జానపదం ఝల్లుమన్నది..


Tue,March 19, 2019 01:26 AM

-ముగిసిన జానపద గిరిజన వాద్య సమ్మేళనం
-సంగీత నృత్య మేళవింపుతో మార్మోగిన ఓయూ
-సగానికి పైగా సంగీత వాద్యాలు సమాజానికి దూరంగానే..
-కనుమరుగవుతున్న అరుదైన వాద్యాలు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఆ సంగీత వాద్యాల్లో సగానికి పైగా ప్రస్తుత నాగరిక సమాజానికి అపరిచితమే. అసలు అలాంటి సంగీత పరికరాలున్నాయనే సంగతి చాలా మందికి తెలియదు. జానపద గిరిజనం వాయించే సంగీత పరికరాలనో.. లేదా నాగరిక సమాజానికి దూరంగా ఉండడం వల్లనో.. కారణమేదైనా.. ఆ పరికరాలన్నీ ఇప్పటిదాకా వెలుగులోకి రాలేదు. ఇలాంటి తరుణంలో కనుమరుగవుతున్న జానపద గిరిజన సంగీత వాద్యాలు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఒక్క తాటిపైకి వచ్చాయి. సమాజానికి ఆమడదూరంలో నిలిచిన తమ సంగీత ప్రతిభను బాహ్య ప్రపంచానికి పరిచయం చేసేలా మార్మోగాయి. తెలంగాణ రచయితల వేదిక, గుంజాల గోండి అధ్యయన వేదిక, సంఘటిత వేదిక, ఉస్మానియా యూనివర్సిటీ సహకారంతో నిర్వహిస్తున్న జానపద గిరిజన సంగీత వాద్యాల సమ్మేళనంలో అప్పటి వరకు విసిరేసినట్టుగా పడి ఉన్న జానపద గిరిజన సంగీత వాద్యాలు ఒక్కచోటుకు చేరి ఆత్మీయంగా పలుకరించుకున్నాయి. ఒకదాని తర్వాత మరొకటి మోగుతూ తన్మయత్వంలో మునిగిపోయాయి. ఇంతటి మహాద్భాగ్యాన్ని కల్పించిన వారందరికీ ముగింపు రోజైన సోమవారం తమ కృతజ్ఞతలు తెలుపుకున్నాయి.

వివిధ రకాల సంగీత వాయిద్యాల నేపథ్యం..
ఒగ్గు.. : ఒగ్గును లయప్రధానమైన వాయిద్యంగా చెబుతారు. దీన్ని వాయిస్తూ కథలు చెప్పడం, ప్రదర్శనలివ్వడం చేస్తారు. ప్రదర్శన సందర్భంలో ఒగ్గు కథ చెప్పేవాళ్లు డోళ్లు, గజ్జెలు, తా ళాలు వంటి సంగీత వాద్యాలు ఉన్నా ఒగ్గుకే ప్రాధాన్యత ఉంది. ఒగ్గు కథ చెప్పేవారు కురుమ కులానికి చెందినవారు. వీరిలో రెండు తెగలు ఉంటాయి. ఒకటి పత్తి కంకణం, రెండోది కం కణం తెగకు చెందినవారు. మొదటివారికి మల్లన్న దైవం కాగా, రెండో వారికి బీరన్నను ఆరాధ్య దైవంగా కొలుస్తారు. ఒగ్గు కథను దేశంలోని చాలా చోట్ల జానపద కళారూపాల్లో డమరు/ఒగ్గు వాడతారు. దీన్ని చర్మంతో తయారు చేస్తారు. రెండు వైపులా చర్మంతో కప్పబడి మధ్యలో చేతిలో పట్టుకునేంత సన్నగా ఉంటుంది. ఆ సన్నని మధ్యభాగంలో మోగించడానికి వీలుగా రెండు తాళ్లకు చివర నూలు ఉండచేస్తారు. చేతి తో వాద్యాన్ని తిప్పితే ఆ తాళ్లు చర్మానికి తాకి శబ్దం వస్తుంది. ఒగ్గును సందర్భం, విన్యాసం, క్రీడల ఆధారంగా వాయిస్తుంటారు. ఈ వాద్యాన్ని వినోదం, ఎలుగుబంట్లు ఆడించేటోళ్లు, గంగిరెద్దుల ఆట, దొమ్మరాటలోనూ ఉపయోగిస్తారు.

చప్పట్లతో సంగీతంగా..
చేతులతో చప్పట్లు కొట్టి శబ్దాన్ని పుట్టించడం అందరికీ తెలిసిందే. కానీ ఆ చప్పట్లను ఒక సంగీతంగా, చేతులను సంగీత వాద్యంగా ఉండడం విచిత్రం. సంగీత పరికరాలేవీ లేకుండా.. కేవలం చేతులనే సంగీత పరికరాలుగా చేసి లయకారమైన ధ్వనిని పుట్టించేవే చప్పట్లు. ఆ శబ్దం ఆగిపోతే.. మరో రకం శబ్దం వచ్చేలా చప్పట్లు కొట్టడం ద్వారా కొత్త రకం సంగీతం పుడుతుంది. ఈ చప్పుడులో లయ, తూగు ఉంటుంది. అది సంగీతంగా(రా మ్యూజిక్) మారుతుంది. తెలంగాణలో బతుకమ్మ పాటలన్నీ స్త్రీల చప్పట్లే వాద్యాలుగా మారుమోగుతాయి. బతుకమ్మ, చుట్టు కాముడు ఆటల్లో పాటలు పాడుతూ వలయాకారంగా తిరుగుతూ చప్పట్లతో సంగీతాన్ని సృష్టిస్తారు.

కొండరెడ్ల జీవితంలో సంగీతం సగభాగం..
ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో లక్షకు పైగా కొండరెడ్ల ప్రజలు నివసిస్తున్నారు. సాంస్కృతిక జీవితంలో కొండరెడ్లలోని స్త్రీ, పురుషులిద్దరూ సమాన పాత్రను పోషిస్తారు. ఒకరు వాద్యమైతే.. మరొకరు నృత్యంగా మారుతారు. వారి జీవితంలో సంగీత భరిత నృత్యం సగభాగం అంటే అతిశయోక్తి కాదు. వీరు ప్రధానంగా గిల్ల/ జిల్లగడ గజ్జెలు, వెదురు సంగీత పరికరం, ఔజం పరికరాలతో సంగీతాన్ని సృష్టిస్తారు. కొండరెడ్ల సంగీత వాద్యాల్లో గిల్లకాయలకు ప్రత్యేక స్థానం ఉంది. అటవీ ప్రాంతంలో జిల్ల/గిల్ల అనే తీగజాతి మొక్కలకు కాసే కాయలతో జిల్లగడ గజ్జెలు తయారు చేసి సంగీతాన్ని వినిపిస్తారు. వీరి మరో సంగీతం పరికరం వెదురు.. అడుగున్నర పొడవు ఉన్న వెదురు గొట్టాన్ని సేకరించి.. దానిపై ఒకచోట అంగుళం మందంగా పైపొరని తీసేస్తారు. వెదురు గొట్టం అటు ఇటు గణుపునకు తీగల లాగా రెండు సన్నని బద్దలు(బెరడు వంటివి/చెక్కలు) ఉండేటట్లు కత్తితో చెక్కుతారు. మధ్యలో సుమారు మూడు అంగుళాల రెండు పుల్లలను ఉంచుతారు. వెదురు గొట్టానికి ఓవైపు మూసేసి.. మరోవైపు రంధ్రం చేసి.. వేలితో లయబద్ధంగా వాయిస్తారు. దీన్ని ఎక్కువగా అడవిలో పశువులు కాసేటప్పుడు, మంచెలపై ఈ వాద్యాన్ని మోగిస్తారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...