మీ ఉద్యోగి తాగి నడిపిండు


Wed,January 23, 2019 12:53 AM

-ఇకపై ఇలా చేయొద్దని చెప్పండి
-ప్రమాదాలు జరగకుండా సహకరించండి
-కంపెనీ యాజమాన్యాలకు సైబరాబాద్ పోలీసుల లేఖలు
ట్రాఫిక్ ఉల్లంఘనలపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకూ చలాన్ విధించి వదిలేయడంతో పదేపదే చేసిన తప్పునే మళ్లీ చేస్తూ పట్టుబడుతున్నారు. వీరి నిర్లక్ష్యంపై నేరుగా పనిచేస్తున్న సంస్థకే ట్రాఫిక్ పోలీసుల నుంచి లేఖలు అందనున్నాయి. ఎంత మొత్తంలో మద్యం సేవించారు.. ఏ విధంగా వాహనం నడుపుతున్నారు.. ట్రాఫిక్ నిబంధనలను ఎలా ఉల్లంఘిస్తున్నారనే విషయాలను లేఖలో వివరిస్తూ.. క్రమశిక్షణ లేని ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని అవసరమైతే ఉద్యోగం నుంచి తొలగించాలని లేఖ ద్వారా కోరుతున్నారు. ఇప్పటివరకూ చేసిన తప్పులను చలాన్ కప్పిపుచ్చుకున్న ఉద్యోగుల బండారం ఈ లేఖాస్ర్తాల ద్వారా బట్టబయలు కావడమే కాకుండా జీవితాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడుపాలని ‘సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు’ కోరుతున్నారు.
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ట్రాఫిక్ ఉల్లంఘనలలో అత్యంత ప్రమాదకరమైనదిగా డ్రంకన్ డ్రైవింగ్ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డ్రంకన్ డ్రైవ్ పట్టుబడే వారి వివరాలను వారు పనిచేస్తున్న సంస్థలు, డిపార్ట్ ఇతర విభాగాల ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నారు. దీని కోసం ఓ ప్రత్యేక లేఖ రాసి డ్రంకన్ డ్రైవ్ పట్టుబడిన వ్యక్తికి ఎలాంటి శిక్ష పడింది, అతను నిబంధనలకు విరుద్ధంగా ఎంత ఎక్కువగా మద్యం సేవించాడు. ఎంత ప్రమాదకరమైన స్థితిలో రోడ్డుపై వాహనాన్ని నడిపిస్తున్నాడనే విషయాలను ట్రాఫిక్ పోలీసులు రాస్తున్న లేఖలో పేర్కొంటున్నారు. ఈ లేఖలను అందుకున్న యాజమాన్యాలు, అధికారులు తమ ఉద్యోగుల్లో మార్పు తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఉల్లంఘనలు తరచూ జరిగితే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బాధ్యతగా ఉండాల్సిన ఉద్యోగి నిబంధనలను పాటించకపోతే పనిచేసే చోట క్రమశిక్షణతో ఎలా ఉండగలడని కంపెనీలు, ఇతర విభాగాల ఉన్నతాధికారులు ఆలోచించుకోవాలని లేఖ ద్వారా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఈ లేఖలను స్వయంగా సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ పర్యవేక్షణలో రాస్తుండడంతో ఆ లేఖలు తప్పనిసరిగా సంబంధిత శాఖలు, కంపెనీలకు చేరుతున్నాయి. ఇటీవల మాదాపూర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలోని పర్వతానగర్ జరిగిన డ్రంకన్ ఓ సాఫ్ట్ కంపెనీకి చెందిన ఉద్యోగి పట్టుబడ్డాడు. అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి కోర్టులో హాజరుపర్చగా 4 రోజుల జైలు శిక్ష పడింది. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రాసిన లేఖ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ మారింది. అతని ఉల్లంఘన గురించి పనిచేసే సంస్థకు తెలియాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రాసిన లేఖ సారాంశం ఇలా ఉంది...

ట్రాఫిక్ ఉల్లంఘన చట్ట వ్యతిరేక చర్యే...

చాలా మంది ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసి జైలుకు వెళ్లొచ్చినా.. అది చిన్న విషయంగానే పరిగణిస్తున్నారు. కాని నేరం రుజువై జైలు శిక్ష పడిందని ఎవరూ గుర్తించడం లేదు. చట్ట వ్యతిరేక పనులు చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సిందే. కాబట్టి ట్రాఫిక్ ఉల్లంఘనలు కూడా చట్టవ్యతిరేకమే. వాటికి పాల్పడినప్పుడు శిక్షలు అనుభవించాల్సిందే అంటున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. చాలా మంది ఉల్లంఘనకు పాల్పడి జైలు శిక్ష అనుభవించినా ఆ వివరాలను గోప్యంగా పెడుతూ తమ నేరాలను దాస్తున్నారని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు చేస్తూ చట్టవ్యతిరేక పనులకు పాల్పడుతున్న వారి వివరాలు ప్రతి ఒక్కరికీ తెలియాలనే లక్ష్యంగా అధికారులు లేఖలను అస్త్రాలుగా సంధిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ ఉల్లంఘనులపై ఆయా సంస్థల అధికారులు కొంత సీరియస్ స్పందించాలని ట్రాఫిక్ పోలీసులు ఆశిస్తున్నారు. మరో వైపు మనమే విదేశాల్లో ట్రాఫిక్ రూల్స్ ఎంత కఠినంగా ఉంటాయో మాట్లాడుకుంటాం. అమెరికాలో ఇండికేటర్ సరిగా లేకపోయినా, సీటు బెల్టు లేకపోయినా భారీ చలాన్ విధిస్తారని చెప్పుకుంటాం. అక్కడి పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనలపై చాలా కఠినంగా ఉంటారని పోగడుతాం. కాని అలా మాట్లాడే వారు మన దగ్గర ట్రాఫిక్ ఉల్లంఘనను చాలా చిన్నదిగా చూస్తారు. చలాన్ కట్టేస్తే సరిపోతుందని భావిస్తారు. కాని చట్టపరంగా ట్రాఫిక్ ఉల్లంఘన కూడా చట్టవ్యతిరేక చర్యేనని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

మాకు థ్యాంక్స్ చెప్పుతున్నారు

మా లేఖలకు చాలా మంది కార్పోరేట్ సంస్థలు, స్కూల్ యాజమాన్యాలు, పలు శాఖల ఉన్నతాధికారులు ధన్యవాదాలు చెప్పుతున్నారు. కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు. విదేశాల్లో ఉండే శిక్షల గురించి శభాష్ అంటాం. కాని మన దగ్గర ట్రాఫిక్ రూల్స్ పాటించడానికి చాలా మంది చట్టవ్యతిరేకంగా వాహనాలను నడుపుతారు. డ్రంకన్ డ్రైవ్ పట్టుబడే వారి వివరాలు వారికి పడ్డ జైలు శిక్ష వివరాలను వారి సంస్థలకు పంపిస్తాం. అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే రోడ్డు ప్రమాదాల్లో మరణాలు ఉండవని ఆలోచించాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే జైలు శిక్ష తప్పదని ఇటీవల న్యాయస్థానాలు వెల్లడిస్తున్న తీర్పులే నిదర్శనం.

టూ. హెచ్ మేనేజర్ గారికి..


-విషయం :- మీ ఉద్యోగి ట్రాఫిక్ ఉల్లంఘనలపై సమాచారం.
మీకు తెలియచేయనున్నది ఏమనగా మీ సంస్థలో పనిచేసే పరమేశ్ ఐడీ నంబరు.---తో కలిగి మద్యం సేవించి నవంబరు 23వ తేదీన మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు పర్వతానగర్ నిర్వహించిన డ్రంకన్ పట్టుబడ్డాడు. అతన్ని నవంబర్ 28వ తేదీన సైబరాబాద్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ పంపి కౌన్సెలింగ్ ఇప్పించాం. అదే రోజు కోర్టులో హాజరుపర్చగా అతనికి 28వ తేదీ నుంచి డిసెంబరు 1 వరకు జైలు శిక్షను విధించింది.
మీ అవగాహన కోసం వాహనాలను నడిపే వాహనదారుడిలో చట్టబద్ధంగా మద్యం పరిమితి 100 మిల్లీలీటర్ల రక్తంలో 30గ్రాముల అల్కాహాల్ మాత్రమే ఉండాలి. అదేవిధంగా మద్యం మత్తులో జరిపే డ్రైవింగ్ వల్లనే చాలా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మద్యం సేవించిన వాహనదారుడినే కాదు ఎదుటి వాహనదారులను ప్రమాదంలో పడేస్తుంది. ఉన్నత విద్యాభ్యాసం అభ్యసించి బాధ్యత గల పౌరులుగా మనం ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సి ఉంది. ఈ విధంగా అందరూ బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే రోడ్లపై వాహనాల డ్రైవింగ్ క్రమశిక్షణ పెరిగి రోడ్లపై వాహనదారులకు భద్రత పెరుగుతుంది.
ఈ నేపథ్యంలోనే మీ ఉద్యోగులందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా, ట్రాఫిక్ పోలీసులకు సహకరించి సురక్షిత ప్రయాణానికి తోడ్పడాలి.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...