అగ్నిమాపక ఏర్పాట్లపై భవనాల్లో తనిఖీలు


Thu,February 21, 2019 02:40 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాదాలు మన నగరంలో జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ తెలిపారు. ఇందులో భాగంగా అగ్నిమాపక చర్యలపై స్కూళ్లు, రెస్టారెంట్లు, మాల్స్, సినిమా థియేటర్లు, దవాఖానలు, ఫంక్షన్‌హాళ్లు తదితర అన్ని వాణిజ్య భవనాలను తనిఖీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. ప్రమాదకర భవనాలకు వెంటనే నోటీసులు జారీ చేసి వాటిని సరి చేసుకునే విధంగా తగు చర్యలు తీసుకుంటామన్నారు.

వాణిజ్య భవనాల్లో అగ్నిమాపక చర్యలు, ఆస్తుపన్ను వసూళ్లు, పారిశుధ్యం తదితర అంశాలపై బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నగరంలో సుమారు ఏడువేల వాణిజ్య భవనాలను తనిఖీ చేయనున్నట్లు చెప్పారు. వారంరోజుల్లో తనిఖీలు పూర్తి చేస్తామన్నారు. ఈ సందర్భంగా సెల్ఫ్ ఆడిట్ ప్రొఫార్మా ఆయా భవనాల యజమానులకు అందజేస్తామన్నారు. అందులో అగ్నిమాపక చర్యల వివరాలు, సెట్‌బ్యాక్స్ వివరాలు నమోదు చేసి తమ సిబ్బందికి ఇస్తే వాటి ఆధారంగా ఏఏ భవనాలకు ఎటువంటి అగ్నిమాపక చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామన్నారు. వారం రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. అంతేకాకుండా ప్రమాదకర భవనాలకు వెంటనే నోటీసులు జారీ చేయడంతోపాటు అగ్నిప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు, స్కూళ్లలో మాక్‌డ్రిల్స్ చేపడుతామని చెప్పారు.

అపరాధ రుసుము మాఫీ ఉండదు
గతంలో మాదిరిగా ఆస్తిపన్ను బకాయిలపై అపరాధ రుసుము మాఫీ చేయడం ఈసారి ఉండదని కమిషనర్ స్పష్టం చేశారు. అందుకే వెంటనే పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి దోహదపడాలని ఆయన కోరారు. పన్ను వివాదాల పరిష్కారానికి ఆస్తిపన్ను పేరుతో ప్రతి ఆదివారం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.

247 బస్తీ దవాఖానలు లక్ష్యం
నగరంలో 247 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు, వీటికోసం ప్రభుత్వ భవనాల అన్వేషణ సాగిస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. ప్రస్తుతం 35 దవాఖానలు విజయవంతంగా కొనసాగుతున్నాయని, మరో 64 ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పారిశుధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు, మార్కెట్లు, వాణిజ్య ప్రాంతాల్లో డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి సర్కిల్‌లో ఒక వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...