అమాయకులకు వల..వెయ్యి కోట్లు గుల్ల


Tue,September 25, 2018 12:39 AM

గోవిందు రవికుమార్, నమస్తే తెలంగాణ: మనిషి కన్పించడు.. అతని ఫోన్ నంబర్ ఏ ఒక్కరి వద్ద ఉండదు.. విమానాల్లో తిరగడు.. అయితేనేం.. దేశ వ్యాప్తంగా అమాయకులను మోసం చేశాడు.. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులంటూ రూ. 1000 కోట్ల వరకు డిపాజిట్ల రూపంలో వసూలు చేశాడు. ఆ సొమ్మును కొన్ని షెల్ కంపెనీలకు బదిలీ చేసి బిచాణా ఎత్తేశాడు. ఇదంతా గొలుసు కట్టు విధానంలానే జరిగింది. ఒక రాష్ట్రంలో కేసు నమోదయితే... వెంటనే అక్కడ తన వ్యాపారాలను నిలిపివేస్తాడు.. మరో రాష్ట్రంలో అలాంటి వ్యాపారం చేసి అమాయకులను బుట్టలో వేస్తాడు. ఇప్పుడు నాలుగు రాష్ర్టాల్లోని పోలీసులకు ఈ సంస్థల నిర్వాహకుడు మోస్ట్ వాంటెడ్‌గా మారాడు. ఇతని మోసాలపై హైదరాబాద్ సీసీఎస్‌లోనూ ఇటీవల కేసు నమోదైంది. హైదరాబాద్‌లో నివాసముండే సుమారు 50 మంది తమను ఈ సంస్థ నిర్వాహకులు రూ. 2 కోట్ల మేర మోసం చేశారంటూ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు బాధితులు 50 మంది కాదు.. 500 మందికిపైగానే ఉన్నారని .. వారి వద్ద నుంచి ఈ సంస్థ యాజమాన్యం రూ. 300 కోట్ల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.

బాండ్లు జారీ చేస్తూ...
మధ్యప్రదేశ్ గ్వాలియర్‌కు చెందిన సంతోషిలాల్ రాథోర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా 2011లో కేఎంజే ల్యాండ్ డెవెలపర్స్ ఇండియా అనే పేరుతో సంస్థను ప్రారంభించాడు. దీనికి అధ్యక్షుడిగా అదే ప్రాంతానికి చెందిన సయ్యద్ రషీద్ హస్మీని నియమించుకోగా, అతని ఇద్దరు భార్యలతో పాటు ఇతర కుటుంబసభ్యులను డైరెక్టర్లుగా చేశాడు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులంటే ఈజీగా వస్తాయని భావించాడు. సంతోషిలాల్ బయట కన్పించకుండానే.. రషీద్ హస్మీని ముందు పెట్టి కథ అంతా నడిపించాడు. కంపెనీ రిజిస్ట్రేషన్ చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్‌పై మొదట కన్నేశాడు. తాము రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నామంటూ ఆ నోట ఈ నోట ప్రచారం చేశాడు. కనీసం రూ. 5 వేల నుంచి కోట్ల వరకు నెల వారీగా తమ సంస్థల్లో పెట్టుబడులు పెడితే.. మూడు నాలుగేండ్లలో రెట్టింపు ఇస్తామంటూ నమ్మించాడు. ఇందులో నెల, మూడు, ఆరు, 12 నెలలకు ఒకసారి వాయిదాల పద్ధతిలో డిపాజిట్ చేసుకునే వెసులుబాటును కల్పించాడు. ఇలా మొదట్లో తక్కువ పెట్టుబడులు పెట్టిన వారికి కొన్నాళ్ల పాటు మూడు నెలలకు, ఆరు నెలలకు ఒకసారి వడ్డీలు చెల్లించాడు. దీంతో ఈ సంస్థపై చాలా మందిలో నమ్మకం పెరిగింది. పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో 2013లోనే బిచాణా ఎత్తేశాడు. విజయవాడలో ఈ కంపెనీపై కేసు నమోదైంది. దీంతో ఈ సంస్థ తన కార్యాకలాపాలను అక్కడ మానేసి ఇతర రాష్ర్టాల్లో నిర్వహించడం ప్రారంభించారు.

ఫోన్ నంబర్ ఇవ్వకుండా..
ఏపీలో చేసిన పొరపాట్లు మళ్లీ చేయకుండా సంతోషిలాల్ జాగ్రత్తలు తీసుకొని తన మోసాన్ని మధ్యప్రదేశ్ గ్వాలియర్ ప్రాంతంలోనే తిరిగి ప్రారంభించాడు. ఈ సారి ఏజెంట్లకు తానే స్వయంగా డబ్బులు ఇచ్చి.. ప్రచారం చేయించాడు.. అందులో మొదట్లో ఏజెంట్ల వద్దకు వచ్చిన వారికి చెప్పినట్లు చెల్లింపులు చేస్తూ, స్కీంల్లో చేర్పించిన వారికి 10 శాతం కమీషన్ ఇస్తూ తన వ్యాపారాన్ని విస్తరిస్తూ వెళ్లాడు. ఇందులో ఎక్కడ కూడా సంతోషిలాల్ తెరపై కనపడలేదు. హస్మీనే ముందుంచుతూ.. తెర వెనుక ఉంటూ సూచనలు, సలహాలు ఇచ్చాడు. సెల్‌ఫోన్ నంబర్ ఎవరికీ కూడా ఇవ్వలేదు.. కేవలం తన కుటుంబ సభ్యులు, తన వ్యాపారంలోని కీలక వ్యక్తులతో మాట్లాడాలంటే కేవలం వాట్సాఫ్ కాల్‌లోనే మాట్లాడేవాడు. ఇలా గ్వాలియర్‌లో అనతి కాలంలోనే వందలాది కోట్ల డిపాజిట్లు చేశాడు. గొలుసుకట్టు విధానంలో మొదటి ఆరు నెలల పాటు స్కీంల్లో చేరిన వారికి డబ్బులు చెల్లిస్తూ.. చివరల్లో చేరిన వారికి ఎగ్గొట్టాడు. మొదట్లో చేరిన వారికి ఒకటి రెండు నెలలు డబ్బులు వస్తుండడంతో కేఎంజే ల్యాండ్ డెవలపర్స్ పేరు మారుమోగిపోయింది. ప్రతి డిపాజిట్‌కు బాండ్లు జారీ చేస్తూ వెళ్లాడు. ఆరు నెలలు, ఏడాదికి వడ్డీ తీసుకోవడమా? మూడు నాలుగేండ్లకు రెట్టింపు డబ్బు తీసుకోవడమా? అనే విషయాలు డిపాజిట్ చేసే సమయంలోనే నిబంధనలు సూచించడంతో చాలా మంది చివరకే తీసుకుంటామనే ఒప్పందానికి తల ఊపారు. ఇలా గ్వాలియర్ ప్రాంతంలో సుమారు రూ. 300 కోట్ల వరకు వసూలు చేసి జంపయ్యాడు. బాధితులు గ్వాలియర్‌లోని యూనిర్సిటీ పోలీసులకు 2014లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇక్కడి పోలీసులకు సంతోషిలాల్ కోసం గాలిస్తున్నారు. అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉన్నాడు. అలా ఉంటూనే ఇదే విధంగా చత్తీస్‌గడ్ రాష్ట్రంలోనూ మోసాలు చేశాడు. ఇక్కడ కూడా రెండుమూడు వందల కోట్ల వరకు మోసాలు చేశారు. ఈ మోసాలపై 2016లో రాయిపూర్‌లోని గంజ్ పోలీస్‌ష్టేషన్‌లో కేసు నమోదైంది.

నిధుల మళ్లింపు...!
దేశ వ్యాప్తంగా డిపాజిట్ చేసిన వారందరి సొమ్మును ఏజెంట్లు, సంస్థ అధ్యక్షుడు ఇతరులు కేఎంజే ల్యాండ్ డెవలపర్స్ ఇండియా ఖాతాలలోనే డిపాజిట్ చేయాలనే నిబంధన పెట్టుకున్నారు. దీంతో ఈ ఖాతాల్లో నుంచి సంతోషిలాల్ తాను సొంతంగా ప్రారంభించిన 10 ఢొల్ల్ల క ంపెనీలకు ఆ నిధులను మళ్లించాడు. అందులో లైన్ ఇన్‌ఫ్రా రియాల్టీ లిమిటెడ్, లోకిత్ భరత్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ, కేఎంజే న్యూస్ అండ్ నెట్ వర్క్, కింగ్‌సాన్ సినీమాస్ తదితర పేర్లతో ఏర్పాటు చేసిన సంస్థలలోకి నిధులు బదిలీ అయినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. ఇతనిపై సీసీఎస్‌లో కేసు నమోదు కాగానే ఢిల్లీలోని డీఎల్‌ఎఫ్ టవర్స్‌లో ఉన్న సంస్థ ప్రధాన కార్యాలయానికి పోలీసులు వెళ్లారు. అది కూడా మూసే ఉండడంతో పకడ్బందీ ప్లాన్‌తోనే ఈ మోసాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పాటు 2014 తరువాత సంతోషిలాల్ విమాన ప్రయాణాలు చేయలేదని పోలీసుల విచారణలో తేలింది.

విదేశాలకు పారిపోకుండా..
విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులకు ఎల్‌వోసీలు జారీ చేశారు. సంతోషిలాల్, అతని కుటుంబ సభ్యులు ఎవరు కూడా ప్రస్తుతం సెల్‌ఫోన్లు వాడడం లేదని పోలీసులు గుర్తించారు. కేవలం వీరంతా ఇంటర్‌నెట్ కాల్స్ మాట్లాడుతూ.. పోలీసులకు దొరకకుండా పక్కా ప్లాన్‌తో ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే ఘరాన ఛీటర్లను పట్టుకోవడం కోసం సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి ప్రత్యేక బృందాన్ని ఏసీపీ రాంకుమార్ నేతృత్వంలో రంగంలోకి దింపారు. ఈ బృందం నిందితుల కోసం దేశ వ్యాప్తంగా గాలింపు చేపట్టింది. ఇదిలాఉండగా ఈ అజ్ఞాత వాసి ఫొటోను నమస్తే తెలంగాణ సంపాదించింది.

హోటల్‌లో మీటింగ్స్.. నో ఫోన్స్..
సంతోషిలాల్ తన వ్యాపారాన్ని హైదరాబాద్‌కు 2016లో మార్చాడు..మెట్టుగూడ ప్రాంతంలో ఒక కార్యాలయాన్ని ప్రారంభించాడు. హైదరాబాద్‌లో సంస్థను ప్రారంభించడంతోనే ఇక్కడ కూడా కొన్ని డబ్బులు ఇచ్చి ఏజెంట్లను రంగంలోకి దింపాడు. వాళ్లు కొత్త వారిని తయారు చేశారు. ఇలా వందల సంఖ్యలో హైదరాబాద్‌లో ఏజెంట్లు తయారయ్యారు. వారందరితో పెద్ద పెద్ద హోటళ్లలో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలకు సంతోషిలాల్‌తో పాటు హస్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏ ఒక్కరూ కూడా సమావేశానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీయవద్దనే నిబంధనను పెట్టుకున్నారు. సమావేశానికి హాజరైన ఏజెంట్ల ఫోన్లు మీటింగ్ హాల్ బయటే పెట్టి వెళ్లే నిబంధన పెట్టడంతో, ఆయా మీటింగ్‌లకు ఒక్కరూ కూడా ఫోన్‌ను లోపలికి తీసికెళ్లలేకపోయారు. సుమారు రెండేండ్ల హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఇతని ఏజెంట్లు తిరుగుతూ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులంటూ భారీగా డిపాజిట్లు సేకరించారు. ఇక్కడ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలనే లక్ష్యంగా చేసుకొని ఈ ఏజెంట్లు డిపాజిట్లు సేకరించారు. ఏజెంట్లు. సబ్ ఏజెంట్లు..

వారికి మరో సబ్ ఏజెంట్లు.. ఇలా ఒక ఒకో ఏజెంట్లు 5 నుంచి 10 మంది వరకు ఏజెంట్లుగా తయారై సభ్యులను స్కీంల్లో చేర్పించడం, వారికి బాండ్లు ఇప్పించడం చేశారు. ఈ ఏజెంట్లు ప్రతి సభ్యుడి నుంచి కమీషన్ వచ్చే విధంగా స్కీం ఉంది, సభ్యుడు చెల్లించే మొత్తంలో 10 శాతం కమీషన్‌గా ఏజెంట్లకు పంచేవారు. ఇలా హైదరాబాద్‌లో పెట్టిన కార్యాలయాన్ని 2018 జూలై ప్రాంతంలో తీసేశాడు. ఇందులో పెట్టుబడి పెట్టిన వారు, ఏజెంట్లు ఇతని కోసం ఆరా తీశారు. డబ్బులు ఎక్కడ పోవని, పెట్టిన పెట్టుబడి వస్తుందని కొందరు నమ్మకంతో ఉండగా, మరికొందరు మోసం చేశాడని గ్రహీంచి సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. మొదట్లో తక్కువ మంది మాత్రమే ఫిర్యాదు చేయగా.. మోసపోయిన మొత్తం విలువ కేవలం రూ. 2 కోట్ల మేర మాత్రమే ఉన్నది. ఈ కేసు దర్యాప్తు చేస్తుండగానే పోలీసులకు మరింత మంది బాధితులు ఆశ్రయించడం, విచారణలో కొత్త కొత్త ఏజెంట్లు బయటకు రావడం.. వారి కింద వందల మంది లక్షల రూపాయలు పెట్టుడి పెట్టినట్లు పలువురు తమ ఆవేదనను పోలీసుల ఎదుట వ్యక్తం చేశారు. పూర్తిగా బాధితులు ఎందరు.. ఎంత మేర మోసం జరిగిందనే విషయాన్ని సీసీఎస్‌లో దర్యాప్తు చేపట్టిన ఏసీపీ రాంకుమార్ బృందం ఆరా తీసి వివరాలను సేకరించింది. కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజల వద్ద నుంచే రూ. 300 వరకు ఈ ముఠా వసూలు చేసిందని గుర్తించారు. సంతోషిలాల్, రషీద్ హస్మి, సంతోషిలాల్ ఇద్దరు భార్యలపై కేసు నమోదయ్యింది. ఈ కేసు విషయంలో మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్ పోలీసులతోనూ సీసీఎస్ పోలీసులు సంప్రదిస్తున్నారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...