మెట్రో మార్గంలో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలిగింపు


Mon,November 19, 2018 12:51 AM

-దివ్యాంగులు, వృద్ధులు, పాదచారులకు ర్యాంపులు
-ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద సందర్శకుల కోసం ప్రత్యేక టికెట్ కౌంటర్లు
-పంజాగుట్ట నుంచి ఎంజే మార్కెట్ మార్గాన్ని పరిశీలించిన మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మెట్రో రైలు మార్గాల్లో పాదచారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలిగింపుతోపాటు అభివృద్ధి పనులు హైదరాబాద్ మెట్రోరైలు చేపడుతున్నది. అందులో భాగంగా మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఇంజినీర్ల బృందం ఆదివారం పంజాగుట్ట నుంచి ఎంజే మార్కెట్ మార్గంలో ఫుట్‌పాత్‌లు స్టేషన్లను పరిశీలించింది. కారిడార్-1లోని పంజాగుట్ట, ఎర్రమంజిల్, ఖైరతాబాద్, లక్డీకపూల్, అసెంబ్లీ, నాంపల్లి, గాంధీభవన్ స్టేషన్లను పరిశీలించి పరిసరాలను తనిఖీ చేశారు. పాదచారులు, సీనియర్ సిటిజన్స్, దివ్యాంగుల సౌకర్యార్థం ఫుట్‌పాత్‌ల చివరన ర్యాంపులు నిర్మిస్తామన్నారు. అదేవిధంగా పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతంలో ఆక్రమణలు త్వరగా తొలిగించడంతోపాటు రెయిలింగ్‌లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఫుట్‌పాత్‌ల మీద నుంచి వాహనాలు తీసుకుపోకుండా చూడాలని అన్నారు. ఎర్రమంజిల్, అసెంబ్లీ మెట్రోస్టేషన్ మెట్రో రైల్వే స్టేషన్ల వద్ద ఫుట్‌పాత్‌లు ఇరుకుగా ఉన్నాయని, అవసరమైన ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను తీసుకుని నిర్మిస్తామని తెలిపారు.

మెట్రో స్టేషన్ నుంచి నాంపల్లి రైల్వేస్టేషన్ వరకు ఎయిర్‌పోర్టు మాదిరిగా లగేజీ తీసుకెళ్లేందుకు ట్రాలీ సిస్టం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా బస్, ఆటో, ఈ-వెహికల్ బే మొదలగు ఏర్పాట్లుంటాయని పేర్కొన్నారు. మెట్రో, రైల్వేస్టేషన్ మధ్య ఉన్న రద్దీని క్రమబద్దీకరిస్తామని తెలిపారు. అదేవిధంగా 2019లో జరుగనున్న ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ సందర్శకుల కోసం డిసెంబర్ 31 వరకు అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు కోసం ఎల్‌అండ్‌టీ హెచ్‌ఎంఆర్‌ఎల్‌ను సంప్రదించాలని కోరారు. అదేవిధంగా కారిడార్-1 మార్గంలో పోలీస్ కంట్రోల్ రూం నుంచి ఎంజీబీఎస్ వరకు గల ప్రతిపాదిత ఐదు కిలోమీటర్ల మార్గంలో హెరిటేజ్ స్ట్రెచ్ నిర్మాణం పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రయాణికులకు పార్కింగ్ ఏర్పాట్లు, ప్లాంటేషన్, నీడనిచ్చే చెట్లు, పూల చెట్లు ఫుట్‌పాత్‌ల పక్కన నాటుతామన్నారు. బృందంలో సీపీఎం బి.ఆనంద్ మోహన్, ఎస్‌ఈ విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...