నగరమంతా ఫైర్ సేఫ్టీ


Fri,February 15, 2019 01:16 AM

- వాణిజ్య భవనాల్లో తనిఖీలు చేయండి
- జీహెచ్‌ఎంసీకి ప్రభుత్వ ఆదేశం
- ప్రత్యేక బృందాల ఏర్పాటు
- నెలరోజుల్లో సమగ్ర నివేదిక
సిటీబ్యూరో: ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం ఘటనలు నగరంలో జరుగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంకల్పించింది. వాణిజ్య భవనాల్లో ఫైర్‌సేఫ్టీ నిబంధనల అమలు తీరుపై తనిఖీలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ బల్దియా కమిషనర్ దానకిశోర్‌కు ఆదేశించారు.

నెలరోజుల్లోగా..
ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసిన ఆయన, నెలరోజుల్లోగా తనిఖీలు పూర్తి చేసి సమగ్ర నివేదికను రూపొందించాలని కోరారు. ఇటీవల తాను నగరంలో నిర్వహించిన విస్తృత తనిఖీల సందర్భంగా రెస్టారెంట్లు, హోటళ్లు, హాస్పిటల్స్, హాస్టళ్లు, స్కూళ్లు, ఫంక్షన్‌హాళ్లు తదితర వాణిజ్య భవనాల్లో ఫైర్‌సేఫ్టీ నిబంధనల అమలు సక్రమంగా లేదని గుర్తించినట్లు అర్వింద్‌కుమార్ పేర్కొన్నారు. వెంటనే రద్దీ ప్రాంతాలతోపాటు ముఖ్యమైన, ప్రమాదకరంగా ఉన్న ఆయా వాణిజ్య భవనాల్లో వెంటనే తనిఖీలు నిర్వహించి పరిస్థితులను విశ్లేషించాలని పేర్కొన్నారు. అలాగే, ప్రమాదాలను నివారించడంతోపాటు ప్రమాదం జరిగినప్పుడు నష్టం జరుగకుండా పాటించాల్సిన అగ్నిమాపక చర్యలు, అవసరమైన సామగ్రి, మ్యాన్‌పవర్‌ను నిర్థారించాలని సూచించారు. రెస్టారెంట్లు, హోటళ్లు, హాస్టళ్లు, స్కూళ్లు, వైద్యశాలలు, బ్యాంకెట్ హాల్స్ తదితర వాటిల్లో వెంటనే ఫైర్‌సేఫ్టీ స్థితిగతులను పరిశీలించేందుకు తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రమాదాలు జరుగకుండా తగిన ఫైర్‌సేఫ్టీ వ్యవస్థ ఉందా? ఉంటే దాని నిర్వహణ ఎలా ఉంది? ప్రమాదాలు సంభవించినట్లు సహాయక చర్యలకు అవకాశం ఉందా, ప్రమాదం సంభవిస్తే వెంటనే బయటకు వెళ్లేందుకు తగినంత దారి ఉందా తదితర అంశాలను తనిఖీల సందర్భంగా పరిశీలించాలని కోరారు. ప్రమాదకర భవనాలకు నోటీసులు జారీ చేయాలని కోరారు. ఎక్కడా ప్రమాదం జరుగకుండా ఆయా గుర్తించిన భవనాలకు అగ్నిమాపక వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.

పరీక్షా కేంద్రాలకూ.. జియో ట్యాగింగ్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలానికి చెందిన ఓ విద్యార్థి నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లోని డిగ్రీ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల నిర్వహించిన సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి కాచిగూడ అడ్రస్ పేరుతో ఉన్న ఓ ప్రైవేటు డిగ్రీ కాలేజీలో సెంటర్ పడింది. సదరు విద్యార్థి పరీక్షకు హాజరయ్యేందుకు సెంటర్‌కు వెళ్లగా, అక్కడ అసలు డిగ్రీ కాలేజీనే లేదు. దీంతో ఖంగుతిన్న ఆ విద్యార్థి అతను చదివే కాలేజీ అధ్యాపకులకు ఫోన్ చేసి కనుక్కోగా, మేడ్చల్‌లో సెంటర్ నిర్వహిస్తున్నట్లు తేలింది. దీంతో ఆ విద్యార్థి వెంటనే ప్రైవేటుగా క్యాబ్ బుక్ చేసుకొని మేడ్చల్‌లోని పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. అప్పటికే పరీక్ష మొదలైంది. అధికారులు ఆలస్యమైనా పరీక్షకు అనుమతించడంతో విద్యార్థి ఊపిరిపీల్చుకున్నాడు. కానీ దాదాపు గంట పాటు అతను పడిన మనోవేదన అంతాఇంతా కాదు. దీంతో పరీక్షను మంచిగా రాయలేకపోయాడు. పరీక్ష కోసం రోజుల తరబడి కష్టపడి చదివినదంతా వృథాగా మారింది. ఇలా నగరంలోని అనేక ప్రైవేటు డిగ్రీ కాలేజీలు పేరుకు ఒకచోట నిర్వహిస్తున్నట్లు కాగితాల్లో చూపించి.. క్షేత్రస్థాయిలో మాత్రం మరోచోట చూపిస్తున్నాయి. ఇలాంటి ప్రైవేటు కాలేజీల ఆటలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధికారులు, ఆయా యూనివర్సిటీల రిజిస్ట్రార్లు పక్కా ప్రణాళిక రూపొందించారు. ఆయా యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీలను జియో ట్యాగింగ్ చేయాలని నిర్ణయించారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్నీ డిగ్రీ పరీక్షా కేంద్రాలను ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. వీటిని హాల్ టికెట్లకు అనుసంధానం చేస్తున్నారు. ఈ టెక్నాలజీ వల్ల పరీక్షలప్పుడు సమయం మిగలడంతో పాటు ఇటు విద్యార్థులకు.. అటు వర్సిటీల అధికారులకు ఇబ్బందులు తప్పనున్నాయి.

ఓయూ పరిధిలో ఇలా..
ఓయూకి అనుబంధంగా 434 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో 200 కాలేజీల్లో పరీక్షా కేంద్రాలుగా నిర్ణయిస్తారు. కాలేజీల్లో విద్యా ప్రమాణాలతో పాటు జియో ట్యాగింగ్ చేసిన ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు మాత్రమే ప్రవేశాలకు అనుమతినివ్వనున్నారు. జియో ట్యాగింగ్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు కూడా ప్రకటించాయి. దీంతో కాలేజీ యాజమాన్యాలు క్యాంపస్‌లను వేరే చోటుకి మార్చే అవకాశం ఉండదు.

దూర విద్య సెంటర్లలోనూ..
కొన్ని ప్రైవేటు డిగ్రీ కాలేజీలు.. ఇతర యూనివర్సిటీలకు సంబంధించి దూరవిద్య కోర్సులు నిర్వహిస్తున్నాయి. వీటిలో పరీక్షల సమయంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇలాంటి కాలేజీల గుర్తింపు రద్దు చేసే ఆలోచన కూడా చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కాలేజీలను జియో ట్యాగింగ్ చేయడం వల్ల విద్యార్థులతో పాటు వర్సిటీ అధికారులకు ఉపయోగకరంగా ఉంటుంది. కాలేజీలను తనిఖీలు చేసే సమయంలో సరైన అడ్రస్‌లు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు.

సెంటర్ వెతుకోవాల్సిన పనిలేదు..
పరీక్షా కేంద్రాలను జియో ట్యాగింగ్ చేయడం వల్ల పరీక్షల సమయంలో టెన్షన్ పడాల్సిన పన్లేదు. గతంలో పరీక్షలకు ప్రిపేర్ కావడం ఎంత ముఖ్యమో.. అంతే స్థాయిలో పరీక్షా కేంద్రాలను వెతుక్కోవాల్సి వచ్చేది. దీంతో చాలా సమయం మిగలడంతో పాటు మానసికంగా వేదనకు గురికావాల్సిన అవసరం ఉండదు. ఈ విధానం వల్ల ఎంతో మంది విద్యార్థులకు టెన్షన్ తీరిపోయినట్టే.
- హజియా, డిగ్రీ విద్యార్థిని

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...