మృత్యుంజయి..


Thu,February 21, 2019 02:45 AM

-దవాఖాన నుంచి మధులిక డిశ్చార్జి
-బతుకదనుకున్నాం..డాక్టర్లే మా పాలిట దేవుళ్లయ్యారు
-మా కూతురి కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు
-మధులిక తండ్రి రాములు
ఒంటినిండా 15 కత్తి పోట్లు. రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉన్న శరీరం. ఏదో ఒక అద్భుతం జరగాలి. గాయాలు మానాలి. మధులిక మళ్లీ కళ్లు తెరవాలి. తిరిగి నడిచి రావాలి. ఇదే.. అందరూ బలంగా కోరుకున్నారు. ఆ ప్రార్థనలన్నీ ఆమెకు దీవెనలై ఫలించాయి. కత్తివేట్లను తుంచుకొని మధులిక మృత్యువును ఎదిరించి జయించి విజేతగా నిలిచింది. 15 రోజుల పాటు చావుతో నిరంతర పోరాటం చేసిన ఆమె బుధవారం దవాఖాన నుంచి ఇంటికి చేరుకున్నది.
-మలక్‌పేట

మలక్‌పేట, ఫిబ్రవరి 20: ఈ నెల 6న బర్కత్‌పురాలో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో మలక్‌పేటలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని మధులిక ఆరోగ్యం పూర్తిగా మెరుగవటంతో వైద్యులు బుధవారం డిశ్చార్జి చేశారు. శస్త్రచికిత్సలు చేసిన వైద్యుల బృంధంతో కలిసి సీఓఓ విజయ్‌కుమార్ మాట్లాడుతూ తీవ్ర గాయాలతో తీవ్ర రక్తస్రావం జరిగి అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరిన మధులికకు ఐదుగురు వైద్యుల బృంధం ఏడు గంటలపాటు శ్రమించి శస్త్ర చికిత్సలు చేశారని తెలిపారు. చేతివేళ్లకు చికిత్సలు చేసి సరిచేశామని చెప్పారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికపుడూ గమనించేందుకు వైద్యుల బృందంతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్‌చేసి, అనుక్షణం కంటికి రెప్పలా కాపాడినట్లు వివరించారు.

న్యూరోసర్జన్ శ్రీనివాస్, ప్లాస్టిక్ సర్జన్ చంద్రమౌళి, స్పైన్ సర్జన్ వెంకట రామకృష్ణ, నరేశ్‌లు సర్జరీలు చేసిన తర్వాత మధులిక ఆరోగ్యం పరిస్థితి రోజు రోజుకు మెరుగుపెడిందని తెలిపారు. ఆ తర్వాత 48 గంటల పరిశీలనలో ఉంచి ఇన్‌ఫెక్షన్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. గాయాలన్నీ మానిపోయేలా, మధులిక ఆరోగ్య మెరుగుపడేలా వైద్యుల బృంధం 24 గంటలు ఎంతో సేవలు అందించారని ప్రశంసించారు. శస్రచికిత్సలు చేసిన భాగాల్లో కుట్లను కూడా తొలగించామని, ఇప్పుడు మధులిక ఆరోగ్యం పూర్తిస్థాయిలో మెరుగుపడిందని తెలిపారు. ప్రస్తుతం ఆమె 37 కిలోల బరువుందని చెప్పారు. డిశ్చార్జ్‌కు ముందు వైద్యుల బృంధం అన్ని విధాల పరీక్షలు నిర్వహించిన తర్వాతే డిశ్చార్జ్ చేశామన్నారు. మధులిక డైట్‌కు సంబంధించి న్య్రూటీషన్ సలహాలు ఇచ్చారని, శనివారం మళ్లీ తీసుకరమ్మని చెప్పినట్లు తెలిపారు. ఎప్పుడు ఎలాంటి సమస్య తలెత్తిన వెంటనే సమాచారం అందించాలని వైద్యులు సూచించారు.

నా బిడ్డ బతుకదనుకున్న..వైద్యులే దేవుళ్లలా రక్షించారు..
అసలు బతుకదు అనుకున్న నా బిడ్డను వైద్యులు దేవుళ్లలాగా కాపాడారని, దేవుల్లే డాక్టర్ల రూపంలో వచ్చి కాపాడినట్లు అనిపిస్తుందని మధులిక తండ్రి రాములు దగ్దద స్వరంతో అన్నారు. తన బిడ్డ ఆరోగ్యం మెరుగుపడిందని, తన బిడ్డ కోలుకోవాలని ప్రార్థించిన ప్రతీ ఒక్కరికి పేరు పేరున రెండు రాష్ర్టాల ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. తమకు అన్నివిధాల అండగా నిలిచిన మీడియాకు, ఎంతో మెరుగైన వైద్యం అందించిన యశోద వైద్యులకు, నా బిడ్డ కోలుకునేందుకు ఆర్థిక సహాయాన్ని అందించిన ప్రభుత్వానికి, సహకరించిన పోలీస్‌సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. గరిగంటి రమేశ్, కాలేరు వెంకటేశ్, శ్రీనివాస్‌రెడ్డిలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారని వారికి కూడ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపున్నామన్నారు. ఇప్పటివరకు వైద్యఖర్చులకు మొత్తం రూ.13 లక్షల బిల్లు అయిందని, ప్రభుత్వం రూ.5లక్షల ఆర్థిక సహాయాన్ని అందించిందని, మరో ఎనిమిది లక్షలు ఆసుపత్రికి చెల్లించాల్సి ఉందన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...