పాఠశాలల అనుమతుల స్కామ్ పలువురి అరెస్టు


Wed,January 23, 2019 12:43 AM

- నిందితులపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు
-విచారణలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా..
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ప్రైవేట్ పాఠశాలల అక్రమ అనుమతులకు సంబంధించిన కుంభకోణంలో సీసీఎస్ పోలీసులు నిందితులపై అవినీతి నిరోధక చట్టాన్ని ప్రయోగించారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసి నిందితులుగా తేలిన 9 మందిలో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులే ఉండడంతో, వారిపై చార్జిషీట్ దాఖలు చేసేందుకు ప్రభుత్వ అనుమతి అవసరముంటుంది.. దీంతో ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి పోలీసులు లేఖ రాశారు. గత ఏడాది విద్యాశాఖ ఉన్నతాధికారుల విచారణలో వెలుగు చూసిన ఈ స్కామ్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి పలువురిని అరెస్టు చేశారు. ప్రైవేట్ పాఠశాలల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న యజామన్యాలు, ప్రభుత్వానికి చలాన్ రూపంలో కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. పాఠశాలల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నా వారు చెల్లించిన డబ్బును చలాన్ రూపంలోకి మార్చకుండా, వాటిని వాడుకొని, దరఖాస్తుదారులకు నకిలీ అనుమతి పత్రాలను అందజేస్తూ హైదరాబాద్ డీఈఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ పనిచేసే మహ్మద్ మన్సూర్ అలీ అవకతవకలు చేశాడు. దీనికి డీఈఓ అఫీస్ అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసిన మహ్మద్ అబ్దుల్ ఘనీ, ఆర్ కార్యాలయం సూపరిండెంట్ మహ్మద్ హసన్ సయీద్, డీఈఓ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ సహకారంతో నకిలీ అనుమతి పత్రాలు, దరఖాస్తుదారులకు అందించాడు. నిబంధనల మేరకు తాము అనుమతి పొందామని అనుకున్న ఆయా పాఠశాలల యజమాన్యాలు పదో తరగతి విద్యార్థుల ఎన్ డీఈఓ కార్యాలయానికి పంపించారు.

ఈ వ్యవహారంలో రికార్డులో అనుమతి ఉన్న స్కూళ్లకు, 2017-18 విద్యా సంవత్సరంలో పదోతరగతి పరీక్షల సందర్భంగా డీఈఓ కార్యాలయానికి అప్ అయిన స్కూళ్ల అనుమతుల విషయంలో తేడాలను అధికారులు గుర్తించారు. ఈ అనుమానాలపై విచారణ చేయాల్సిందిగా ప్రభుత్వ పరీక్ష విభాగం హైదరాబాద్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఆదేశించడంతో ఈ నకిలీ అనుమతుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
విద్యాశాఖ అధికారుల విచారణలో నకిలీల విషయం బయటపడడంతో ఆ శాఖ అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడం వెంటనే కేసు నమోదయ్యింది. 2017-18 విద్యా సంవత్సరానికి సంబంధించిన నకిలీ అనుమతులు ఇవ్వడంలో పాత్రదారులు, సూత్రధారులు ఎవరనే విషయాన్ని నిర్ధారించారు. కొందరిని అరెస్టు చేయగా, మరికొందరు ముందస్తు బెయిల్ పొందారు. తొమ్మిది మందిని నిందితులగా చేర్చిన సీసీఎస్ పోలీసులు ప్రభుత్వ అనుమతి రాగానే కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను ఆధారం చేసుకొని, నిందితులపై సీసీఎస్ పోలీసులు మొదటి సారిగా అవినీతి నిరోధక శాఖ చట్టంలోని పలు సెక్షన్లను ఈ కేసులో చేర్చారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...