మెట్రో స్టేషన్లలో..స్మార్ట్ బైకులు


Tue,September 25, 2018 12:42 AM

-శంషాబాద్‌లో మొదటి స్మార్ట్ బైక్ ప్లాంట్
-ఉద్యోగులు, విద్యార్థులకు తప్పనున్న నడక తిప్పలు
-నగర వ్యాప్తంగా 500 ఫీడర్ స్టేషన్లు
మెట్రో రైలు ప్రయాణికులు ఇక స్మార్ట్‌గా ప్రయాణించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నగర ప్రజల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో మెట్రో రైలును అందుబాటులోకి తీసుకువచ్చింది. తద్వారా నిమిషాల్లోనే వారివారి గమ్య స్థానాలకు చేరుకొనే అవకాశం వచ్చింది. అయితే మెట్రో స్టేషన్ నుంచి వారి కార్యాలయాలకు, పని చేసే ప్రాంతాలకు, విద్యార్థులు విద్యాసంస్థలకు వెళ్లాలంటే కొంత దూరం నడువాల్సిందే. ఆ సమయంలో రోడ్లు దాటుతూ ట్రాఫిక్‌ను తప్పించుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. అలాంటి వారి కోసం స్మార్ట్ సైకిళ్లను మెట్రో స్టేషన్ల వద్ద అందుబాటులోకి తీసుకొవచ్చారు. స్మార్ట్ బైక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నగరంలోని అన్ని మెట్రో స్టేషన్ల వద్ద ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, జీపీఎస్ సిస్టమ్‌తో స్మార్ట్ బైక్ (సైకిళ్లు)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం తొమ్మిది స్టేషన్ల వద్ద ఈ సౌకర్యం కల్పించగా, నగరంలో మెట్రో, ఎంఎంటీఎస్, బస్టాపులలో మొత్తం 500 ఫీడర్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌తో సదరు సంస్థ ఒప్పందం చేసుకున్నది. శంషాబాద్‌లో మొదటి స్మార్ట్ బైక్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. జర్మనీ నుంచి ముడి సరుకులు తెప్పించుకొని ఇక్కడ వాటికి తయారు చేస్తారు.

స్మార్ట్ బైక్ ప్రత్యేకతలు
జర్మనీకి చెందిన నెక్ట్స్ బైక్స్ సంస్థ నుంచి ముడి సరుకు దిగుమతి చేసుకొని నగరంలోని స్మార్ట్ బైక్స్ సంస్థలో సైకిళ్లను సిద్ధం చేస్తారు. ఈ బైకులో అనేక ప్రత్యేకలు ఉన్నాయి. బైకు వెనుకభాగంలో ప్రత్యేక కంప్యూటర్ పరికరం అమరి ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐ ఫోన్లు ఉన్న వారెవరైనా ఈ బైకుపై సవారీ చేయవచ్చు. ముందుగా నెక్ట్స్ బైక్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ ద్వారా డౌన్ లోడ్ చేసుకొని అందులో పొందుపర్చిన సూచనల ఆదారంగా బైకుపై ఉన్న నెంబర్‌ను టైప్ చేస్తే మనకు కోడ్ వస్తుంది. వెంటనే ఆ కోడ్‌ను బైక్‌పై ఉన్న కంప్యూటర్ పరికరంలో పొందుపరిస్తే ముందు చక్రం భాగంలోని ఆటోమెటిక్ లాక్ ఓపెన్ అవుతుంది. అనంతరం బైకును వినియోగించుకోవచ్చు. మెట్రో రైలు కార్డులు, స్మార్ట్ బైక్ సంస్థ కార్డును వినియోగించుకొని బైకును తీసుకొవచ్చు. సదరు కార్డులను సైకిల్ సీటు వెనుక ఉన్న స్కానింగ్ ప్రాంతంలో ఉచింతే వెంటనే కోడ్ డిస్‌ప్లే అవుతుంది. దీంతో లాక్ ఓపెన్ చేసుకొని ఆ సైకిల్‌పై ప్రయాణం చేయవచ్చు. తమ పని ముగిసిన తర్వాత బైకును నగరంలోని ఏ మెట్రో స్టేషన్‌లో ఉన్న స్మార్ట్ బైక్ ఫీడర్ స్టేషన్‌లోనైనా పార్కు చేసి వెళ్లిపోవచ్చు. అలాగే జీపీఎస్ సిస్టమ్, గ్లోబల్ టెలికమ్యునికేషన్ సిస్టమ్, హెడ్, టైల్ ఎల్‌ఈడీ లైట్లు, విద్యుత్ ఉత్పత్తి చేసే రెండు డైనమోలు, డు గేర్లు ఈ బైకుకు అమర్చారు.లైట్ వెయిట్‌తో నడిపేందుకు ఎంతో అనువుగా ఉండటంతో పాటు మంచి వ్యాయామంగా కూడా పనిచేస్తుంది.

అందుబాటులో టారిఫ్‌లు
స్మార్ట్ బైకును ఉపయోగించుకునేందుకు ప్రత్యేక రాయితీలు కల్పించారు. ప్రజలకు అందుబాటులో ఉండే టారిఫ్‌లను సిద్ధం చేశారు. ముఖ్యంగా వీక్, మంత్లీ, అరు నెలలు, సంవత్సరం పాసులను అందుబాటులోకి తెచ్చారు. ఒక వారానికి రూ.199, నెలకు రూ.399, ఆర్నెళ్లకు 1,119, సంవత్సరానికి రూ.1,999 నిర్ణయించారు. సభ్యత్వం తీసుకున్న వారు మొదటి 30 నిమిషాలు ఉచితంగా వాడుకోవచ్చు. మొదటి 30 నిమిషాల తర్వాత మరో 30 నిమిషాలకు రూ.10, తర్వాత ప్రతి 30 నిమిషాలకు రూ.15, ఎనిమిది గంటలకు రూ.100 బిల్ పడుతున్నది. మిగతా వారికి మొదటి 30 నిమిషాలకు రూ.10, గంటకు రూ.25, ప్రతి 30 నిమిషాలకు రూ.30 అదనంగా, ఎనిమిది గంటలకు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది.

నగరంలో 500 ఫీడర్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం
ప్రస్తుతం నగరంలోని ఖైరతాబాద్, అమీర్‌పేట, కేబీహెచ్‌బీ, మియాపూర్, కూకట్‌పల్లి, జేఎన్‌టీయూలో రెండేసి ఫీడర్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. నగరంలో ఉన్న మెట్రో స్టేషన్ల వద్ద 121 బైక్ స్టేషన్లను సిద్ధం చేస్తున్నాం. మరో 379 ఫీడర్ స్టేషన్లు త్వరలోనే ఏర్పాటు చేస్తాం. చెన్నై్లలో ఇప్పటికే 500, న్యూఢిల్లీలో 50 బైక్(ఫీడర్) స్టేషన్లు ఏర్పాటు చేశాం. మెట్రోతో పాటు ఎంఎంటీఎస్, బస్టాప్‌లలో మొత్తం 500 బైక్ స్టేషన్ల ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తున్నాం.
-ఖైరతాబాద్

మెట్రో చార్జీలు ఇలా..
మెట్రో ప్రయాణమార్గంలో చార్జీల పట్టికను ప్రకటించారు. కొత్తగా ప్రారంభించిన ఎల్బీనగర్ -మియాపూర్ మార్గంలో అటు నుంచి ఇటు చివరకు రావాలంటే 60 రూపాయలుగా నిర్ణయించారు. మొదటి 5 స్టేషన్లకు కామన్ టికెట్ రూ.10గా నిర్ణయించారు. కనీస చార్జి దాటాక ప్రతీ స్టేషన్‌కు రూ.5 గా నిర్ణయించారు. 29 కిలోమీటర్ల దూరానికి రూ.60 గా నిర్ణయించారు.

స్టేషన్ల వారీగా..
స్టేషన్ టు స్టేషన్ చార్జి రూ.లలో
మియాపూర్ ఎల్బీనగర్ 60
అమీర్‌పేట్ ఎల్బీనగర్ 45
ఖైరతాబాద్/లక్డీకాపూల్ ఎల్బీనగర్ 40
నాంపల్లి/గాంధీభవన్ ఎల్బీనగర్ 40
ఎంజీబీఎస్ అమీర్‌పేట్ 35
కేపీహెచ్‌బీ కాలనీ దిల్‌సుఖ్‌నగర్ 50
ఎల్బీనగర్ ఎంజీబీఎస్ 35
ఎల్బీనగర్ నాంపల్లి 40


ఎల్బీనగర్‌లో మెట్రో పరుగులు
ఎల్బీనగర్, నమస్తే తెలంగాణ :ఎల్బీనగర్ స్టేషన్‌లో మెట్రోరైలు ప్రారంభ సంబుంరం కోలాహలంగా జరిగింది. మెట్రో రైలును అమీర్‌పేట్ స్టేషన్‌లో ప్రారంభించిన గవర్నర్ నరసింహన్ అనంతరం మెట్రో రైలులో మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, తీగుళ్ల పద్మారావు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీలు మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, మాజీ మంత్రి దానం నాగేందర్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ ఎం.కే. జోషి, మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌రెడ్డి, ఉన్నతాధికారులు దాన కిశోర్, జనార్దన్‌రెడ్డి, మహేశ్‌భగవత్ తదితరులు ప్రయాణించి ఎల్బీనగర్ స్టేషన్‌కు చేరుకున్నారు. కాగా ఎల్బీనగర్ స్టేషన్‌లో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎల్బీనగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్‌తో పాటుగా కార్పొరేటర్లు జిన్నారం విఠల్‌రెడ్డి, కొప్పుల విఠల్‌రెడ్డి, సామ తిరుమల్‌రెడ్డి, ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న, రమావత్ పద్మానాయక్, సామ రమణారెడ్డి, ముద్రబోయిన శ్రీనివాస్‌రావు వారికి స్వాగతం పలికారు.

ఆరున్నర నిమిషాలకో రైలు
ఎల్బీనగర్ స్టేషన్ నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. పీక్ టైంలో ప్రతి ఆరున్నర నిమిషాలకు ఒక రైలు నడుస్తుంది. సాధారణ సమయాల్లో ప్రతి 8 నిమిషాలకు ఓ రైలు వచ్చి వెళుతుంది. ఎల్బీనగర్- అమీర్‌పేట్ మార్గంలో ప్రయాణికులకు మెట్రో రైలుతో ఎంతో మేలు కలుగుతుంది.
-వంశీకృష్ణ, ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ కంట్రోలర్

ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి
మెట్రో రైలు ఆరంభం కావడంతో ట్రాఫిక్ ఫ్రీ ప్రయాణానికి ఆస్కారం కలిగింది. మెట్రోలో వెళ్లడంతో సమయం ఆదా అవుతుంది. గమ్యస్థానాలకు సమయానికి చేరుకోవచ్చు. ఎల్బీనగర్ నుంచి మెట్రో రైలు అందుబాటులోకి రావడం మా అదృష్టం. మొదటి రోజు రైలు ఎక్కాలనే వచ్చాను.
-నాగరాజు, దిల్‌సుఖ్‌నగర్

ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం
మెట్రో రైలు ప్రయాణం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఉదయం మెట్రో రైలు ప్రారంభం అనగానే పరుగుపరుగున వచ్చాను. అయితే సాయంత్రం నుంచి ప్రయాణికులను అనుమతిస్తామని చెప్పారు. స్టేషన్ పరిసరాలు చూసి ఎంతో సంబరపడిపోయాను. మొదటి రోజు మెట్రో రైలు ఎక్కి ప్రయాణిస్తా.
-సాధిక్ ఆలీ ( రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి, ఎన్టీఆర్‌నగర్)
ఎంతో సంబురంగా ఉంది
మెట్రో రైలు ఎల్బీనగర్‌లో ట్రయల్ రన్ తిరుగుతుంటే సంబురంగా అనిపించింది. అందుకే మెట్రో రైలులో ప్రయాణించేందుకు వచ్చాను. నేను రైలులో ప్రయాణించి తర్వాత నా స్నేహితులకు చెప్పి వారితో కలిసి ప్రయాణిస్తాం.
- ఇర్ఫాన్, ఎస్‌ఎస్‌సీ విద్యార్థి, ఎన్టీఆర్‌నగర్

చాలా బాగుంది
మెట్రో రైలు విశ్వనగరంలో ప్రత్యేక ఆకర్షణ. ఎల్బీనగర్ నుంచి మెట్రో రైలు సేవలు అరంభం కావడం ఎంతో ఆనందంగా ఉంది. ఉప్పల్‌లో మెట్రోను మొదటి రోజే ఎక్కాను. విదేశాల్లోనూ, దేశ రాజధాని డిల్లీలోనూ మెట్రో రైలులో ప్రయాణించాను. కానీ మన మెట్రో చాలా బాగుంది.
కె. మురళీధర్‌రావు, చిత్రా లేఅవుట్, ఎల్బీనగర్

సంతోషంగా ఉంది
మమా ప్రాంతం మీదుగా మెట్రో రైలు సౌకర్యం అందుబాటులోకి రావడం సంతోషకరం. గంటల తరబడి ట్రాఫిక్‌లో ప్రయాణించకుండా వెళ్లాల్సిన ప్రాంతానికి సమయానికి చేరుకొనే అవకాశం ఏర్పడింది. కాలుష్యం బారిన పడకుండా మెట్రో రైలులో ప్రయాణించగలుగుతాం.
-బి నర్సింగ్‌రావు, గన్‌ఫౌండ్రి

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...