పోటీ చేస్తే చాలు..


Tue,September 25, 2018 12:39 AM

-జూబ్లీహిల్స్ బీజేపీ టికెట్ కోసం 25 మంది పోటీ
-ఓడిపోతామని తెలిసినా ఉత్సాహం చూపేది అందుకేనంట..
- బంజారాహిల్స్,నమస్తే తెలంగాణ: గతంలో ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్న పలు ప్రాంతాలను కలుపుతూ 2009 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పాటు చేశారు. 2009 నుంచి 2014 ఎన్నికల దాకా టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీ పూర్తిగా బలహీనమైంది. ఈ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ముస్లిం ఓట్లు ఉండటం.. ఎక్కువ మంది టీడీపీకే మద్దతు తెలుపుతుండటంతో బీజేపీ నామమాత్రంగానే మారింది. అయితే, ఇటీవల మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తోంది. పదేళ్ల పాటు టీడీపీతో అంటకాగడంతో పూర్తిగా డీలా పడ్డ బీజేపీ, ఈ సారి అభ్యర్థిని నిలబెట్టాల్సి వస్తోంది. ఏ మాత్రం బలం లేని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని వెతికిపట్టుకోవడం కష్టమని అంతా భావించారు. అయితే అందరి అంచనాలు తారుమారు చేస్తూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ టికెట్ కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. సుమారు 20 నుంచి 25మంది నాయకులు బీజేపీ టికెట్ కోసం పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం 10 వేల ఓటు బ్యాంకు లేని ఈ నియోజకవర్గం నుంచి ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారని ఆరా తీస్తే.. షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. పార్టీ గెలిచే పరిస్థితి లేకున్నా కంటెస్టెడ్ ఎమ్మెల్యే అనే పేరు సంపాందించుకుని రానున్న ఐదేళ్లపాటు పార్టీలో చక్రం తిప్పొచ్చు అనే భావనతోనే చాలా మంది జూబ్లీహిల్స్ బీజేపీ టికెట్ కోసం పోటీపడ్తున్నారని పార్టీ నాయకులే చెబుతున్నారు. ఓడిపోయే జూబ్లీహిల్స్ సీటులో నిలబడి కొంత పబ్లిసిటీ సంపాదించుకుంటే వచ్చే ఎన్నికల నాటికి ఉపయోగపడుతుందని అంతర్గత సమావేశాల్లో చెబుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. జూబ్లీహిల్స్ బీజేపీ టికెట్‌ను ఆశిస్తున్న వారిలో మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు తనయుడితో పాటు బీజేపీ నాయకుడు శ్రీధర్‌రెడ్డి, యువ మోర్చా నాయకుడు, నియోజకర్గం బీజేపీ ఇన్‌చార్జి తదితర నేతలు ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి ఓడిపోయే సీటు కోసం ఇంతగా పోటీ నెలకొనడంపై పార్టీలో సైతం జోకులు పేలుతున్నాయి.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...