మీ వంటిల్లు పదిలమేనా..?


Sat,January 19, 2019 01:11 AM

-సిలిండర్ జర భద్రం
- కాలం చెల్లిన వాటితో పైలం..
-ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది
సిటీబ్యూరో : మీ సిలిండర్ జర చెక్ చేసుకోండి..వాటిపై తేదీ..లీకేజీలు ఉంటే గమనించండి.. ఏమరుపాటుగా ఉంటే పెద్ద ప్రమాదానికి దారితీయొచ్చు. ప్రాణాలకే ముప్పుగా మారవచ్చు. ఇందుకు శుక్రవారం కాప్రాలో జరిగిన దుర్ఘటనే ఉదాహరణ. ఇక్కడ ఓ ఇంట్లో పేలిన సిలిండర్ ఇల్లు ధ్వంసమైంది. ఇద్దరు మృత్యవాతపడ్డారు. పరిసరాల్లో గృహాలూ దెబ్బతిన్నాయి. బాంబు పేలుడును తలపించిన ఈ ఘటనతో నగరం మొత్తం ఉలిక్కిపడింది. సిలిండర్ల నాణ్యతపై సందేహాలు వ్యక్తమయ్యేలా చేసింది. తరచూ ఇలాంటి సంఘటనలు అడపాదడపా జరుగుతూనే ఉన్నా.. అసలెందుకు సిలిండర్ పేలుతుంది? కారణాలేమిటి? అనేది విశ్లేషించాల్సిన సమయం ఆసన్నమైంది.

గ్యాస్ ఏజెన్సీల నిర్లక్ష్యం కారణంగా అనేక ప్రాంతాల్లో సిలిండర్లు పేలుతున్నాయి. చమురు కంపెనీలు కాలం చెల్లిన సిలిండర్లను సరఫరా చేస్తూ వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. సాధారణంగా ఒక సిలిండర్ తయారు చేసిన తర్వాత దాన్ని ఐదు సంవత్సరాల వరకు మాత్రమే వినియోగదారులకు అందించాలి. ఆనంతరం దాన్ని రిసైక్లింగ్ చేయాలి. కానీ గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్లను రీసైక్లింగ్ చేయకుండా పైపైన కలర్స్ వేసి వాటినే తిరిగి వినియోగదారులకు అందిస్తున్నారు. గ్యాస్ కంపెనీలు వాటినే తిరిగి రీఫిల్లింగ్ పంపిస్తూ.. వినియోగదారుల ప్రాణాలతో చెలగాడమాడుతున్నాయి. నిజానికి వీటన్నింటిని రీసైక్లింగ్ చేసి మళ్లీ కొత్త గ్యాస్ ఏర్పాటు చేయాలి. కానీ అలాంటిదేమీ జరగడం లేదు. కాలం చెల్లిన బండలను పక్కన పడేస్తామని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం లేదు.

పట్టించుకోని చమురు సంస్థలు, ఏజన్సీలు
వ్యాపార విస్తరణపై ఉన్న దృష్టి వినియోగదారుల భద్రతపై పెట్టడంలో చమురు సంస్థలు, గ్యాస్ ఏజన్సీలు విఫలమవుతున్నాయి. వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని గ్యాస్ కనెక్షన్ తనిఖీ మరమ్మతులు చేయాల్సి ఉన్నప్పటికీ వీటిని పట్టించుకోవడం లేదు. గ్యాస్ డీలరుకు ఫోన్ సంప్రదిస్తే వచ్చే ప్రతినిధి స్టవ్ భాగాలు మార్చాలంటూ అత్యధికంగా వసూళ్లు చేస్తున్నారు. అంతపెద్ద మొత్తంలో ఖర్చు చేయలేక లోకల్ మెకానిక్ స్టవ్ రిపేర్లు చేయించుకుంటుండంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. సంస్థ ప్రతినిధుల వసూళ్లపై ఫిర్యాదు చేస్తే ఏజన్సీలు పట్టించుకోకపోవడంతో ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక వినియోగదారులు ఫిర్యాదు చేయడం మానేశారు. సిలిండర్ నాణ్యత విషయంలో కూడా ఫిర్యాదు చేయడానికి నెంబర్లు అందుబాటులో ఉండటం లేదు. ఏజన్సీలు పట్టించుకోవు. అంతెందుకు డెలివరీ బాయ్స్ అధికంగా వసూలు చేస్తున్న చార్జీలమీదనే ఇప్పటివరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

అవగాహనతోనే ప్రమాదాల నివారణ
సిలిండర్ తలరింగుకు ఉండే మూడు పలకల్లో ఒకదానిపై ఆంగ్ల అక్షరంతో కూడిన రెండు అంకెల సంఖ్య ఉంటుంది. ప్రతి బండకు ఎక్స్ డేట్ నాలుగు కేటగిరీలుగా విభజిస్తారు..ఎ, బీ, సీ, డీ గ్రూపులుగా వీటిని డివైడ్ చేసి పక్కనే దాని కాలం చెల్లే సంవత్సరాన్ని సూచిస్తారు. ఏడాదిలో మొదటి మూడు నెలలను ‘ఎ’గా తర్వాతి మూడు నెలలను ‘బీ’గా, ఆ తర్వాతి మూడు నెలలను ‘సీ’గా, ఇక చివరి మూడు నెలలను ‘డీ’గా వర్గీకరిస్తారు. ఉదాహరణకు ఓ గ్యాస్ బండ ఎక్స్ డేట్ ‘డీ 19’ అని ఉంటే ఆ గ్యాస్ బండకు 2019 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. డిసెంబర్ దాని ఎక్స్ డేట్ పూర్తిగా అయిపోతుంది. ఇక ఆ తర్వాత దాన్ని ఉపయోగిస్తే ఆది పేలే ప్రమాదం ఉంది. అంతేగాకుండా వంటగ్యాస్ సిలిండర్ సంవత్సరంలో రెండుసార్లు చమురు సంస్థలు పరీక్షిస్తాయి. ఎక్కడైనా లీకేజీలు ఉంటే వాటి స్థానంలో కొత్తవి అమర్చుతారు. అవి బీఐఎస్ స్టాండర్డ్డ్ ఉన్న వాటినే మళ్లీ బిగిస్తారు. చాలా వరకు రెగ్యులేటర్ వాచర్, గ్యాస్ లీకేజీలే ఉంటాయి. వీటిలో లోపం ఉంటే ఉచితంగా వాటిని మార్చుతారు. రెండుసార్లు చెక్ సంవత్సరానికి చమురు సంస్థలు కేవలం వినియోగదారుడి వద్ద నుంచి రూ. 177 మాత్రమే తీసుకుంటారు. అధనంగా ఎటువంటి మొత్తాన్ని వినియోగదారుల వద్ద నుంచి తీసుకోరు. వంటగ్యాస్ కనెక్షన్లో ఎటువంటి లీకేజీలు లేదా ఇబ్బందులు ఏర్పడినా గ్యాస్ ఏజన్సీలకు సమాచారం అందిస్తే అధికారిక టెక్నిషియన్ పంపిస్తారు. కొంతమంది గ్యాస్ స్టవ్ రిపేరు చేస్తామని వచ్చేవారి వద్ద రిపేరు చేయించుకోవద్దు. నాసిరకం వస్తువులు బిగించి అధిక డబ్బులు గుంజుతారు. ఇవి ఏ రకంగా క్షేమకరం కాదు పైగా అత్యంత ప్రమాదం కూడా. ప్రమాదం జరిగినప్పుడు పోలీసులకు 100, ఫైర్ సిబ్బంది సాయం కోసం 101 కు డయల్ చేయాలి.

పాటించండిలా
గ్యాస్ స్టవ్ గ్యాస్ సరఫరా చేసే పైపును పరీక్షించుకోవాలి. రెగ్యులేటర్ అందులో గుండ్రంగా ఉండే రబ్బర్ వాచర్ తరుచూ పరీక్షించుకోవాలి. దీనితోపాటు సిలిండర్ ఎప్పుడూ గాలి ధారాలంగా ఉండే ప్రాంతములో చదునైన నేలపైన ఉంచాలి. వంటరూం క్యాబిన్ కాని అడ్డంగా పడుకోబెట్టడం కానీ చేయరాదు. చాలా మంది క్రింద సిలిండర్ పెట్టి పైపును స్టవ్ ఉంచే బండకు రంద్రం చేసి పైకి పంపే క్రమంలో రాపిడై పైపు లీకేజీ కావచ్చు. పైపును నేరుగా స్టవ్ అనుసంధానం చేయాలి. ఇటువంటివన్నీ పరీక్షించుకోవాలి. సిలిండర్ డెలివరీసమయంలో కంపెనీ సీల్ అండ్ సేఫ్టీ క్యాప్ సరిగ్గా ఉందోలేదో చూసుకోవాలి. సందేహం ఉంటే డెలివరీ బాయ్ డెమో ఇవ్వమని అడగాలి. సిలిండర్ లాగుకు రావడం, బొర్లించుకుపోవడం వంటి చర్యలు నిషేధం. ప్రమాదకరం. వంటగ్యాస్ సమీపంలో మండే పదార్థాలు ఉంచకూడదు. లీకేజీ అవుతుందో లేదో పరీక్షించడానికి అగ్గిపుల్లలు, కొవ్వొత్తులు మండించరాదు. ఇండక్షన్ కుక్కర్, దీపాల వంటి వాటిని పక్కన ఉంచరాదు. రెగ్యులేటర్ నాబ్ స్టవ్ ఎప్పుడూ ఆఫ్ పొజిషన్ ఉంచాలి. రబ్బర్ ట్యూబ్ ప్రతి 6 నెలలకోసారి మార్చాలి. సిలిండర్ మార్చేటప్పుడు స్టవ్ స్విచ్చులను ఆఫ్ వేడిగాలి తగిలేచోట ఉంచకూడదు.

లీకేజీ గుర్తిస్తే చేయండిలా
గ్యాస్ లీకవుతుందని గుర్తిస్తే ఆందోళన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టిసారించాలి. విద్యుత్ పరికరాలు, స్విచ్చులు ఆఫ్, ఆన్ చేయరాదు. మండే పదార్థ్ధాలను దూరంగా పెట్టాలి. సిలిండర్ రెగ్యులేటర్ ఆఫ్ చేయలి. సేఫ్టీ క్యాప్ వీలైనంత త్వరగా అమర్చాలి. తలుపులు,కిటికీలు తెరువాలి. గాలి సరఫరా ఎక్కువగా ఉండేట్లు చూడాలి. ఫ్యాన్లను వేయవద్దు. మీ గ్యాస్ డీలర్ టచ్ ఉండి సమాచారాన్ని అందించాలి.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...