మారని మ్యాన్యువల్!


Thu,February 21, 2019 02:39 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జనన, మరణ వివరాలు ఆయా దవాఖానల నుంచి ఆన్‌లైన్‌లో నేరుగా జీహెచ్‌ఎంసీకి చేరాలనే సంకల్పంతో దాదాపు ఆరేండ్ల క్రితం చేపట్టిన ఆన్‌లైన్ విధానం ఇంత వరకూ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. నాలుగైదు పెద్దాసుపత్రులు మినహా ఏ దవాఖాన నుంచీ ఆన్‌లైన్ వివరాలు రావడం లేదు. ఫలితంగా జనన, మరణ ధ్రువపత్రాల విభాగంలో పారదర్శకతను పెంపొందించాలనే లక్ష్యం నెరవేరడం లేదు. గతంలో జనన, మరణ వివరాలు వార్డు కార్యాలయాల్లో నమోదు చేసుకుంటే వార్డు కార్యాలయ సిబ్బంది ఆ వివరాలను మ్యాన్యువల్ పద్ధతిలో ప్రధాన కార్యాలయానికి చేరవేసి రికార్డుల్లో నమోదు చేసేవారు. అంతేకాదు, వార్డు కార్యాలయాల నుంచి వచ్చే వివరాలు సైతం కేవలం సంఖ్యల్లో మాత్రమే వస్తున్నాయి తప్ప పేర్లు, ఇతర వివరాలతో రావడంలేదు. దీనివల్ల నకిలీ ధ్రువపత్రాలు సృష్టించేందుకు ఆస్కారముండేది.

ఈ పరిస్థితిని నివారించి పారదర్శకతను తెచ్చేందుకు గతంలో కృష్ణబాబు కమిషనర్‌గా ఉన్న సమయంలో ఆన్‌లైన్ విధానాన్ని చేపట్టారు. ముందుగా, గాంధీ, ఉస్మానియా, పేట్లబుర్జు వంటి ప్రధాన ప్రభుత్వ దవాఖానలతోపాటు ముఖ్యమైన కార్పొరేట్ దవాఖానల నుంచి వివరాలు ఆన్‌లైన్‌లో తెప్పించే ఏర్పాట్లు చేశారు. అంతేకాదు, ఆన్‌లైన్‌లో వివరాలు రాగానే వెంటనే ధ్రువపత్రం కూడా సిద్ధం చేసి ప్రసవం జరిగిన 24 గంటల్లోనే జనన ధ్రువపత్రం సిద్ధం చేసి తపాలా ద్వారా ఇంటికి పంపాలని నిర్ణయించారు. ముందుగా పేరు లేకుండా తల్లిదండ్రుల పేర్లు, జననం జరిగిన తేదీ, సమయం వివరాలతో ధ్రువపత్రం రూపొందిస్తే, అనంతరం పాపకు పేరు పెట్టిన తరువాత తల్లిదండ్రులు మళ్లీ కార్యాలయాన్ని సంప్రదించి పేరు నమోదు చేసుకొని పేరుతో కూడిన ధ్రువపత్రం తీసుకోవచ్చని నిశ్చయించారు. కొద్దిరోజుల్లోనే అన్ని దవాఖానలకూ ఈ సేవలు విస్తరించాలని నిర్ణయించారు.

అయితే ఇది జరిగి ఆరేండ్లు గడిచినా ఇంత వరకూ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోకపోవడమే కాకుండా గతంలో ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దవాఖానల నుంచి సైతం ఇప్పుడు వివరాలు రావడంలేదు. యథా ప్రకారం మ్యాన్యువల్ పద్ధతిలోనే రోజు వార్డు కార్యాలయాల నుంచి ఇంతమంది జన్మించారనే సమాచారం ఇస్తున్నారు. అందులో వివరాలేవీ ఉండడం లేదు. అంటే, ఇలా వివరాలు లేకుండా పంపడం వల్ల వార్డు కార్యాలయంలో ఎప్పుడైనా, ఎవరైనా నగరంలో పుట్టినా, పుట్టకపోయినా తమకు నచ్చిన తేదీల్లో పేరును నమోదు చేసుకొని జనన ధ్రువపత్రం పొందే ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో జరుగుతున్నది ఇదే. గతంలో అనేకసార్లు నకిలీ ధ్రువపత్రాల బాగోతం వెలుగుచూసినా, జననాల నమోదులో అక్రమాలు చోటుచేసుకున్నా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ-ఆఫీసు పేరుతో మ్యాన్యువల్ పద్ధతికి స్వస్తి పలికి కార్యాలయాలను పేపర్‌లెస్ కార్యాలయాలుగా మార్చినా జనన, మరణాల విభాగంలో మాత్రం ఇంకా పురాతన పద్ధతే అమలవుతున్నది. నగరంలోని వివిధ సర్కిళ్లలో రోజుకు 1200 నుంచి 1500 జననాలు నమోదవుతున్నా పారదర్శకత లేకపోవడం వల్ల ధ్రువపత్రాల జారీలో అక్రమాలకు ఆస్కారం కలుగుతున్నది.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...