అభివృద్ధే లక్ష్యం..


Wed,March 20, 2019 01:13 AM

-శంకర్‌పల్లి వరకూ ఎంఎంటీఎస్
-పర్యాటక కేంద్రాలుగా జంట జలాశయాలు
-టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
-గులాబీ గూటికి యువనేత కార్తీక్‌రెడ్డి
మణికొండ, నమస్తే తెలంగాణ : రంగారెడ్డి జిల్లా అభివృద్ధే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్న ప్రతి ఒక్కరినీ కలుపుకుని పోవాల్సిన అవసరం ఉందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి తన అనుచరులతో కలిసి మంగళవారం శంషాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ప్రజాభిష్టం మేరకు సీఎం కేసీఆర్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పెద్దపీట వేస్తూ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం ఓ మినీ భారత్‌గా ఆవిర్భవిస్తున్నదన్నారు. ఓ వైపు అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం, మరోవైపు ఐటీ సెజ్‌లతో పాటు అద్భుతమైన ఔటర్ రింగ్‌రోడ్డులతో అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని పేర్కొన్నారు. బుద్వేల్-కిస్మత్‌పూర్ గ్రామాల పరిధిలోని 300 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ఐటీ పార్కులను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. కొత్వాల్‌గూడలో నైట్ సఫారీ పార్కుల కోసం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.

శంషాబాద్ విమానాశ్రయం పక్కనే త్వరలోనే ఎయిర్‌పోర్టు సిటీని నిర్మించబోతున్నామన్నారు. అదేవిధంగా చరిత్రాత్మక జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లను జాతీయ స్థాయి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే రూ.100 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. 2020 నాటికి వందేండ్లు పూర్తిచేసుకుంటున్న జలాశయాల దశాబ్ది ఉత్సవాలను నిర్వహించి, పర్యాటక కేంద్ర పనులను ప్రారంభిస్తామని తెలిపారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ వేను ఏర్పాటు చేస్తామన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం ఆధునికంగా కొత్తగా ఆవిర్భవిస్తుందని, రాబోయే రోజుల్లో నియోజకవర్గ రూపురేఖలు మారుతాయన్నారు. శంకర్‌పల్లి వరకు ఎంఎంటీఎస్ రైళ్లను నడిపేందుకు కృషి చేస్తామన్నారు. 83 గ్రామాలకు సంబంధించిన జీవో111ను సవరించేందుకు ప్రజాభిష్టం మేరకు చర్యలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పటిష్టమైన ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు.

రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి

పార్టీలో కొత్తగా చేరిన వారందరినీ ఆదరించాలని, అవసరమైతే మనం ఓ అడుగు వెనక్కితగ్గి వారిని కలుపుకుని పోవాలని కేటీఆర్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని గుర్తుచేశారు. రాష్ట్రంలోని ప్రజలంతా ఒకే ఒక్క నాయకుడి వైపు చూస్తారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో టీఆర్‌ఎస్ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేసి చేవెళ్ల గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని సూచించారు. అంతిమంగా మనందరి లక్ష్యం ప్రజాభివృద్ధి అని, సీఎం కేసీఆర్‌కు అండగా ఉంటూ పార్టీ అభ్యున్నతి కోసం శ్రమించాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు డాక్టర్ రంజిత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...