పరీక్షలంటే భయంవద్దు


Thu,February 21, 2019 02:40 AM

-టెన్త్ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నమేడ్చల్ జిల్లా ప్రభుత్వోపాధ్యాయులు
-ఒత్తిడిని జయిస్తేనే.. పదిలమైన ఫలితాలు
-ఎన్జీవోల సహకారంతో.. సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మేడ్చల్ జిల్లా విద్యాశాఖ అధికారులు
-10 వార్షిక పరీక్షలకు విద్యార్థులను మానసికంగా సన్నద్ధం చేస్తున్న వైనం
-జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో..మానసిక నిపుణులచే ప్రత్యేక తరగతులు
ఒత్తిడిని జయించి విద్యార్థులందరూ 100శాతం ఉత్తీర్ణతను సాధించాలనే ఉద్దేశంతో ప్రత్యేక తరగతులకు శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారిణి ఐ.విజయకుమారి జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్త్తున్న 10వ తరగతి విద్యార్థులకు మానసిక నిపుణులచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మేడ్చల్ జిల్లాలో 106 (ఇందులో 4 ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలున్నాయి.) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులలో వార్షిక పరీక్షలు అనే భయం లేకుండ ఎన్జీవోల (అగస్థ్య ఫౌండేషన్, శ్రియాట్రస్టు, సహజ యోగా మెడిటేషన్, అరిందం రిటైర్డ్ టీచర్) సహకారంతో విద్యార్థులను మానసికంగా సిద్ధం చేస్తున్నారు. అలాగే విద్యార్థులందరికీ మెడిటేషన్‌పై సాధన చేయిస్తున్నారు. 2018-19 విద్యా సంవత్సరం పది వార్షిక పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకూ జరుగనున్నాయి. జిల్లాలో సబ్జెక్టుల వారీగా సిలబస్‌ను పూర్తి చేయడంతో పాటు రివిజన్ చేయిస్తున్న అధ్యాపకులు రోజులో ఒక పాఠశాల చొప్పున మానసిక నిపుణులచే వార్షిక పరీక్షలనే భయం, ఒత్తిడి ధరిచేరకుండా తీసుకోవాల్సిన అంశాలను విద్యార్థులకు బోధిస్తున్నారు.

ప్రణాళిక ఉంటే సులభమే
ఇందులో ప్రధానంగా తరగతిలో ఉపాధ్యాయులు నిర్వహించిన పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని చాలా మంది విద్యార్థులు బాధపడుతుంటారు. ఇలాంటి వారు వెంటనే సబ్జెక్టుల వారీగా ఓ ప్రణాళిక రూపొందించుకొని నిరంతర సాధన చేస్తే పదిలో 10 పాయింట్లను సులభంగా సాధించవచ్చని మానసిక నిపుణులు విద్యార్థులకు సూచిస్తున్నారు.

నిద్రకు దూరం.. చదువుపై ఏకాగ్రత
విద్యార్థులు ఇష్టారీతిలో కాకుండ తక్కువ ఆహారం తీసుకున్నా.. ఎక్కువ పోషక విలువలున్న ఆహారం, చదువుతున్నంత సేపు రెండుమూడు గ్లాసుల నీరు తీసుకుంటే నిద్రను దూరం చేసుకోవడంతో చదువపై ఏకాగ్రత పెరుగుతుందని వారు పేర్కొంటున్నారు.

25నుంచి జిల్లాకు ప్రశ్నపత్రాలు
2018-19 విద్యా సంవత్సరం వార్షిక పరీక్షల్లో భాగంగా 10వ తరగతి ప్రశ్నపత్రాలు 25వ తేదీ నుంచి జిల్లాకు వస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారిణి నమస్తే తెలంగాణతో తెలిపారు. మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని, 25వ తేదీ నుంచి జిల్లాకు నాలుగు విడుతలుగా ప్రశ్నపత్రాలు వస్తాయన్నారు. వచ్చిన ప్రశ్నపత్రాలను బాలానగర్‌లోని ఎన్‌ఎస్‌కేకే స్కూల్‌లోని స్ట్రాంగ్‌రూంలో భద్రపరుస్తామని తెలిపారు. అలాగే పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా షురూ అయ్యాయని, ఇప్పటికే చీఫ్ సూపరింటెండెంట్‌లుగా డిపార్ట్‌మెంట్స్ అధికారులను నియమించుకున్నామని, త్వరలోనే సెంటర్ల వారీగా ఏర్పాట్లు షురూ చేస్తామని తెలిపారు.

మానసికంగా సన్నద్ధం చేయాలి
సాధారణంగా 10 పరీక్షలు అనగానే విద్యార్థుల్లో ఓ భయం ఉంటుంది. ఆ భయంతో చదివినది కూడా విద్యార్థులు మర్చిపోతారు. ఇలా జరుగడం వల్లనే కొంత మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోతున్నారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పటికే జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈ రకమైన తరగతులను నిర్వహించాం. ఈ దఫా 10 ఫలితాల్లో మేడ్చల్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంటుందనే నమ్మకం ఉంది. అలాగే విద్యార్థులకు రివిజన్ సమయంలో సాయంత్రం సమయంలో స్నాక్స్‌ను అందించేందుకు రూ.15లక్షల వరకు ఫండ్ అందించాం.
- డా.ఎంవీ రెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్.

పూర్తిస్థాయిలో తర్ఫీదునిస్తున్నాం
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా పూర్తి స్థాయిలో సిలబస్‌ను పూర్తి చేయడంతో పాటు రివిజన్‌ను కూడా చేయిస్తున్నాం. దీనికి తోడు కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్జీవోల సహకారంతో 10వ తరగతి విద్యార్థులకు మానసిక నిపుణులచే తరగతులు నిర్వహించడంతో పాటు మెడిటేషన్ చేయిస్తున్నాం. దీంతో ఒత్తిడి తగ్గడంతో పాటు విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.
- ఐ.విజయకుమారి, జిల్లా విద్యాశాఖ అధికారిణి.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...