మెట్రో టు మాల్స్ ప్రయాణికులకు అందుబాటులో స్కైవాక్స్


Thu,November 15, 2018 12:37 AM

ఖైరతాబాద్ : మెట్రో రైలు దిగిన ప్రయాణికులు ఇక నుంచి నేరుగా షాపింగ్ మాల్స్, వ్యాపార సముదాయాలు, హోటళ్లకు వెళ్లిపోవచ్చు. హైదరాబాద్ మెట్రో రైట్ ప్రతిష్ఠాత్మకంగా నగరంలోనే మొదటి స్కైవాక్‌ను పంజాగుట్ట మెట్రో స్టేషన్‌లో ఏర్పాటు చేసింది. ఈ స్కైవాక్‌ను బుధవారం ప్రిన్సిపల్ సెక్రటరీ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్) అరవింద్‌కుమార్, హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీఈవో కేవీబీ రెడ్డి, కియోలీస్ సంస్థ సీఈవో బెర్నాడ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ మెట్రో కారిడార్స్‌లో మరో హైదరాబాద్‌ను చూడనున్నారని అన్నారు. సింగపూర్ కానీ, ఎడారి ప్రదేశమైన దుబాయ్ కానీ ప్రపంచ షాపింగ్‌కు ఓ కేంద్రంగా రూపుదిద్దుకుందని గుర్తుచేశారు. ప్రపంచమంతా ఏ విధంగా మారుతున్నాయో పరిశీలించాలని, బూజుపట్టిన భావాలు ఉంటే ఏ నగరం కూడా అభివృద్ధి చెందదన్నారు. నేడు నగరాలు వేగంగా అభివృద్ధిలో పోటీ పడుతున్నాయన్నారు.

ప్రపంచంలోని మేధావులు, పారిశ్రామిక వేత్తలు నాణ్యమైన జీవనం, కాలుష్య రహిత నగరాలను ఎంచుకొని అక్కడ పెట్టుబడులు పెడుతున్నారని, ఆ స్థాయిలో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మెట్రో ద్వారా ఆ గుర్తింపు పొందాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టామన్నారు. సింగాపూర్‌లో ఒక మెట్రో స్టేషన్ నుంచి నేరుగా ఐదు నక్షత్రాల హోటల్‌కు, మాల్‌కు వెళ్లవచ్చని, అలాంటి తరహా నిర్మాణాలు మన దగ్గర కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచన నేడు కార్యరూపం దాల్చిందని తెలిపారు. హైదరాబాద్‌కు మెట్రో రైలు రావాలని తాను పదిహేను సంవత్సరాల క్రితమే ఆలోచించానని, నాడు ఈ విషయాన్ని కొందరికి చెబితే నమ్మలేదని, కానీ నేడు తన కల నేరవేరిందన్నారు. అంతర్జాతీయ సంస్థ కియోలీస్ ప్రపంచంలోని 30 నగరాల్లో మెట్రో రైళ్లు, లైట్ రైల్స్, సిటీ బస్సులు, ట్రామ్స్‌లను నిర్వహిస్తున్నారని, అదే క్రమంలో ఇందులో ఆ సంస్థ భాగస్వామ్యం వహించడం అభినందనీయమన్నారు.

ప్రస్తుతం రూ. కోటితో ఏర్పాటు చేసిన స్కైవాక్ 26 మీటర్ల పొడవు, మూడు మీటర్ల వెడల్పు బ్రిడ్జి లాంటి నిర్మాణం చేపట్టారన్నారు. భవిష్యత్తులో మెట్రో స్టేషన్ నుంచి కిందకు దిగవల్సిన అవసరం లేకుండా విద్యాసంస్థలు, వైద్యశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ వ్యాపార వాణిజ్య సంస్థలకు వెళ్లే విధంగా ఈ స్కైరోడ్ రూపొందిస్తామన్నారు. ప్రస్తుతం ప్యారడైజ్ వద్ద ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే హైటెక్ సిటీలో కూడా నిర్మిస్తామని పేర్కొన్నారు. ప్రతి స్టేషన్‌కు రెండు కోట్లు ఖర్చు పెట్టి అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నామని, ఆరేండ్లలో తమ పెట్టుబడులు తిరిగి వస్తాయని, హైదరాబాద్ నగర మెట్రో రైల్ దేశంలోనే బెస్ట్ ప్రాజెక్టుగా నిలుస్తుందన్నారు. కియోలీస్ సంస్థ ఇండియనా సీటీవో ఎరిక్, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...