లాగుదామంటే.. వచ్చేవారు లేకపాయే..


Sat,November 17, 2018 01:10 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఇతర పార్టీల్లోని అసమ్మతి నేతలను లాగి టికెట్లు ఇద్దామనుకున్న బీజేపీ ఆశలు అడిఅశయాలయ్యాయి. లాగుదామంటే వచ్చేవారు లేకపోవడంతో, రా రమ్మని పిలిచినా వచ్చే వారు లేకపోవడంతో ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరి నిమిషం వరకు ప్రయత్నం చేసినా.. ఎట్లాగు వచ్చేవారు లేకపోవడంతో బీజేపీని నమ్ముకున్న వారికే టికెట్లు ఇచ్చేందుకు ఆ పార్టీ కసరత్తు చేస్తున్నది. శాసన సభ ఎన్నికలను అవకాశంగా తీసుకున్న బీజేపీ ఎలాగైనా సత్తా చాటుకోవడానికి ఉబలాటపడుతున్నది. త్రిపుర, అసోం ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి వలసలను ప్రొత్సహించి, టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న పార్టీ ఇదే ఫార్మూలాను తెలంగాణ ఎన్నికల్లోనూ అనుసరించాలని భావించింది. ఇందుకోసమే ఆఖరు నిమిషం వరకు టికెట్లు ఖరారు చేయకుండా వేచిచూసే ధోరణి అవలంభించింది. మొదటి, రెండు విడతల్లో గ్రేటర్‌లోని 16 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.

ఈ రెండు జూబితాల్లోనే పార్టీకి విధేయులుగా ఉన్న వారికే టికెట్లు దక్కగా.. మిగ తా 9 స్థానాలను ఇతర పార్టీల నుంచి వచ్చే వారి కోసం రిజర్వ్‌లో పెట్టింది. ఇలా కంటోన్మెంట్, జూబ్లీహిల్స్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, సనత్‌నగర్, నాంపల్లి, పటాన్‌చెరు స్థానాలను అభ్యర్థులను ఖరారుచేయలేదు. ప్రజాకూటమిలో టికెట్లు ఆశించి విఫలమైన వారిని లాగి తమ పార్టీ టికెట్‌పై పోటీచేయిద్దామని బీజేపీ నేతలు భావించారు. ఎలాగు అసమ్మతి రగులుతుంది కనుక, ప్రజాబలం అధికంగా ఉన్న అసంతృప్త నేతలను లాగి టికెట్లు ఇవ్వాలన్న వ్యుహాన్ని అనుసరించింది. కాని బీజేపీ పన్నిన వ్యూహం విఫలమయ్యింది. బీజేపీ భావించినట్లు ఏ ఒక్క నేత కూడా బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం. దీంతో పరిస్థితి చేయిదాటిపోతుందని గమనించిన పార్టీ గురువారం ముగ్గురు అభ్యర్థులను ప్రకటించి.. ఇంకా ఎవరైనా రాకపోతారా అని మరో నాలుగు స్థానాలను పెండింగ్‌లో ఉంచి, ఇప్పటి వరకు కంటోన్మెంట్, జూబ్లీహిల్స్, మహేశ్వరం, సనత్‌నగర్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఇబ్రహీంపట్నంలో సీటునాశిస్తున్న కాంగ్రెస్ నేతల్లో ఎవరో ఒకరు వస్తారని, పటాన్‌చెరులోనూ కాంగ్రెస్ నేతలను ఆహ్వానించి సీటు ఇద్దామని బీజేపీ నేతలు ఆశించారు.

కాని అలా జరగకపోవడంతో తీరా గురువారం బీజేపీ నేతలకే టికెట్లు ఇచ్చారు. ఇక కంటోన్మెంట్ సీటు కోసం కాంగ్రెస్‌లో తీవ్రమైన పోటీ నెలకొనగా, ఆఖరు నిమిషంలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ టికెట్ ఎగరేసుకు పోయారు. దీంతో ఇక్కడ ఓయూ జేఏసీ నేతలు మానవతారాయ్, మన్నె క్రిశాంక్‌లు తిరుగుబాటుబావుటా ఎగరేశారు. వీరిలో ఎవరో ఒకరిని లాగి టికెట్ ఇద్దామని భావిస్తున్నారు. ఇంకా వారి నుంచి స్పందన లేకపోవడంతో వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నారు. జూబ్లీహిల్స్ స్థానం నుంచి స్వామి పరిపూర్ణనంద పోటీచేస్తారని ప్రచారం జరిగినా.. ఆయన స్టార్ క్యాంపేయినర్‌గా ప్రచారం చేయాల్సి ఉండటంతో ఆయన రంగంలోకి దిగరని తేలిపోయింది. ఈ సీటును కాంగ్రెస్‌కు కేటాయించడంతో టీడీపీ టికెట్లు ఆశించిన ఒకరిద్దరిని లాగేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించినా సఫలం కాలేదు. ఇక సనత్‌నగర్ సీటు విషయంలోనే ఇదే జరిగింది. ఒకరిద్దరు నేతలను బీజేపీ నేతలు సంప్రదించినా.. వారు స్పందించలేదు. మొత్తంగా ఎవరూ రాకపోయే సరికి బీజేపీ ప్లాన్ అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. ఇక నామినేషన్ల సమర్పణకు తుది గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆఖరుకు తమ పార్టీ నేతలకే టికెట్లు ఇచ్చేందుకు బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. నాలుగో జాబితాలో పార్టీనే నమ్ముకున్న వారికి టికెట్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...