మారనున్న తాజ్ బంజారా చెరువు రూపురేఖలు


Mon,March 18, 2019 12:26 AM

-రూ.6.2కోట్ల వ్యయంతో సుందరీకరణ
-నీటి పారుదలశాఖ ఆధ్వర్యంలో ముమ్మరంగా పనులు
-నాలుగు నెలల్లో పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు
బంజారాహిల్స్, నమస్తే తెలంగాణ : చెత్తా చెదారం..మట్టికుప్పలు.. గుబురుగా పెరిగిన పిచ్చిమొక్కలు.. దుర్వాసనలు.. ఇదీ బంజారాహిల్స్ రోడ్ నం.1లోని తాజ్ బంజారా హోటల్‌ను ఆనుకుని ఉన్న అనంతగాని కుంట (బంజారా చెరువు) పరిస్థితి. దీన్ని మార్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 19చెరువులను సుందరీకరించే పనుల్లో భాగంగా బంజారా లేక్‌ను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. నీటి పారుదలశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సుందరీకరణ కోసం రూ.6.2కోట్ల వ్యయంతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. చెరువుకు రెండువైపులా రివెటింగ్ పనులు ప్రారంభించారు. సుమారు 3.65 మీటర్ల వెడల్పుతోపాటు మొత్తం 700 మీటర్ల మేర చెరువుకు రాళ్లతో రివెటింగ్ పనులు చేస్తున్నారు. చెరువులో గత 20ఏండ్లుగా పేరుకుపోయిన పూడికను తొలగించే పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

భారీగా పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలతోపాటు మట్టిని జేసీబీల సాయంతో తొలగిస్తున్నారు. సుమారు 25 నుంచి 35 వేల క్యూబిక్ మీటర్ల పూడిక బంజారా లేక్‌లో ఉండవచ్చని నీటిపారుదలశాఖ అంచనా వేస్తున్నారు. ఈ పూడికను తీసి జవహర్‌నగర్‌లోని డంపింగ్‌యార్డుకు తరలించనున్నారు. చెరువు చుట్టూ మూడేండ్ల క్రితమే వాకింగ్ ట్రాక్ పనులు చేపట్టిన అధికారులు అర్థాంతరంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా నీటి పారుదలశాఖ అధికారులు చెరువు సుందరీకరణ పనుల్లో భాగంగా పాడైపోయిన వాకింగ్ ట్రాక్‌ను కూడా పునరుద్ధరించనున్నారు. చెరువు చుట్టూ వాకింగ్ చేసేందుకు వీలుగా ట్రాక్‌తోపాటు పచ్చదనాన్ని పెంపొందిస్తారు. దీంతోపాటు పిల్లలు ఆడుకునేందుకు ప్లే జోన్లను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. రానున్న నాలుగు నెలల్లో పనులు మొత్తం పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. దశలవారీగా చెరువులోని నీటిని తొలగించి కింద ఉన్న పూడికను తీయాలని నీటిపారుదలశాఖ అధికారులు యోచిస్తున్నారు. చెరువులోని ఖాళీ స్థలాల్లో అసాంఘికశక్తులు రాకుండా పటిష్టమైన ఫెన్సింగ్‌ను వేయడంతో పాటు రోడ్ నం.1లోని శివాలయం వైపున మెయిన్ గేటును ఏర్పాటు చేయనున్నారు.

డ్రైనేజీ నీరు కలువకుండా చర్యలు..
తాజ్ బంజారా చెరువులోకి కేవలం వర్షపునీరు మాత్రమే వచ్చేలా చర్యలు తీసుకోవాలని నీటి పారుదలశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అంబేద్కర్‌నగర్ ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదనీటి కాలువలో వందలాది డ్రైనేజీలైన్లు కలుస్తుండడంతో చెరువులోకి కాలుష్యం చేరుతుంది. పలు భవనాలకు చెందిన డ్రైనేజీ లైన్లను నేరుగా చెరువులోకి వదులుతున్నారు. ఇలా వదిలితే చర్యలు తప్పవని ఇప్పటికే జలమండలి అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో పాటు నీటి పారుదలశాఖ అధికారులు కూడా ఆయా ప్రాంతాలకు చెందిన ఇండ్ల యజమానులను కలిసి చెరువులోకి నేరుగా డ్రైనేజీ లైన్లను కలుపకుండా చూడాలని కోరుతున్నారు. అయినా పద్ధతి మార్చుకోకపోతే చట్టపరమైన చర్యలకు కూడా ఉపక్రమిస్తున్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...