హెచ్‌సీయూలో అనుమానాస్పద స్థితిలో జింక మృతి


Fri,March 22, 2019 04:14 AM

కొండాపూర్ : గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓ వన్యప్రాణి అనుమానాస్పద స్థితిలో మృత్యువాతపడింది. యూనివర్సిటీలోని షూటింగ్ రేంజ్ ప్రాంగణంలో వేటగాళ్ల తూటాలకు జింక మృతిచెందిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీలోని అటవీప్రాంతంలో కొనసాగుతున్న షూటింగ్ రేంజ్ ఆవరణలో గురువారం ఉదయం ఓ జింక మృతిచెంది పడి ఉంది. గమనించిన యూనివర్సిటీ విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం సెక్యూరిటీ సిబ్బందితో కలిసి అక్కడకు వెళ్లిన విదార్థులు అనుమానాస్పద స్థితిలో జింక బుల్లెట్ తరహాలో గాయంతో మృతిచెందినట్లు గుర్తించారు. ఈ మేరకు అటవీశాఖ అధికారులకు, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చిరంజీవి రావు సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. షూటింగ్ రేంజ్ ఆవరణలో ఉన్న ఫెన్సింగ్‌కు గుచ్చుకోవడం, వేటకుక్కల కారణంగానే జింక మృతిచెందినట్లు ప్రాథమికంగా తెలుస్తుందని అనుమానం వ్యక్తం చేశారు.

జింక మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పంచనామ నిర్వహించి పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం నివేదిక అధారంగా మృతికి గల కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు. కాగా... యూనివర్సిటీ విద్యార్థులు మాత్రం వేటగాళ్ల షూటింగ్‌తో బుల్లెట్ తగిలి జింక మృతిచెందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలానికి వచ్చిన విద్యార్థులను, యూనివర్సిటీకి చెందిన సెక్యూరిటీ సిబ్బందిని షూటింగ్ రేంజ్ సిబ్బంది అడ్డుకుని బయటకు రాకుండా తాళాలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు వచ్చేవరకు తమను అడ్డుకున్నారని దీంట్లో అంతర్యమేమిటని విద్యార్థులు పశ్నించారు. కాగా... ఈ విషయమై యూనివర్సిటీకి చెందిన తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్ అథారిటీ షూటింగ్ రేంజ్ పరిపాలనాధికారి అలెగ్జాండర్ స్పందిస్తూ ... పంచనామ లేకుండా జింకను తరలిస్తున్నారనే అడ్డుకున్నామని, అటవీశాఖ అధికారులు వచ్చేవరకు నిలిపివేశామని పేర్కొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...