నేటితో ఉత్కంఠకు తెర


Sat,November 17, 2018 01:10 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గ్రేటర్ పరిధిలోని ఏడు స్థానాలపై నెలకొన్న ఉత్కంఠకు శనివారం తెరపడే అవకాశముంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తుది జాబితా శనివారం విడుదలచేయనున్నట్లు పార్టీ అధిష్టానం ప్రకటించడమే దీనికి ప్రధాన కారణం. అయితే ఆ ఏడు స్థానాలు ఎవరికి కేటాయిస్తున్నారో అనేది ఇప్పటికే ఆయా సీట్లు ఆశిస్తున్న ఆశావహులకు పార్టీ సమాచారం అం దించినట్లు సమాచారం. అంతేకాదు, బుజ్జగింపుల పర్వం కూడా కొనసాగిస్తుండగా, నేడు జాబితా విడుదలతో సస్పెన్స్ వీడిపోయే వీలుంది. గ్రేటర్‌లోని సనత్‌నగర్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, పటాన్‌చెరూ, కార్వాన్, యాకుత్‌పుర, బహదూర్‌పుర తదితర స్థానాలకు ప్రజాకూటమి ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇందులో రెండు స్థానాలు టీడీపీకి కేటాయిస్తారని కాం గ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

అందులో పటాన్‌చెరూ, సనత్‌నగర్/సికింద్రాబాద్, లేక బహదూర్‌పుర/కార్వాన్ స్థానాలున్నాయి. ఇందులో ఎల్బీనగర్, సనత్‌నగర్, సికింద్రాబాద్, పటాన్‌చెరూ, యాకుత్‌పుర స్థానాలకు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకుంది. సనత్‌నగర్ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి, సికింద్రాబాద్ స్థానాన్ని బండ కార్తీకరెడ్డి, పటాన్‌చెరూ నుంచి నందీశ్వర్‌గౌడ్, యాకుత్‌పుర స్థానాన్ని ఆబిద్ రసూల్‌ఖాన్ ఆశిస్తున్నారు. ఇప్పటికే సీటు కార్తీకరెడ్డి, రసూల్‌ఖాన్‌లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండగా, పార్టీ అధిష్టానం వారిని బుజ్జగింపు చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్, యాకుత్‌పుర స్థానాలు తమకు దక్కవని తేలడంతో వారు పార్టీ అధినాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగాలా, లేదా అనేదానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఇక సనత్‌నగర్, ఎల్బీనగర్ స్థానాలు శశిధర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డిలకు ఖాయమయ్యే అవకాశముంది. ఈ మేరకు పార్టీ అధిష్టానం వారికి స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. మొత్తం 24స్థానాల్లో ఇప్పటికే పది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించగా, ఐదు స్థానాల్లో టీడీపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. జనసమితికి రెండు స్థానాలను కేటాయించిన విషయం విధితమే. మిగిలిన ఏడు స్థానాల్లో రెండు టీడీపీకి కేటాయించనుండగా, మిగిలిన వాటి ల్లో కాంగ్రెస్ పార్టీ పోటీచేయనుంది. స్పష్టతరాని స్థానాలపై కీలక నేతలు ఆశలు పెట్టుకోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. ఓవైపు నామినేషన్ల పర్వం ముగింపునకు సమయం దగ్గరపడుతున్నా ఇంకా స్పష్టత రాకపోవడం తో ఆశావహుల్లో తీవ్ర టెన్షన్ నెలకుంది. కాగా, ఈ మిగిలిన స్థానాలపై కాంగ్రెస్ అధినాయకత్వం శుక్రవారం తుదికసరత్తు పూర్తిచేసినట్లు, శనివారం తుదిజాబితా వెల్లడించనున్నట్లు ప్రకటించింది.

ఇదిలావుంటే, టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రాజేంద్రనగర్ నుంచి కార్తీక్‌రెడ్డి, శేరిలింగంపల్లి స్థానం నుంచి భిక్షపతి యాదవ్ ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగనున్నట్లు ప్రకటించగా, మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, యాకుత్‌పుర, పటాన్‌చెరూ స్థానాల్లో కూటమికి తిరుగుబాటు అభ్యర్థుల బెడద తప్పేలాలేదు. ఆయా స్థానాల్లో భంగపాటుకి గురైన నేతలు ఇప్పటికే కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తమ తుది జాబితాను శనివారం వెల్లడించనుండగా, దీంతో కూటమిలో అభ్యర్థులపై స్పష్టత వస్తుందని చెప్పవచ్చు. మరోవైపు, నామినేషన్ల పర్వానికి ఇంకా రెండురోజులు మిగిలి ఉండడంతో సోమవారానికి తిరుగుబాటు అభ్యర్థులపై కూడా స్పష్టత వచ్చే వీలుంది.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...