ప్రతిఒక్కరూ యూనీఫాంలేని పోలీసే!


Sun,November 18, 2018 12:22 AM

-సోషల్ మీడియాలో చురుకుగా నగరవాసులు
-ఆన్‌లైన్‌లో 17,280 ఫిర్యాదులు, 17,084 ఉల్లంఘనలపై చలాన్లు
-ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : సోషల్ మీడియాలో సామాన్య ప్రజల నుంచి ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఫిర్యాదులు, సలహాలు, సూచనలు వస్తున్నాయని నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ తెలిపారు. వచ్చే ఫిర్యాదులను పరిశీలించి వెంటనే ఆయా ఉల్లంఘన దారులకు చలానాలు జారీ చేస్తున్నామని వెల్లడించారు. హాక్ ఐ, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్ అప్లికేషన్, హెల్స్‌లైన్ ద్వారా ఈ ఏడాది 17,280 ఫిర్యాదులు అందాయన్నారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన తరువాత 17,084 మంది వాహనదారులపై చలాన్లు విధించామన్నారు. వీటితోపాటు రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్‌లోని ట్రాఫిక్ విభాగం సోషల్‌మీడియా ఫిర్యాదులపై 21,481 చలాన్లు జారీ చేశామని వెల్లడించారు. ఇదిలా ఉండగా భారతదేశంలోని ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన ఫేస్‌బుక్ పేజీల్లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫేస్‌బుక్ పేజీ 3వ ర్యాంకులో ఉందని అదనపు సీపీ అనిల్‌కుమార్ వెల్లడించారు. నగర ప్రజలు ఫేస్‌బుక్ పేజీలో బాగా స్పందిస్తున్నారని ఆయన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఫిర్యాదులు అందుతున్నదిలా...!
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలంటూ ప్రతిఒక్కరు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని నగర ట్రాఫిక్ విభాగం ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. పోలీసులు ఏర్పాటు చేసుకున్న టెక్నాలజీ సౌకర్యంతో ఎవరు ఉల్లంఘటనలకు పాల్పడినా అవి పోలీసుల దృష్టికి సామాన్యులు తీసుకొచ్చే విధానాన్ని నాలుగేండ్ల క్రితం అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఇప్పుడు ప్రతిఒక్కరు పోలీసు దుస్తులు లేని సామాన్య పోలీస్‌గా వ్యవహరించే వీలవుతున్నది. వాహనదారుడు ఉల్లంఘనకు పాల్పడిన దృశ్యం స్పష్టంగా ఉంటే.. వెంటనే ఆ వాహన నంబర్ ఆధారంగా పోలీసులు చలాన్ విధిస్తున్నారు. దీంతో సామాన్య ప్రజలు కూడా తమ వంతు సహకారాన్ని పోలీసులకు అందిస్తున్నారు. ఇందులో భాగంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారు, నంబర్ ప్లేట్ సరిగా లేని వాహనదారులు, రాంగ్ సైడ్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్‌తోపాటు కార్లు, ఆటోలు, బస్సులు ఇలా అన్ని రకాల వాహనాలపై దృష్టి పెట్టి ఉల్లంఘనను ఫొటోలు తీసి ట్రాఫిక్ పోలీసులు సూచించిన హాక్ ఐ, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ లైవ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో పోస్టు చేస్తున్నారు. ఇలాంటి పోస్టులను కమాండ్ అండ్ కంట్రోల్‌లోని ట్రాఫిక్ సిబ్బంది పరిశీలించి, ఆయా వాహనాలను ఉల్లంఘనలకు పాల్పడినట్లు నిర్ధారించుకున్న తరువాత చలాన్లు జారీ చేస్తున్నారు. అలాగే సామాన్య ప్రజల నుంచి రోడ్డు రీ ఇంజినీరింగ్ చేయాలని, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు మరమ్మతులు చేయాలంటూ సూచనలు సలహాలు వస్తున్నాయి.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...