హైటెక్‌సిటీకి 6 నిమిషాలకో రైలు


Sun,November 18, 2018 12:23 AM

-డిసెంబరులోనే ప్రారంభం
-మిగతా పనులు పూర్తయ్యే వరకు ఒకే ట్రాక్‌పై మెట్రో ప్రయాణం
-అప్పుడే మెట్రోపాస్‌లు అందించేలా చర్యలు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : అతికీలకమైన అమీర్‌పేట-హైటెక్‌సిటీ మెట్రోరైలు ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఐటీ కారిడార్‌కు రాకపోకలు సాగించే ఈ మార్గంలో పనులు శరవేగంగా పూర్తి కావొస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం డిసెంబరులో హైటెక్‌సిటీ మార్గంలో మెట్రోరైలు రాకపోకలు సాగించనుంది. గవర్నర్ ఆదేశాలకు అనుగుణంగా ఎల్‌అండ్‌టీ, హైదరాబాద్ మెట్రోరైల్ యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేస్తున్నాయి. డిసెంబర్‌లో అందుబాటులోకి రానున్న మెట్రోరైలు ప్రారంభంలోనే 6 నిమిషాల ఫ్రీక్వెన్సీతో రాకపోకలు కొనసాగించనుంది.

అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు అందుబాటులోకి తేనున్న 10 కిలోమీటర్ల మార్గాన్ని మొదట్లో సింగిల్ లైన్ మీద ఆపరేషన్స్ నిర్వహించేందుకు ఎల్‌అండ్‌టీ సిద్ధమైనట్లు సమాచారం. నాగోలు- మియాపూర్ మార్గంలో మొదట్లో 8 నిమిషాల ఫ్రీక్వెన్సీతో మెట్రోరైలు నడిపించగా అంతకన్నా తక్కువ ఫ్రీక్వెన్సీతో హైటెక్‌సిటీ మార్గంలో నడిపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సింగిల్ లైన్ ఆపరేషన్స్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యమధ్యలో ఏర్పాటుచేస్తున్న పాకెట్ ట్రాక్స్‌తోపాటు స్టేషన్లలో ఉన్న రెండు ట్రాక్‌లలో ఒక రైలు నుంచి మరోరైలును సాగనంపుతారు. ఇలా ఎదురెదురుగా వెళ్లే రైళ్లు ఢీకొనకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ టూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా(సీఈఐజీ) తనిఖీలు పూర్తికావడంతో తదుపరి పనులను వేగవంతం చేశారు. ప్రస్తుతం ఎల్బీనగర్-మియాపూర్ (కారిడార్-1) నడుమ ప్రతీరోజు 21 రైళ్లు నడుస్తుండగా, నాగోలు నుంచి అమీర్‌పేట వరకు 12 రైళ్లు నడుస్తున్నాయి. కారిడార్-1లో ప్రతినిత్యం 284 ట్రిప్పులు, కారిడార్-3లో 266 ట్రిప్పులు కలిపి ప్రతీరోజు 550 ట్రిప్పుల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నారు.

రెండు కారిడార్లు కలిపి 46 కిలోమీటర్లు అందుబాటులోకి..
కారిడార్-3లో భాగంగా మొదటిదశలో ఇప్పటివరకు నాగోలు నుంచి అమీర్‌పేట వరకు ఆపరేషన్స్ జరుగుతున్నాయని, కారిడార్-1 పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. రెండు కారిడార్లు కలిపి 46 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చిందన్నారు. డిసెంబర్‌లో అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు 10 కిలోమీటర్లు అందుబాటులోకి రానున్నదన్నారు. వచ్చే సంవత్సరంలో కారిడార్-2కు సంబంధించి జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రోమార్గం పూర్తవుతుందని పేర్కొన్నారు. 72 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టులో ఇప్పటివరకు 46 కిలోమీటర్లు అందుబాటులోకి రాగా, మరో 20 కిలోమీటర్ల పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. కాగా హైటెక్‌సిటీ మార్గంతోపాటే మెట్రోపాస్‌లు అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...