గెలుపే లక్ష్యంగా.. పోరు బరిలో..


Mon,March 25, 2019 03:12 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ రాజకీయం వేడెక్కింది. చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్ లోకసభ పోరు బరిలో నిలిచే అభ్యర్థులను ప్రధాన పార్టీలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ప్రధానమైన నామినేషన్ల ఘట్టం సోమవారంతో ముగియనున్నది. దీంతో మంగళవారం నుంచి వచ్చే నెల 9వ తేదీ సాయంత్రం ఐదు గంటల నాటి వరకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలతో బహిరంగ సభలు, రోడ్ షోలు, అంతర్గత సమావేశాలతో పాటు స్టార్ క్యాంపెయిన్లను ప్రచార పర్వంలోకి దించి ఓట్లను కొల్లగొట్టేందుకు అభ్యర్థులు పక్కా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. అయితే ఇప్పటికే గులాబీ పార్టీ అభ్యర్థులు ప్రజాక్ష్రేత్రంలోనే ఉంటూ.. అన్ని వర్గాల ప్రజల మద్దతును కూడగట్టారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలతో జోరు మీదనున్నారు. నియోజకవర్గాల వారీగా విస్తృత సమావేశాలు, మరో వైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభ్యర్థుల తరఫున ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారాన్ని మరింత పదును పెంచుతూ గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగారు. ఎల్బీస్టేడియంలో 29న జరుగనున్న మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల సభలో సీఎం కేసీఆర్ పాల్గొని అభ్యర్థుల మెజార్టీ గెలుపునకు దిశానిర్దేశం చేయనున్నారు. మొదటి వారంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున రోడ్ షోలకు సమాయత్తమవుతున్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమే అయినప్పటికీ అత్యధిక మెజార్టీ లక్ష్యంగా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, కొందరి ముఖ్య నేతలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా అధికార పార్టీ ప్రచారం చేస్తున్నారు.

ముందస్తు ప్రణాళికలతో ముందుకు..
అన్ని సామాజిక వర్గాల మద్దతు లభిస్తే విజయం సునాయాసమన్న భావనలో అభ్యర్థులున్నారు. దీంతో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. పోలింగ్‌బూత్‌ల వారీగా ఉన్న ఓట్లను సామాజిక వర్గాల వారీగా గుర్తించి ఆకట్టుకునేందుకు బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. పగలు ప్రచారం..రాత్రి మంతనాలు సాగిస్తూ అభ్యర్థులతో పాటు వారి అనుచరులు పడరానీ పాట్లు పడుతున్నారు. నియోజకవర్గాల వారీగా ఉన్న మొత్తం ఓట్లలో ఎక్కువ ప్రాబల్యం కలిగిన ఓట్లను పరిగణనలోకి తీసుకుంటున్న అభ్యర్థులు ఆయా సామాజికవర్గాలను ఆకట్టుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. గెలుపోటములు నిర్ధారించే పోలింగ్ బూత్‌లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న అభ్యర్థులు సామాజికవర్గాల వారీగా ఓటర్లను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఒక టీమ్ తయారు చేసుకొని తీసివేతలు, కూడికలు మొదలు పెట్టారు. గెలుపు బాటలో పయణించాలంటే తీసుకోవాల్సిన చర్యలపై మంతనాలు ముమ్మరం చేస్తున్నారు.

నేడే ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్ల దాఖలు..
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నామినేషన్ల దాఖలు ప్రక్రియ సోమవారంతో ముగియనున్నది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నేడే నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా, బీఫారాలు అందుకున్న వీరంతా నామినేషన్లు దాఖలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ 18న ప్రారంభం కాగా, ఇప్పటి వరకు సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి 14 నామినేషన్లు, హైదరాబాద్ నాలుగు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. మిగతా అభ్యర్థులంతా సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

- సికింద్రాబాద్ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి తలసాని సాయికిరణ్‌యాదవ్ సోమవారం అట్టహాసంగా నామినేషన్‌ను దాఖలు చేయబోతున్నారు. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకొని నామినేషన్‌ను దాఖలు చేయబోతున్నారు.
- హైదరాబాద్ పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి పుస్తె శ్రీకాంత్ నాంపల్లి నుంచి కాలినడకన కలెక్టరేట్‌కు వచ్చి నామినేషన్‌ను వేయబోతున్నారు.
- బీజేపీ సికింద్రాబాద్ అభ్యర్థి జి. కిషన్‌రెడ్డి బషీర్‌బాగ్‌లోని కనకదుర్గ శ్రీనాగలక్ష్మి అమ్మవారి దేవాయంలో పూజలు నిర్వహించి, అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్‌కు చేరుకొని నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు.
- బీజేపీ హైదరాబాద్ అభ్యర్థి డా. భగవంతరావు చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు నిర్వహించి, అక్కడి నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకొని నామినేషన్‌ను దాఖలు చేయబోతున్నారు.
- సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్‌కుమార్ యాదవ్ పబ్లిక్‌గార్డెన్స్ సమీపంలో అమ్మవారి దేవాలయంలో పూజలు నిర్వహించి, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి, హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్ సాదాసీదాగా కుటుంబ సభ్యులు, మద్దతుదారులతో వచ్చి నామినేషన్లను దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...