13 రోజుల వేట...300 సీసీ కెమెరాల విశ్లేషణ


Tue,March 19, 2019 01:23 AM

-ఇద్దరు చైన్‌స్నాచర్స్ అరెస్ట్.. 10 తులాల బంగారం స్వాధీనం
-దొంగిలించిన బంగారాన్ని విక్రయిస్తుండగా పట్టుబడిన నిందితులు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నగరంలో స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరిని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నగరంలో ఫిబ్రవరి 20 నుంచి మార్చి 19వ తేదీల మధ్య ఎస్‌ఆర్‌నగర్, కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో మూడు స్నాచింగ్‌లు చోటు చేసుకున్నాయి. దీంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు 13 రోజుల పాటు దొంగల కోసం ఆరా తీస్తూ, 300 సీసీ కెమెరాలను విశ్లేషించి పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కిక్కరవాడకు చెందిన చాకలి రవి 12 ఏండ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి వివిధ ప్రాంతాల్లో కూలీ పనిచేస్తున్నాడు. 7 నెలల క్రితం నివాసాన్ని బాలానగర్ నుంచి సూరారం ప్రాంతానికి మార్చాడు. అలాగే మెదక్ జిల్లా రెడ్డిపల్లెకు చెందిన చాకలి ఆంజనేయులు సూరారంలోని హెరిటొ డ్రగ్స్ కంపెనీలో ఆఫీస్ భాయ్‌గా ఆరేండ్ల పాటు పనిచేశాడు. ఆరు నెలల క్రితం కొంపల్లికి వచ్చి మెకానిక్ దుకాణంలో పనిచేస్తున్నాడు.

కాగా.. ఈ ఇద్దరి మధ్య ఇటీవల స్నేహం ఏర్పడడంతో... తరచూ బాలానగర్‌లోని కల్లు కాంపౌండ్‌లో కల్లు తాగుతుండేవారు. ఈ క్రమంలోనే సునాయసంగా డబ్బు సంపాదించేందుకు మార్గాలను వెతికారు. ఒంటరిగా వెళ్లే మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులను లాక్కొని పోవాలని నిర్ణయించుకు న్నారు. అందుకు ఎక్కడెక్కడ మహిళలు ఎక్కువగా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తారని ఆరా తీశారు. ఇందుకు బజాజ్ పల్సర్ బైక్‌ను రూ. 8 వేలు వెచ్చించి, బజాజ్ ఫైనాన్స్ తీసుకొని కొనుగోలు చేశారు. మొదట ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకటి, కూకట్ పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు చోట్ల స్నాచింగ్‌కు పాల్పడ్డారు. స్నాచింగ్ ఘటనలు జరగడంతో టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు నేతృత్వంలో వెస్ట్‌జోన్ ఇన్‌స్పెక్టర్ గట్టుమల్లు బృందం 13 రోజులుగా దొంగల కోసం గాలింపు చేపట్టారు. సోమవారం దొంగిలించిన బంగారాన్ని విక్రయించేందుకు ఎస్‌ఆర్‌నగర్ ప్రాంతానికి పల్సర్ బైక్ (టీఎస్08జీజీ 4396)పై వచ్చి టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డారు. వీరి నుంచి 10 తులాల బంగారం, బైక్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్నాచర్లను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహారించిన డీసీపీ, ఇన్‌స్పెక్టర్లతో పాటు టాస్క్‌ఫోర్స్ ఎస్సై మల్లికార్జున్, కానిస్టేబుల్ అధికారులు సి.సందీప్‌సాగర్, జి.వినయ్ యాదవ్, ఎ. సత్యనారాయణ, కె.నయన్‌లను సీపీ అభినందించారు.

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...