ఎన్‌ఓసీలతో ఇబ్బందులు


Mon,November 19, 2018 12:54 AM

-రవాణాశాఖకు ఏపీ ఎన్‌వోసీలతో ఇబ్బంది
-సంతకాలు లేకుండా నిరభ్యంతర పత్రాలు జారీ చేస్తున్న ఏపీ
-వాహన విక్రయదారుడి సంతకం లేక ఇబ్బందులు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ తెలంగాణ రవాణా శాఖకు ఇస్తున్న నిరభ్యంతర పత్రాలు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. ఆన్‌లైన్ పేరిట సంతకాలు లేకుండా జారీ చేస్తున్న ఎన్‌వోసీలు తెలంగాణ రవాణాశాఖ అధికారులతోపాటు వాహనదారులకు ఇక్కట్లు తెచ్చిపెడుతున్నాయి. వాహన బదిలీల విషయంలో ఈ సమస్య ఎక్కువవుతోంది. లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లో చేశామని చెబుతూ ఆర్‌సీలపై నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్‌ఓసీ) ఫిజికల్‌గా పంపించకపోవడంతో ఏపీ నుంచి తెలంగాణకు బదిలీపై వచ్చే వాహనాల బదిలీలు నిలిపివేస్తున్నారు. వాహనదారులు తమ వాహన బదిలీకీ సంబంధించి పత్రాన్ని తీసుకురాకుండా ఖాళీ చేతులతో రవాణాశాఖ కార్యాలయాలకు వచ్చి తమ వాహనాన్ని రిజిస్టర్ చేయాలని తెలంగాణ రవాణాశాఖ అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. పత్రాలు తీసుకు వస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెబుతుండడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. చివరకు జిరాక్స్ పత్రాలు తెస్తున్నప్పటికీ వాటి మీద సంతకాలు ఉండడం లేదు.

దీంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని తెలంగాణ రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి విజయవాడకు చెందిన వాహనం కొనుగోలు చేసి ఇక్కడికి బదిలీ చేయించుకోవాలనుకుంటే అక్కడి రవాణాశాఖ కార్యాలయం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను తీసుకుని రావాల్సి ఉంటుంది. అయితే గతంలో మాదిరిగా చేతికి నిరభ్యంతర పత్రం ఇవ్వకుండా ఆన్‌లైన్‌లోఉంచామని చెబుతున్నారు. తెలంగాణ కార్యాలయాలకు వస్తే నిరభ్యంతర పత్రాలు అధికారికంగా ఉండాలని అభ్యంతరం చెబుతుండడంతో ఏం చేయాలో వాహనదారులకు పాలుపోవడం లేదు. ఇవన్నీ పరీక్షించేటప్పుడు వాహనం వివరాలు సరైనవా లేవనేవీ జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఇందుకుగాను అమ్మినవారి సంతకం చూడాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ఎన్‌వోసీలో ఎక్కడా అమ్మినవారి సంతకం కనబడడం లేదు. అసలు నిజంగా అమ్మాడా? లేదా? అనేదీ తేల్చుకోలేక రిజిస్ట్రేషన్ చేస్తే ఉద్యోగాలకు ఎసరచ్చే అవకాశముంది. ఇప్పటికే రవాణాశాఖలో వాహనాల పన్ను విషయంలో వివాదాలు చాలా తీవ్రంగా ఏర్పడి ప్రభుత్వం చర్యలు కూడా తీసుకున్నది. ఈ నేపథ్యంలో వాహన విక్రయదారు సంతకం లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తే ఏమవుతుందోనని వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నారు. సమస్యను ఏపీ రవాణాశాఖ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...