత్యం అనుమానంతో సత్యనారాయణ ఆమెను వేధించేవాడు. అతని వేధింపులు ఎక్కువ కావడంతో సోమవారం ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. భర్త నిలువరించేందుకు యత్నించగా అతనికి స్వల్ప గాయాలయ్యాయి. ఆమెను చుట్టు పక్కల వారు గాంధీ దవాఖానకు తరలించగా అప్పటికే మరణించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మానసిక ఒత్తిడితో యువతి....
చార్మినార్ : చికిత్స పొందుతున్న యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కాలపత్తర్ ఇన్‌స్పెక్టర్ కనకయ్య , బాధితుల కథనం ప్రకారం... నవాబ్‌సాబ్‌కుంట, బషరత్‌నగర్‌కు చెందిన మహ్మద్ హుస్సేన్ కూతురు అహ్మదీబేగం (22) స్థానికంగా నివాసం ఉంటూ అంగన్‌వాడి ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తుంది. కొంతకాలంగా మానసిక ఒత్తిడికి లోనవుతున్నది. దీంతో కుటుంబ సభ్యులు దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇంటి సమీపంలో నిర్మాణం ఉన్న మూడంతస్థుల భవనంపై నుంచి దూకింది. వెంటనే ఆమెను ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందిందని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.

కుషాయిగూడ పీఎస్ పరిధిలో యువకుడు....
మల్లాపూర్ : అనుమానాస్పద స్థితిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ బొల్లిశెట్టి శ్రీనివాస్ కథనం ప్రకారం... రాంపల్లికి చెందిన నర్సింహారెడ్డి(23) చర్లపల్లి పారిశ్రామిక వాడలోని మేధ కంపెనీలో క్యాంటీన్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల నర్సింహారెడ్డికి పెండ్లి నిశ్చయమైంది. అయితే అనివార్య కారణాల వల్ల పెండ్లి ఆగిపోయింది. దీంతో మనోవేదనకు గురైన నర్సింహారెడ్డి ఆదివారం రాత్రి కంపెనీలోని స్టోర్ రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తోటి సహచరులు చూసి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కాగా... క్యాంటీన్ నిర్వాహకుడు నాగరాజు వల్లనే తన కుమారుడు మృతి చెందాడని మృతుడి తల్లి దండ్రులు పోలీసులకు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...