హ్యాట్సాఫ్ హైదరాబాద్


Tue,January 22, 2019 01:19 AM

-పర్యావరణహిత ప్రయాణంలో మూడో స్థానం
- ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుంటున్న అత్యధికులు
-ఓలా’ దేశవ్యాప్త సర్వేలో వెల్లడి
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఈ సర్వేలో ప్రధానంగా 50 ప్రమాణాల ఆధారంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న రవాణా సదుపాయాలు, సామర్థ్యత, క్షేమంగా గమ్యాన్ని చేరుకోవడం వంటి వాటిని అంచనా వేశారు. పర్యావరణ హిత ప్రజా రవాణాలో భాగంగా నిర్వహించిన సర్వేలో పలు ప్రమాణాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. జనసాంద్రత, పబ్లిక్ రవాణా భాగస్వామ్యం, సౌకర్యాల కల్పన, గాలిలో నాణ్యత, పర్యావరణహిత వాహనాలు, రవాణా ఖర్చు, పార్కింగ్ ఫీజు, వాహన యజమానులు, తలసరి ట్రిప్ ధర, సగటు ప్రయాణ దూరం, ప్రజారవాణాను ఉపయోగించేందుకు కారణాలు వంటి విభాగాల్లో ఈ సర్వే సాగింది. ఈ సర్వేలో 33 శాతం మంది హైదరాబాద్ వాసులు క్యాబ్ షేర్ చేసుకుంటుండగా, 64 శాతం మంది నిత్య ప్రయాణం కోసం ప్రజా రవాణా సౌకర్యాలను వినియోగిస్తున్నారు. దీంతో పాటు హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సు సేవలు అమోఘంగా ఉండడంతో 87 శాతం మంది నగరవాసులు ప్రజారవాణా సదుపాయాలను 15 నిమిషాల్లో కాలినడక ద్వారా చేరుకోగలుగుతున్నారు. 95 శాతం మంది కంటే ఎక్కువ పర్యావరణ హిత ప్రయాణానికే మొగ్గు చూపడం విశేషం. సర్వేలో పాల్గొన్న వారిలో 80 శాతం మంది నగరవాసులు పర్యావరణ హిత రవాణా పరిస్థితులు మెరుగయ్యాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. 60 శాతం మంది వారి రోజువారీ ప్రయాణానికి ప్రజారవాణాను వినియోగిస్తున్నట్లు తెలుస్తున్నది. కాలినడకన ప్రజా రవాణా సదుపాయాలను అందుకునే నగరాల్లో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో బెంగళూరు, రెండోలో చెన్నై, నాలుగోలో కొల్ ఉన్నాయి.

మొదటిస్థానంలో బెంగళూరు..
పర్యావరణహిత ప్రయాణాలు చేయడంలో బెంగళూరు మొదటిస్థానంలో నిలిచింది. ఇక్కడి ప్రజలు ఎక్కువగా సిటీ బస్సులు, మెట్రో రైల్, క్యాబ్స్, ఆటో రిక్షాల ద్వారా తమ గమ్యాలను చేరుకుంటున్నారు. నగరం మొత్తంలో 2400 రూట్లలో ఆరువేల బస్సుల్లో 4.3 మిలియన్ల ప్రయాణికులు రోజూ రాకపోకలు సాగిస్తున్నారు. రెండు మార్గాల్లోని 50 రైళ్లలో 0.3 మిలియన్ల జనాభా ప్రయాణాలు సాగిస్తున్నారు. ద్విచక్రవాహనాల్లో 41.86 లక్షల మంది, కార్లల్లో 11.8 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ ఏటా ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు రూ.38వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. బెంగళూరులో 2012 మార్చిలో 4.1 మిలియన్ల వాహనాలుంటే, 2015 మార్చిలో 5.5 మిలియన్లు, 2016 ఫిబ్రవరిలో ఆరు మిలియన్ల వాహనాలు రోడ్లపై ప్రయాణం సాగిస్తున్నాయి.

మొబిలిటీ ప్లానింగ్..
ప్రజారవాణా సదుపాయాలను ఎందుకు వినియోగిస్తున్నారని ప్రశ్నించగా, సౌకర్యంగా ఉంటుందని, ఒక శాతం మంది, సమయం మిగులుతుందని 15 శాతం, అందుబాటు ధర 21 శాతం, ఇతర కారణాలతో 24 శాతం, వేరే సదుపాయాలు లేక 39 శాతం మంది ప్రయాణిస్తున్నట్లు తేలింది. ప్రజా రవాణా సదుపాయాలను ఎందుకు వినియోగిస్తున్నారని అడగ్గా.. అందుబాటులో ధరలు ఉండాలని 34 శాతం, అన్ని ప్రాంతాలకు బస్సు ఉండాలని 26 శాతం, సౌకర్యవంతంగా ఉండాలని 20 శాతం, దూరం తగ్గుతుందని 9 శాతం, రక్షణ ఉంటుందని ఏడు శాతం, మార్గమధ్యలో గమ్యం ఉంటుందనే ఉద్దేశంతో రెండు శాతం మంది బదులిచ్చారు. ప్రజారవాణా సదుపాయాల్లో ప్రయాణించినందుకు స్మార్ట్ కార్డుల ద్వారా 55 శాతం మంది, డిజిటల్ లావాదేవీల ద్వారా 41 శాతం మంది చెల్లింపులు చేస్తున్నారు.

కార్లను అద్దెకు తీసుకుంటారా అన్న ప్రశ్నకు 28 శాతం మంది అవునని, 21 శాతం అప్పుడప్పుడని, 51 శాతం మంది అసలే తీసుకోమని తెలిపారు. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుందా అంటే.. 53 శాతం అవునని, 22 శాతం అయ్యిండొచ్చని, 25 మంది కాదన్నారు. 72 శాతం మంది ప్రజారవాణా సదుపాయాలు గమ్యం చివరి వరకు ఉంటాయని, 28 శాతం మంది ఉండవని చెప్పారు. సైకిల్ ప్రయాణం కోసం 76 శాతం మంది ప్రత్యేక మార్గం కావాలని, 24 శాతం మంది అవసరం లేదన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఏం చేయాలని ప్రశ్నించగా,.. ప్రజారవాణాలో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలని 41 శాతం మంది, విద్యుత్ స్టేషన్లను నిర్మించాలని 26 శాతం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై రీసెర్చ్ కావాలని 21 శాతం, సబ్సిడీ కల్పించాలని 12 శాతం మంది చెప్పారు. నడిచేందుకు ప్రత్యేక ఫుట్ కావాలని 80 శాతం మంది, అవసరం లేదని 20 శాతం మంది చెప్పారు.

43వేల మందితో సర్వే..
దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో 43వేల మంది పాల్గొనగా, 19.35 లక్షల నిమిషాలకు పైగా తమ అభిప్రాయాలను పాలుపంచుకున్నారు. 21.50 లక్షల సమాచార అంశాలను 50 ప్రామాణికాల ఆధారంగా సేకరించారు. ఇందులో పురుషులు 68 శాతం కాగా, మహిళలు 31 శాతం, థర్డ్ జెండర్స్ 1 శాతం ఉన్నారు. 20 ఏండ్ల వయస్సు ఉన్న వారు 15 శాతం మంది కాగా, 20 నుంచి 40 ఏండ్ల వయస్సు వారు 63 శాతం, 40 నుంచి 60 ఏండ్ల వారు 16 శాతం, 60 ఏండ్లకు పైబడినవారు 6 శాతం ఉన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో కారులేని వారు 60 శాతం కాగా, 29 శాతం మందికి కారు ఉండగా, రెండు కార్లు ఉన్నది 8 శాతం, మూడు కార్ల కంటే ఎక్కువ ఉన్నవారు మూడు శాతం ఉన్నారు. ఉద్యోగం చేసే వారు 56 శాతం, నిరుద్యోగులు 10, గృహిణులు 11, విద్యార్థులు 23 శాతం ఉన్నారు. 15వేల కంటే తక్కువ సంపాదించే వారు 16 శాతం, 15వేల నుంచి 30వేలు సంపాదించేవారు 38 శాతం, 30నుంచి 50 వేలు సంపాదించేవారు 32 శాతం, 50 నుంచి లక్ష సంపాదించే వారు 12 శాతం, లక్ష కంటే ఎక్కువ సంపాదించేవారు రెండు శాతం మంది పాల్గొన్నారు. సర్వేలో పదిలోపు చదువుకున్న వారు మూడు శాతం, 12లోపు చదివిన వారు 18, డిగ్రీ చదివిన వారు 51 శాతం, పీజీ చేసిన వారు 22, పీహెచ్ ఆపై చదువులు చదివిన వారు ఆరు శాతం మంది ఉన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...